మయన్మార్ లో సంభవించిన భూకంపం కారణంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. భవన శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే, భూకంపం సంభవించి ఐదు రోజులు కావడంతో శిథిలాల కింద చిక్కుకున్న వారు ప్రాణాలతో ఉండే అవకాశం లేదని నిపుణులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఒక అద్భుతం చోటుచేసుకుంది. ఐదు రోజుల తర్వాత కూడా శిథిలాల కింద ప్రాణాలతో ఉన్న ఒక యువకుడిని రెస్క్యూ సిబ్బంది అతికష్టమ్మీద బయటకు తీశారు.ఆహారం, నీరు లేకపోవడంతో పాటు గాయాల కారణంగా ఆ యువకుడు నీరసంగా మారినప్పటికీ ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. దీంతో ఆ యువకుడు మృత్యుంజయుడయ్యాడని అంటున్నారు. ఈ అద్భుతం మయన్మార్ రాజధాని నేపిడాలో చోటుచేసుకుంది. ఇదిలా ఉండగా, ఇటీవల మాండలేలోని గ్రేట్‌వాల్ హోటల్ శిథిలాల నుంచి రెస్క్యూ సిబ్బంది ఒక గర్భిణీని సజీవంగా వెలికితీశారు. భూకంపం కారణంగా మయన్మార్ లో ఇప్పటివరకు 2,719 మంది మరణించారని, 4,521 మంది గాయపడ్డారని జుంటా అధికారులు వెల్లడించారు. ఇంకా 441 మంది ఆచూకీ తెలియరావాల్సి ఉందని వారు పేర్కొన్నారు.
![]() |
![]() |