భూకంపాలు వంటి ప్రకృతి విపత్తులను మనుషుల కంటే ముందే జంతువులు గుర్తిస్తాయని నిపుణులు చెబుతుంటారు. నిజమే.. జంతువులకు మనుషుల కంటే చాలా సున్నితమైన ఇంద్రియాలు ఉంటాయి. అవి భూమిలో వచ్చే స్వల్ప మార్పులను, ప్రకంపనలను గుర్తించగలవు. భూకంపం వంటి ప్రకృతి విపత్తులు సంభవించడానికి ముందు జంతువులు అసాధారణంగా ప్రవర్తిస్తాయి. అవి భయంతో పరిగెత్తడం, గుంపులుగా చేరడం, కంటిన్యూగా అరవడం వంటివి చేస్తాయి. తాజాగా అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో భూకంపం సంభవించడానికి ముందు జూపార్కులో ఏనుగులు, ఇళ్లలో పెంపుడు జంతువులు ఇలానే ప్రవర్తించాయి.
సోమవారం ఉదయం దక్షిణ కాలిఫోర్నియాలో 5.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూ ప్రకంపనల ప్రభావం శాన్ డియాగో సిటీపై ఎక్కువగా పడింది. అయితే, భూమి కంపించడానికి ముందే శాన్ డియాగో జూ సఫారి పార్క్‌లోని ఆఫ్రికన్ ఏనుగులు స్పందించాయి. ఎన్‌క్లోజర్‌లో గోడ వద్ద ఉన్న ఏనుగులు.. భూకంపాన్ని గుర్తించి మధ్యలోకి పరిగెత్తుకొచ్చాయి. కాసేపు సైలెంట్‌గా ఉండి.. ఏం జరుగుతుందా అని గమనించిన ఏనుగులు.. ఆ తర్వాత తమ పిల్లలను రక్షించుకోవడానికి గుమిగూడాయి. ఈ ఎన్‌క్లోజర్‌లో మొత్తం ఐదు ఏనుగులు ఉండగా.. వాటిలో రెండు పిల్ల ఏనుగులు ఉన్నాయి. ఈ రెండు పిల్లల్ని రక్షించడానికి మూడు పెద్ద ఏనుగులు వాటి చుట్టూ వలయంలా నిలబడ్డాయి. మూడు ఏనుగులు మూడు దిక్కులుగా నిలబడి గున్న ఏనుగులను రక్షించే ప్రయత్నం చేశాయి. ప్రకంపనలు ఆగిపోయినప్పటికీ అవి కదలకుండా కాసేపు అలాగే ఉండిపోయాయి. ఈ విజువల్స్ అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.
శాన్ డియాగో జూలో ఏనుగుల స్పందన గురించి పార్క్‌లోని మామల్స్ క్యూరేటర్ మిండీ ఆల్‌బ్రైట్ స్పందించారు. ప్రమాదం ఎక్కడ పొంచిఉందో తెలుసుకోవడానికి ఏనుగులు కాసేపు ఫ్రీజ్ అయిపోయాయని మిండీ చెప్పారు. కేవలం జూలో మాత్రమే కాదని.. అడవిలో ప్రమాదం సంభవించినప్పుడు కూడా గుంపు ఏనుగులు ఇలాగే ప్రవర్తిస్తాయన్నారు. ప్రమాదం పొంచి ఉన్నప్పుడు గుంపు ఏనుగులు ‘అలర్ట్ సర్కిల్’ను ఏర్పరుస్తాయట. పిల్లల్ని మధ్యలో ఉంచి పెద్ద ఏనుగులు ముఖాలు బయటికి పెట్టి నిలబడి వాటిని రక్షిస్తాయట. ఒకవేళ పిల్ల ఏనుగులు మాట వినకపోతే తొండంతో లాక్కొచ్చి మధ్యలో నిలబెడతాయట. శాన్ డియాగో జూ వీడియోలో కూడా ఒక పిల్ల ఏనుగు నేరుగా పెద్ద ఏనుగుల మధ్యలోకి పరిగెత్తగా.. మరో గున్న ఏనుగు మధ్యలోకి వెళ్లకుండా సంకోచిస్తూ నిలబడింది. నాకేం అవుతుందులే అనే ధైర్యం కావచ్చు. కానీ పెద్ద ఏనుగు తన తొండంతో ఆ గున్నను లోపలికి తీసుకొచ్చింది.
అయితే, కేవలం జూలో ఏనుగులు మాత్రమే కాదు.. శాన్ డియాగో సిటీలోని చాలా ఇళ్లలో పెంపుడు కుక్కలు, పిల్లులు ఈ భూకంపాన్ని ముందుగానే పసిగట్టాయి. పెట్ డాగ్స్ ఇంట్లో నుంచి పరుగులు పెడుతున్న వీడియోలు సైతం సెక్యూరిటీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ భూకంపం కారణంగా శాన్ డియాగో నుంచి లాస్ ఏంజిల్స్ వరకు అంటే దాదాపు 120 మైళ్ల వరకు ప్రకంపనలు సంభవించాయి. శాన్ డియాగో కౌంటీలోని రూరల్ రోడ్స్‌లో పగుళ్లు ఏర్పడ్డాయి. జూలియన్‌లో కొండచరియలు విరిగిపడ్డాయి. అయినప్పటికీ అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఎవరికీ గాయాలు కూడా కాలేదని ఎన్‌బీసీ న్యూస్ రిపోర్ట్ చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa