విశాఖ వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక సంస్థల్లో వైసీపీ నుంచి గెలుపొందిన అనేక మంది ప్రజా ప్రతినిధులు ఆ పార్టీని వీడి కూటమిలోని టీడీపీ, జనసేన పార్టీల్లో చేరుతున్నారు. ఇప్పటికే విశాఖ నగర పాలక సంస్థకు చెందిన 12 మంది కార్పొరేటర్లు వైసీపీని వీడి కూటమి చెంతకు చేరగా, మరో 9 మంది కార్పొరేటర్‌లు నేడు టీడీపీలో చేరేందుకు సిద్దమయ్యారు. చల్లా రజని, గేదెల లావణ్య, సునీత, భూపతిరాజు సుజాత, ముర్రు వాణితో పాటు మరో నలుగురు కార్పొరేటర్లు టీడీపీలో చేరేందుకు ఈరోజు అమరావతికి చేరుకున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి 29 మంది మాత్రమే కార్పొరేటర్లుగా గెలవగా, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నుంచి 11 మంది నేరుగా టీడీపీలో చేరారు. జనసేన పార్టీకి ముగ్గురు కార్పొరేటర్లు ఉండగా, వైసీపీ, స్వతంత్రులుగా గెలిచిన ఏడుగురు జనసేన పార్టీలో చేరారు. బీజేపీ నుంచి ఒక కార్పొరేటర్ గెలవగా, ఇటీవల వైసీపీ నుంచి మరొకరు ఆ పార్టీలో చేరారు. దీంతో కూటమి బలం 52కి చేరింది. ఈ రోజు మరో 9 మంది టీడీపీలోకి రానుండటంతో కూటమి బలం 61కి చేరుతుంది.మొత్తం 98 కార్పొరేటర్ స్థానాలు ఉన్న విశాఖ నగరంలో ప్రస్తుతం 97 మంది ఉన్నారు. గత ఎన్నికల్లో కార్పొరేటర్‌గా గెలిచిన వంశీకృష్ణ శ్రీనివాస్ ఎమ్మెల్యేగా ఎన్నిక అవ్వడంతో ఆ స్థానం ఖాళీగా ఉంది. జీవీఎంసీ మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు అవసరమైన దాని కంటే ఎక్కువమంది కార్పొరేటర్లు కూటమిలోకి చేరనుండడంతో రేపు 19వ తేదీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉందని అంటున్నారు. కూటమి బలం వివరాలతో జీవీఎంసీ ఇన్ చార్జి కమిషనర్, కలెక్టర్ హరేంధిరప్రసాద్‌ను కలిసి లేఖ సమర్పించనున్నారు. ఇప్పటికే వైసీపీ మేయర్‌పై అవిశ్వాసం పెట్టడానికి కార్పొరేటర్ల నుంచి టీడీపీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాసరావు సంతకాల సేకరణ పూర్తి చేశారు.
![]() |
![]() |