సముద్ర తీరంలో సరదాగా గడిపేందుకు వెళ్లిన ఇద్దరు యువకులు అలల తాకిడికి కొట్టుకుపోయారు. అక్కడే ఉన్న పోలీసులు వెంటనే స్పందించి వారిని ఒడ్డుకు తీసుకొచ్చారు. నీరు మింగడం వల్ల అస్వస్థతకు గురైన యువకులలో ఒకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందారు. ఈ విషాద సంఘటన బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామాపురం తీరంలో బుధవారం చోటుచేసుకుంది. పర్చూరు నెహ్రూ కాలనీకి చెందిన చుక్కా వంశీ, రాజేష్ లు సముద్రంలో అలల తాకిడికి కొట్టుకుపోయారు. సమీపంలో ఉన్న మెరైన్ పోలీసులు వెంటనే స్పందించారు. సముద్రంలోకి వెళ్లి యువకులను ఒడ్డుకు తీసుకొచ్చారు. వంశీ(27) పరిస్థితి విషమించడంతో చీరాల ఏరియా వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యలో తుదిశ్వాస విడిచాడు. ఇదేప్రాంతంలో జరిగిన మరో సంఘటనలో పల్నాడు జిల్లా పసుమర్తికి చెందిన షేక్ రహంతుల్లా అలల ధాటికి కొట్టుకుపోగా, మెరైన్ పోలీసులు రక్షించి సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.
![]() |
![]() |