వరుసగా రెండు మ్యాచ్ లలో ఓడిపోయి తీవ్ర ఒత్తిడిలో నేడు మూడో మ్యాచ్ ఆడిన ముంబయి ఇండియన్స్ స్ఫూర్తిదాయక విజయాన్ని అందుకుంది. ముంబయిలోని వాంఖెడే స్టేడియంలో కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో ఎంఐ జట్టు 8 వికెట్ల తేడాతో ఘనంగా నెగ్గింది. తొలుత ముంబయి ఇండియన్స్ పేసర్ అశ్వని కుమార్ 4 వికెట్లతో రాణించగా, కేకేఆర్ 16.2 ఓవర్లలో 116 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం, స్వల్ప లక్ష్యాన్ని ముంబయి ఇండియన్స్ 12.5 ఓవర్లలోనే ఛేదించింది. ఈ క్రమంలో 2 వికెట్లు కోల్పోయి 121 పరుగులు చేసింది.ముంబయి ఇన్నింగ్స్ లో ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన రోహిత్ శర్మ మరోసారి తన పేలవ ఫామ్ ను చాటుకుంటూ 13 పరుగులకే వెనుదిరిగాడు. మరో ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ మాత్రం దూకుడుగా ఆడుతూ స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. రికెల్టన్ 41 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సులతో అజేయంగా 62 పరుగులు చేశాడు. అవతలి ఎండ్ లో సూర్యకుమార్ యాదవ్ కూడా మెరుపుదాడి చేశాడు. సూర్యకుమార్ 9 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులతో 27 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. వన్ డౌన్ లో వచ్చిన విల్ జాక్స్ 16 పరుగులు చేశాడు. కోల్ కతా నైట్ రైడర్స్ బౌలర్లలో ఆండ్రీ రసెల్ 2 వికెట్లు తీశాడు.
![]() |
![]() |