హైదరాబాద్ నుంచి రాజమండ్రికి బైక్ పై వెళుతుండగా పాస్టర్ పగడాల ప్రవీణ్ అనుమానాస్పద స్థితిలో రోడ్డు పక్కన విగతజీవుడిగా పడి ఉండడం సంచలనం సృష్టించింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, పాస్టర్ ప్రవీణ్ మృతి కేసు విచారణపై తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిశోర్ ప్రకటన చేశారు. డీఎస్పీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో పారదర్శకంగా దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ప్రమాద స్థలాన్ని ఫోరెన్సిక్ నిపుణుల బృందం క్షుణ్ణంగా పరిశీలించిందని వెల్లడించారు. కేసు దర్యాప్తులో 5 ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయని... సీసీ కెమెరాల ఫుటేజి పరిశీలించి, సమాచారాన్ని సేకరిస్తున్నామని ఎస్పీ వివరించారు. కేసు విచారణలో భాగంగా పాస్టర్ ప్రవీణ కుటుంబ సభ్యుల వాంగ్మూలం కూడా నమోదు చేశామని చెప్పారు. ఈ కేసు దర్యాప్తు పురోగతిని ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారని స్పష్టం చేశారు. ఈ కేసుకు సంబంధించి పుకార్లు, అసత్యాలు ప్రచారం చేయవద్దని పేర్కొన్నారు.. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే పోస్టులు పెడితే కేసులు తప్పవని హెచ్చరించారు. ఈ కేసుకు సంబంధించి ఎవరి దగ్గరైనా ఆధారాలు ఉంటే కొవ్వూరు డీఎస్పీకి అందించాలని సూచించారు.
![]() |
![]() |