జగన్ ఇవాళ తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. కూటమి ప్రభుత్వ ఆగడాలను ధైర్యంగా ఎదుర్కొన్నారంటూ వారిని ఆయన అభినందించారు. "మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉండాలని నమ్మే వ్యక్తిని. నేను అలాగే ఉంటాను, పార్టీకూడా అలాగే ఉండాలని ప్రతిక్షణం ఆశిస్తున్నాను. నేను ఏది నమ్ముతానో అదే పాటిస్తాను" అని స్పష్టం చేశారు. "ఉప ఎన్నికల్లో మీరు చూసిన తెగువకు, ధైర్యానికి హాట్సాఫ్. మొత్తం 50 చోట్ల ఎన్నికలు జరిగితే, 39 స్థానాలు వైఎస్సార్‌సీపీ గెలిచింది. కార్యకర్తలు తెగింపు చూపారు. తెలుగుదేశం పార్టీకి ఈ స్థానాల్లో ఎక్కడా గెలిచే నంబర్లు లేవు. వారికి సంఖ్యా బలం లేనే లేదు. కానీ భయాందోళనల ఈ ప్రభుత్వం మధ్య ఎన్నికలు నిర్వహించాలనుకుంది. పోలీసులతో భయపెట్టి, బెదిరించారు. ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నానని చెప్పుకుంటున్న చంద్రబాబుకి బుద్ధిలేదు. వాస్తవంగా ఈ ఎన్నికలను టీడీపీ వదిలేయాలి. కానీ అధికార అహంకారంతో ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని చూశారు. నిజంగా ఇది ధర్మమేనా న్యాయమేనా అని ప్రశ్నించారు.తిరుపతి మున్సిపల్ ఉప ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, విశాఖపట్నంలో అవిశ్వాస తీర్మానం ద్వారా అక్రమాలకు పాల్పడుతున్నారని జగన్ ఆరోపించారు. రామగిరిలో 10కి తొమ్మిది ఎంపీటీసీ స్థానాలు వైసీపీ గెలుచుకున్నా ఎన్నికలు జరగకుండా అడ్డుకుంటున్నారని, పోలీసులే ఎంపీటీసీలను కిడ్నాప్ చేస్తున్నారని ఆయన అన్నారు. బీసీ నాయకుడు లింగమయ్యను చంపేశారని ఆరోపించారు. ప్రతి నియోజకవర్గంలో చంద్రబాబు ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారని జగన్ విమర్శించారు.కుప్పంలో 16 ఎంపీటీసీ స్థానాలకు గాను 16 స్థానాలు వైసీపీ గెలుచుకుందని, అయితే ఆరుగురిని ప్రలోభాలకు గురిచేసి తీసుకెళ్లారని, మిగిలిన 9 మందిని ఎన్నికల కేంద్రానికి వెళ్లనీయకుండా అడ్డుకున్నారని జగన్ ఆరోపించారు. కోరం లేకున్నా గెలిచినట్లు ప్రకటించుకున్నారని ఆయన విమర్శించారు.రాబోయే రోజుల్లో వైసీపీ అఖండ మెజార్టీతో గెలుస్తుందని, కార్యకర్తల కోసం కచ్చితంగా పార్టీ నిలబడుతుందని జగన్ అన్నారు. కోవిడ్ కారణంగా కార్యకర్తలకు తాను చేయాల్సింది చేయలేకపోయానని, జగన్ 2.Oలో కార్యకర్తల కోసం గట్టిగా నిలబడతానని హామీ ఇచ్చారు
![]() |
![]() |