పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలుపుకు తామే కారణమని ఎవరైనా అనుకుంటే అది వారి ఖర్మ అని జనసేన నేత నాగబాబు చేసిన వ్యాఖ్యల పట్ల వైసీపీ నేత అంబటి రాంబాబు స్పందించారు. నాగబాబుకు పదవి రాగానే చాలా తేడా కనిపిస్తోందని అన్నారు. ఏరు దాటాక తెప్ప తగలేసినట్టుగా ఉందని విమర్శించారు. నాడు పిఠాపురంలో పవన్ ను మీరే గెలిపించాలన్నారు ఇప్పుడు వర్మ, మీ ఖర్మ అంటున్నారు.కనీస గౌరవం లేకుండా మాట్లాడుతున్నారు. పిఠాపురం మీ అడ్డా అంటున్నారు.ఇక్కడ మీరు గెలిచింది తొలిసారి మాత్రమే అని అంబటి స్పష్టం చేశారు. ఇక జగన్ ఓ హాస్యనటుడు అని, వైఎస్ కొడుకు కాబట్టే సీఎం అయ్యాడని జనసేన ఆవిర్భావ సభలో నాగబాబు వ్యాఖ్యలు చేయడంపైనా అంబటి రాంబాబు స్పందించారు. చిరంజీవి తమ్ముడు కాకపోయి ఉంటే పవన్ కల్యాణ్ పరిస్థితి ఏమిటి? అని సూటిగా ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ ఏంటనేది క్లైమాక్స్ లో తెలుస్తుందని అన్నారు. జగన్ ఓ కమెడియన్ అని నాగబాబు అంటున్నారని.ఢిల్లీ పీఠానికే భయపడని వ్యక్తి జగన్ అని అంబటి స్పష్టం చేశారు. మీరా జగన్ గురించి మాట్లాడేది మీరు ఇక్కడిదాకా రావడానికే 16 ఏళ్లు పట్టింది అని విమర్శించారు. నిన్న జనసేన సభకు వచ్చిన జనాన్ని చూసి జబ్బలు చరుచుకోవాల్సిన అవసరం లేదని, అధికారం ఉంది కాబట్టి డబ్బు ఖర్చు పెట్టారు జనం వచ్చారు.ఇందులో విశేషమేమీ లేదని అన్నారు. అసలు, పిఠాపురంలో జరిగింది దశ దిశ లేని సభ అని, ఏం చెప్పాలనుకున్నారో అది చెప్పలేకపోయారని ఎద్దేవా చేశారు.
![]() |
![]() |