ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మీకు ఉద్యోగం లేదా.. ,,, ఈ పథకాలతో బంపర్ రిటర్న్స్

business |  Suryaa Desk  | Published : Mon, Mar 17, 2025, 11:40 PM

స్వయం ఉపాధి కలిగిన వ్యక్తులు తరచుగా ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటుంటారు. స్థిరమైన జీతం లేకపోవడంతో, వారి ఆదాయం ఎప్పుడూ ఒకేలా ఉంటుందని భరోసా ఇవ్వలేం. ఇది క్రమం తప్పకుండా పొదుపు చేయడం కష్టతరం చేస్తుంది. ఈపీఎఫ్ వంటి సురక్షితమైన పొదుపు పథకాల ప్రయోజనం వీరికి లభించదు. వృద్ధాప్యంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండటానికి, చిన్న, మధ్య, మరియు దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి సరైన పెట్టుబడులు చేయడం చాలా ముఖ్యం. అనుకోని ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కోవడానికి అత్యవసర నిధిని కూడా ఏర్పాటు చేసుకోవాలి. మీరు స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తులు అయితే ఈ పెట్టుబడి ఆప్షన్లు పరిశీలించండి.


పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ - పీపీఎఫ్ అనేది ప్రభుత్వం నిర్వహించే సురక్షితమైన పొదుపు పథకం. ఇది స్థిర ఆదాయ పెట్టుబడి. కేంద్ర ప్రభుత్వం దీనికి హామీ ఇస్తుంది. బ్యాంకు  ఎఫ్డీల కంటే ఎక్కువ రాబడిని ఆశించే వారు పీపీఎఫ్ లో పెట్టుబడి పెట్టవచ్చు. ప్రస్తుతం పీపీఎఫ్ వార్షిక వడ్డీ రేటు 7.1 శాతంగా ఉంది. దీనికి 15 సంవత్సరాల లాకిన్ పీరియడ్ ఉంది. రిటైర్మెంట్ వంటి దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలకు ఇది మంచి ఎంపిక. సంవత్సరానికి కనీసం రూ. 500 నుంచి గరిష్టంగా రూ. 1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు.


పీపీఎఫ్ ఖాతా తెరిచిన 3వ సంవత్సరం నుండి ఆరో సంవత్సరం వరకు, కొన్ని నిబంధనలకు లోబడి, మీ పీపీఎఫ్ బ్యాలెన్స్‌పై లోన్ పొందవచ్చు. ఆర్థిక ఇబ్బందుల సమయంలో ఇది ఉపయోగపడుతుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద సంవత్సరానికి రూ. 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. పెట్టుబడి సహా వచ్చే వడ్డీ, మెచ్యూరిటీ ఆదాయంపై పూర్తి పన్ను మినహాయింపు ఉంటుంది. స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తులు ప్రతి సంవత్సరం తమ ఆదాయం నుంచి గరిష్టంగా రూ. 1.5 లక్షలు పీపీఎఫ్లో జమ చేసి, 15 సంవత్సరాల తర్వాత మొత్తం రూ. 40.68 లక్షలు పొందొచ్చు. రిటైర్మెంట్ తర్వాత నెలవారీ ఖర్చులకు ఇది ఉపయోగపడుతుంది. పీపీఎఫ్ కాలిక్యులేటర్ ద్వారా రిటర్న్స్ తెలుసుకోవచ్చు.


నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్-ఎన్ఎస్సీ అనేది స్థిర ఆదాయ పెట్టుబడి. దీన్ని భారతదేశంలోని ఏదైనా పోస్ట్ ఆఫీసులో పెట్టుబడి పెట్టవచ్చు. ఇది ప్రభుత్వ హామీతో కూడిన రాబడిని అందిస్తుంది. ఎన్ఎస్సీ ఒకేసారి చేసే పెట్టుబడి. దీనికి ఐదు సంవత్సరాల లాక్-ఇన్ పీరియడ్ ఉంది. 5 సంవత్సరాల పాటు పన్ను ఆదా చేయాలనుకునే వారికి, 5 సంవత్సరాల పన్ను ఆదా బ్యాంక్ ఎఫ్డీలతో పాటు, ఎన్ఎస్సీలు కూడా పన్ను ప్రయోజనాలను అందిస్తాయి. అయితే, 5 సంవత్సరాల పన్ను ఆదా బ్యాంక్ ఎఫ్డీ కంటే ఎన్ఎస్సీలు ఎక్కువ వడ్డీ రేటును అందిస్తాయి. ప్రస్తుతం ఎన్ఎస్సీలపై వడ్డీ రేటు 7.7 శాతం. ప్రముఖ బ్యాంకుల ఎఫ్లడీ వడ్డీ రేట్లతో పోలిస్తే ఇది ఎక్కువ.


ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో, ఎన్ఎస్సీపై లోన్ కూడా పొందవచ్చు. సెక్షన్ 80సీ కింద ఆర్థిక సంవత్సరానికి రూ. 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. పెట్టుబడిదారులకు నెలవారీ లేదా వార్షిక ప్రాతిపదికన వడ్డీ చెల్లింపు ఉండదు. పెట్టుబడి పెట్టిన మూలధనం మెచ్యూరిటీ సమయంలో మాత్రమే చెల్లించబడుతుంది. ఎన్ఎస్సీలో కనీస పెట్టుబడి రూ. 1,000. ఇది 5 సంవత్సరాల తర్వాత రూ. 1459 అవుతుంది. దీనిలో పెట్టుబడికి గరిష్ట పరిమితి లేదు. కానీ సెక్షన్ 80C కింద పన్ను ప్రయోజనం ఆర్థిక సంవత్సరానికి రూ. 1.5 లక్షల వరకు మాత్రమే. హామీతో కూడిన మంచి రాబడిని కోరుకునే స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తులు ఎన్ఎస్సీలో పెట్టుబడి పెట్టడాన్ని పరిగణించవచ్చు.


బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు- బ్యాంకు లేదా ఎన్బీఎఫ్లో ఎఫ్డీలో పెట్టుబడి పెట్టవచ్చు. ఇది మీ మూలధనాన్ని కాపాడే సురక్షితమైన పెట్టుబడి. బ్యాంక్ నిర్దిష్ట కాలానికి హామీ ఇచ్చిన వడ్డీ రేటును అందిస్తుంది. మీ పెట్టుబడి మొత్తం నిర్దిష్ట వడ్డీ రేటుతో లాక్ చేయబడుతుంది. ఇది మార్కెట్ హెచ్చుతగ్గుల ప్రభావానికి గురికాదు. వ్యక్తిగత లోన్లు, క్రెడిట్ కార్డుల ద్వారా పొందిన లోన్ల కంటే తక్కువ వడ్డీ రేటుతో బ్యాంక్ ఎఫ్డీ పూచీకత్తుగా ఉంచి లోన్ తీసుకోవచ్చు. పన్ను ఆదా ఎప్డీలో మీ పెట్టుబడిపై ఆర్థిక సంవత్సరానికి రూ. 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు కూడా పొందుతారు. అయితే, పన్ను ఆదా ఎఫ్డీ  ఐదు సంవత్సరాల లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది. కొన్ని ప్రభుత్వ బ్యాంకులు 3 సంవత్సరాల కాలానికి 6 నుండి 7.40 శాతం వార్షిక వడ్డీ రేటును అందిస్తుండగా, ప్రముఖ ప్రైవేట్ బ్యాంకులు 6.50 శాతం నుంచి 7.50 శాతం వార్షిక వడ్డీ రేటును అందిస్తున్నాయి.


మ్యూచువల్ ఫండ్స్- గత కొన్ని సంవత్సరాలుగా, మ్యూచువల్ ఫండ్స్ ప్రజాదరణ పొందిన పెట్టుబడి మార్గంగా మారాయి. అన్ని వయసుల, ఆర్థిక స్థితిగతుల వ్యక్తులు మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడుతున్నారు. స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తులు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌ను ఎంచుకోవచ్చు. వారు ఈ ఫండ్స్‌లో సీప్ ద్వారా లేదా ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టవచ్చు. రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడేవారు దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టవచ్చు. ఇది మీ డబ్బును ఈక్విటీ, డెట్, స్టాక్స్, బంగారం, రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెడుతుంది. సెక్షన్ 80C పన్ను మినహాయింపు కోసం, ఈఎల్ఎస్ఎస్లో పెట్టుబడి పెట్టడాన్ని పరిగణించవచ్చు. 8-10 సంవత్సరాల దీర్ఘకాలిక పెట్టుబడులపై మ్యూచువల్ ఫండ్స్‌లో 12 శాతం వరకు రాబడిని ఆశించవచ్చు. స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తులు మెచ్యూరిటీ మొత్తాన్ని ఏదైనా బ్యాంకులో పెట్టుబడి పెట్టి, రిటైర్మెంట్ సమయంలో ప్రతి నెల వచ్చే వడ్డీని ఉపయోగించుకోవచ్చు.


నేషనల్ పెన్షన్ స్కీమ్ - ఇది ప్రభుత్వ సామాజిక భద్రతా పథకం. ఇది ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల ఉద్యోగులకు మాత్రమే కాకుండా, స్వయం ఉపాధి పొందుతున్న లేదా అసంఘటిత రంగంలో పనిచేస్తున్న వ్యక్తులకు కూడా అందుబాటులో ఉంది. ఎన్పీఎస్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ లేదా రికరింగ్ డిపాజిట్ తో పోలుస్తారు. ఎందుకంటే ఇది మీ పెట్టుబడి లక్ష్యాలను చేరుకునే వరకు లేదా రిటైర్మెంట్ వయస్సు వచ్చే వరకు ప్రతి నెల ఒక నిర్దిష్ట మొత్తాన్ని పెట్టుబడి పెట్టడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. 18-70 సంవత్సరాల మధ్య వయస్సు గల వ్యక్తులు ఎన్పీఎస్ టైర్-1 ఖాతాను తెరవవచ్చు. రిటైర్మెంట్ తర్వాత, పెట్టుబడిదారులు ఫండ్‌లోని కొంత భాగాన్ని ఉపసంహరించుకోవచ్చు. మిగిలిన భాగాన్నిపీఎఫ్ఆర్డీఏ (పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ)తో నమోదు చేసుకున్న పెన్షన్ ఫండ్ మేనేజర్ నిర్వహిస్తారు. ఇది ఎన్పీఎస్  పర్యవేక్షిస్తుంది మరియు నియంత్రిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com