బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి, తెలంగాణలో బిల్లును తీసుకొచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజమైన హీరో అని సినీ నటుడు సుమన్ ప్రశంసించారు. బీసీ రిజర్వేషన్లపై సందేహాలు వ్యక్తమైన తరుణంలో అసెంబ్లీలో బిల్లును ఆమోదింపజేసిన ఘనత రేవంత్ రెడ్డిదేనని కొనియాడారు. తెలంగాణలో బీసీలకు విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసే బిల్లుకు ఆమోదం లభించడం సంతోషకరమని ఆయన అన్నారు. ఈ మేరకు బుధవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న బీసీల పోరు గర్జన సభకు సుమన్ సంఘీభావం తెలిపారు.బీసీ సంక్షేమ సంఘం జాతీయ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ దీక్షలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. బీసీలంతా రేవంత్ రెడ్డికి మద్దతుగా ఉంటామని స్పష్టం చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని బీసీలు, గౌడ్లకు ఎస్టీ హోదా ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. చాలా కాలంగా ఈ డిమాండ్ ఉన్నప్పటికీ గత ప్రభుత్వాలు దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని సుమన్ అన్నారు. ఈ డిమాండ్ ను నెరవేరిస్తే సీఎం రేవంత్ రెడ్డి తమ పాలిట దేవుడుగా మారతారని సుమన్ చెప్పుకొచ్చారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీకి సుమన్ విజ్ఞప్తి చేశారు.
![]() |
![]() |