కేరళ లోని వాయనాడ్ జిల్లా లో పలు మహిళా సాధికారత ప్రాజెక్టుల కు శుక్రవారం కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకాగాంధీ శంకుస్థాపన చేశారు. ఈ అభివృద్ధి ప్రాజెక్టులు మహిళల నేతృత్వంలో పనిచేస్తాయని చెప్పారు. వాయనాడ్ జిల్లాలోని తన్విన్‌హాల్ గ్రామ పంచాయతీ లో జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రియాంకాగాంధీ మాట్లాడుతూ.. ఇవాళ నేను ఆధునిక అంగన్‌వాడీ కేంద్రమైన ‘టేక్ ఎ బ్రేక్ సెంటర్’కు శంకుస్థాపన చేశానని, ఇది పర్యాటకులకు విశ్రాంతి కేంద్రంగా, వినోద కేంద్రంగా పనిచేస్తుందని చెప్పారు. ఈ కేంద్రాన్ని మహిళా సంఘాల మహిళలు ఆపరేట్ చేస్తారని తెలిపారు. ఈ కేంద్రంలో కెఫటేరియా, పార్కు ఉన్నాయని, అవి కూడా మహిళల నేతృత్వంలోనే కొనసాగుతాయని అన్నారు. ఈ కేంద్రాన్ని మహిళలు నడుపడం అద్భుతంగా ఉంటుందని చెప్పారు.
పురుషులు తరచూ మహిళల శక్తిని తక్కువ అంచనా వేస్తుంటారని, కానీ మనం తలుచుకుంటే ఏదైనా చేయగలమని గ్రామానికి చెందిన మహిళలను ఉద్దేశించి ప్రియాంకాగాంధీ వ్యాఖ్యానించారు. ఇంటిని, కుటుంబాన్ని మనం అద్భుతంగా నడుపుతున్నామని, మనం ఏ పనిచేసినా, అది కార్యాలయంలో అయినా, వ్యాపారంలో అయినా అంకితభావంతో చేస్తామని చెప్పారు. తన్విహాల్ పంచాయతీ ఏరియా మంచి పర్యాటక ప్రాంతమని, ఈ ఏరియాలో సహజ అందాలు అద్భుతంగా ఉన్నాయని, ఇలాంటి ఏరియాలో మహిళకు సంబంధించిన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడం తనకు సంతోషంగా ఉందని చెప్పారు.
![]() |
![]() |