మహారాష్ట్రలో నాగ్‌పుర్ లో రెండు గ్రూప్‌ల మధ్య చెలరేగిన హింసతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘర్షణల్లో ఒక అల్లరిమూక డ్యూటీలో ఉన్న మహిళా పోలీసు అధికారితో అసభ్యకరంగా ప్రవర్తించింది.దీనిపై గణేశ్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. కొందరు ఉద్రిక్తతలను మరింత రెచ్చగొట్టేలా నినాదాలు చేసినట్లు ఎఫ్‌ఐఆర్‌లోని వివరాలను బట్టి తెలుస్తోంది. దాంతో 51 మందిపై కేసు నమోదైంది.ఇటీవల చెలరేగిన హింసకు కొన్ని అసత్య ప్రచారాలు కారణమని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించిన సంగతి తెలిసిందే. దానిని కట్టడి చేసేందుకు మోహరించిన ర్యాపిడ్ కంట్రోల్ పోలీస్ దళంలో ఆ పోలీసు అధికారిణి విధులు నిర్వర్తిస్తున్నారు. తనకు ఎదురైన పరిస్థితి గురించి ఆమె వెంటనే సీనియర్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దాంతో అల్లరిమూకపై కేసు నమోదైంది. అదే ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తోన్న మరో అధికారిణి కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొన్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. డ్యూటీలో ఉన్న సిబ్బందిని బెదిరించేలా సంజ్ఞలు చేశారని తెలిపారు.
నాగ్‌పుర్ అల్లర్ల సూత్రధారిగా అనుమానిస్తోన్న ఓ వ్యక్తి ఫొటోను తాజాగా పోలీసులు విడుదల చేశారు. అతడి పేరు ఫాహిమ్ ఖాన్. 2024 లోక్‌సభ ఎన్నికల్లో నాగ్‌పుర్ నియోజకవర్గం నుంచి పోటీ చేశాడు. అది కూడా భాజపా అగ్రనేత నితిన్ గడ్కరీ మీద కావడం గమనార్హం. ఇదిలాఉంటే.. మార్చి 17న చోటుచేసుకున్న హింసలో పలువురు గాయపడిన సంగతి తెలిసిందే. ఈ హింసాత్మక ఘటనలో 34 మంది పోలీసులు గాయపడ్డారని, ఇందులో ముగ్గురు డిప్యూటీ కమిషనర్లు కూడా ఉన్నారని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ తెలిపారు.
![]() |
![]() |