ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చందనంతో మీ అందం రెట్టింపు, ఎలా వాడాలో తెలుసా

Life style |  Suryaa Desk  | Published : Mon, Mar 17, 2025, 11:53 PM

అందంగా ఉండాలని ఎవరూ కోరుకోరు. ప్రతి ఒక్కరు అందమైన, మచ్చల్లేని, మృదువైన చర్మం కావాలని తాపత్రయపడుతుంటారు. అయితే, ప్రస్తుత జీవనశైలి, ఆహారపు అలవాట్లు, పొల్యూషన్ కారణంగా మొటిమలు, మచ్చలు, చర్మం పొడిబారడం వంటి సమస్యలు సాధారణంగా మారాయి. మొటిమలు, మచ్చలు చర్మం యొక్క సహజ మెరుపును తగ్గిస్తాయి. ఇక, వీటికి చెక్ పెట్టడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. మార్కెట్లో దొరికే ఖరీదైన ప్రొడక్ట్స్ వాడటం, బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరగడం లాంటి పనులు చేస్తుంటారు.


ఇవి ఖర్చుతో కూడుకున్న పనులు. అంతేకాకుండా దీర్ఘకాలికంలో చర్మ సమస్యలు మరింత పెంచే అవకాశం ఉంది. అయితే, కొన్ని సహజ పద్ధతుల ద్వారా మొటిమలు, మచ్చలు, పొడిబారడం వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు. సహజ పదార్థాల్లో ఒకటైన చందనంతో ఈ సమస్యలకు చెక్ పెట్టవచ్చంటున్నారు నిపుణులు. పురాతన కాలం నుంచి చర్మ సంరక్షణలో చందనాన్ని ఉపయోగిస్తున్నారు. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ వంటి లక్షణాలు ఉన్నాయి. చందనాన్ని చర్మ సంరక్షణ కోసం ఎలా వాడాలో ఇక్కడ తెలుసుకుందాం.


మొటిమలకు చెక్ పెట్టడానికి గంధపు ఫేస్ ప్యాక్


ఈ రోజుల్లో చాలా మంది మొటిమలతో బాధపడుతున్నారు. అలాంటి వారికి గంధపు ఫేస్ ప్యాక్ బెస్ట్ ఆప్షన్. ఇందుకోసం ఒక టీ స్పూన్ చందనం పొడి తీసుకోండి. దానికి రోజ్ వాటర్ జోడించి మందపాటి పేస్ట్‌లా చేయండి. ఈ పేస్టుని మొటిమలపై అప్లై చేసి 15-20 నిమిషాల పాటు అలాగే ఉంచండి. ఆ తర్వాత శుభ్రమైన నీటితో ముఖాన్ని కడిగేయండి. ఈ ప్యాక్ చర్మం నుంచి బ్యాక్టీరియాను తొలగించడం ద్వారా మొటిమలు రాకుండా చేస్తుంది. చర్మాన్ని ఇన్ఫ్లమేషన్ బారి నుంచి రక్షిస్తుంది. చర్మాన్ని చల్లబర్చి మంటను తగ్గిస్తుంది.


మచ్చల కోసం చందనం ఫేస్ ప్యాక్


​చర్మంపై ఉన్న నల్లటి మచ్చలు అందాన్ని దెబ్బతీస్తాయి. అందుకే వీటిని తగ్గించుకోవాలి. ఇందుకోసం ఒక టీ స్పూన్ గంధపు పొడిలో అర టీస్పూన్ పసుపు, పాలు కలపాలి. దీన్ని ముఖానికి అప్లై చేసి 15 నిమిషాలు ఆరనివ్వాలి. ఆ తర్వాత కడిగేయాలి. చందనం, పసుపు చర్మాన్ని ప్రకాశవంతంగా మారుస్తాయి. ఈ ప్యాక్ మచ్చలను తొలగించడంలో సాయపడుతుంది. పాలు చర్మాన్ని తేమగా ఉంచి మృదువుగా మారుస్తుంది.


జిడ్డు చర్మానికి గంధపు ఫేస్ మాస్క్


చాలా మంది జిడ్డు చర్మంతో బాధపడుతుంటారు. జిడ్డు చర్మం వల్ల మురికి, మలినాలు పేరుకుపోతాయి. అందుకే చర్మాన్ని జిడ్డుగా లేకుండా చూసుకోవాలి. ఇందుకోసం ముల్తానీ మట్టి, నిమ్మరసాన్ని ఒక టీ స్పూన్ గంధపు పొడిలో కలపండి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖమంతా అప్లై చేసి 20 నిమిషాల పాటు అలాగే ఉంచండి. ఆ తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ మాస్క్ చర్మంపై అదనపు నూనెను నియంత్రిస్తుంది. చర్మానికి మ్యాట్ ఫినిషింగ్ ఇస్తుంది. నిమ్మరసం చర్మ రంధ్రాల్ని బిగించి మొటిమల్ని తగ్గిస్తుంది.


పొడి చర్మానికి గంధం, తేనె ప్యాక్


ఏ సీజన్ అయినా సరే చాలా మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య పొడి చర్మం. ఈ సమస్యకు చెక్ పెట్టడానికి గంధం, తేనె ప్యాక్ ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇందుకోసం ఒక టీస్పూన్ తేనెను ఒక టీ స్పూన్ గంధపు పొడితో కలపండి. ఈ మిశ్రమాన్ని బాగా కలపండి. ఆ తర్వాత దీన్ని ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల పాటు అలాగే ఉంచండి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ చర్మానికి లోతైన తేమను అందిస్తుంది. చర్మం పొడిబారకుండా కాపాడుతుంది. తేనె, గంధం చర్మాన్ని మృదువుగా చేస్తాయి.


మెరిసే చర్మం కోసం చందనం, కలబంద జెల్ ప్యాక్


మెరిసే చర్మం, రెట్టింపు అందం కోసం ఈ ప్యాక్ ఉపయోగపడుతుంది. ఇందుకోసం ఒక టీస్పూన్ గంధపు పొడిని, ఒక టీస్పూన్ కలబంద జెల్‌తో కలపాలి. దీన్ని ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది చర్మాన్ని రిఫ్రెష్ చేసి సహజమైన మెరుపును ఇస్తుంది. కలబంద చర్మపు చికాను తగ్గిస్తుంది. గంధం చల్లదనాన్ని అందిస్తుంది. మొటిమలు, మచ్చలు, పొడి చర్మంతో బాధపడుతుంటే గంధం వాటిని తగ్గిస్తుంది. పై చెప్పిన ప్యాక్‌ల్లో వారానికి రెండు మూడు సార్లు ప్రయత్నిస్తే మంచి మార్పు చూడవచ్చంటున్నారు నిపుణులు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com