ముంబయి-నాగ్‌పూర్ జాతీయ రహదారిపై నటుడు సోనూసూద్ భార్య సోనాలి రోడ్డు ప్రమాదం బారిన పడ్డ విషయం తెలిసిందే. సోనూ సూద్ భార్య... తన సోదరి, మేనల్లుడితో కలిసి ఎక్స్‌ప్రెస్‌వేపై ఎంజీ విండ్సర్ ఎలక్ట్రిక్ వాహనంలో వెళుతున్న సమయంలో భారీ ప్రమాదం జరిగింది. వారు ప్రయాణిస్తున్న వాహనం ట్రక్కును బలంగా ఢీకొట్టడంతో కారు ముందు భాగం మొత్తం నుజ్జునుజ్జయింది. కానీ, అదృష్టవశాత్తు కారులో ఉన్న ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదం గురించి తాజాగా సోనూసూద్ మాట్లాడుతూ తన కుటుంబ సభ్యులు ప్రాణాలతో సురక్షితంగా బయటపడటం వెనుక ఉన్న కారణాన్ని వెల్లడించారు. వారు ముగ్గురు సీట్ బెల్ట్ పెట్టుకుని ఉండటం వల్లే ఇవాళ ప్రాణాలతో ఉన్నారని తెలిపారు. ఈ సందర్భంగా వెనుక సీటు బెల్ట్ సేఫ్టీ గురించి వివరించారు. చాలా సందర్భాల్లో వెనుక సీట్లో ఉన్నవాళ్లు సీట్ బెల్ట్ పెట్టుకోరు. కాని ప్రజలు ఈ అలవాటును మార్చుకోవాలని సూచించారు. కారులో ఎక్కడ కూర్చున్నా రెగ్యులర్‌గా సీట్ బెల్ట్ పెట్టుకోవడం మంచిదని చెప్పారు. అలా కారులోని ప్రతి ఒక్కరూ సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల ఇవాళ తన కుటుంబ సభ్యులు ప్రాణాలతో బయటపడ్డట్టు చెప్పుకొచ్చారు. అందరూ రోడ్డు సేఫ్టీ రూల్స్ తప్పకుండా పాటించాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. ఇది ప్రాణాలకు సబంధించిన విషయం కాబట్టి ఈ విషయంలో అజాగ్రత్త పనికిరాదని సోనూసూద్ పేర్కొన్నారు. అలాగే డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని కోరారు. నిర్లక్ష్యంతో కూడిన డ్రైవింగ్ ఎప్పటికైనా ప్రమాదమేనని పేర్కొన్నారు.
![]() |
![]() |