ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమల శ్రీవారి భక్తులకు అద్భుత అవకాశం.. అన్నీ బ్రాండెడ్‌వే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 21, 2025, 08:09 PM

తిరుమల శ్రీవారి దర్శనానికి నిత్యం వేలాదిమంది భక్తులు తరలివస్తుంటారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు.. కొందరు భక్తులు స్వామివారికి విరాళాలు, కానుకల్ని సమర్పిస్తారు. కొందరు డబ్బులు, బంగారం, వెండి అందిస్తారు.. మరికొందరు వాహనాల నుంచి విలువైన వస్తువుల వరకు అందిస్తుంటారు. ఈ క్రమంలో తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలలో హుండీ ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన వాచీల‌ను వేలం వేయనున్నారు. వీటిని మే 1, 2వ తేదీల‌లో రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలు పోర్టల్ ద్వారా ఈ- వేలం వేయ‌నున్నారు. ఇందులో టైటాన్‌, సిటిజ‌న్‌, సొనాట, రాగా, టైమ్స్, టైమెక్స్‌, ఇత‌ర కంపెనీల స్మార్ట్ వాచీలున్నాయి.


కొత్తవి/ఉపయోగించిన/పాక్షికంగా దెబ్బతిన్న వాచీలు మొత్తం 62 లాట్లు ఈ-వేలంలో ఉంచారని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. మరిన్ని వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్‌ కార్యాలయం (వేల‌ములు) 0877-2264429 నంబ‌రులో కార్యాలయం వేళల్లో.. అలాగే టీటీడీ వెబ్‌సైట్‌ www.tirumala.org లేదా రాష్ట్ర ప్రభుత్వ పోర్టల్ www.konugolu.ap.govt.in ను సంప్రదించాలని సూచించింది టీటీడీ. ఆసక్తి ఉన్న భక్తులు వేలం పాటలో పాల్గొని స్వామివారికి సమర్పించిన ఈ కానుకల్ని దక్కించుకోవచ్చని తెలిపింది టీటీడీ.


 శ్రీ అగస్తీశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు


నారాయణవనం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ మరగదవల్లీ సమేత అగస్తీశ్వరస్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు మే 1 నుండి 10వ తేదీ వరకు ఘనంగా జరుగనున్నాయి. ఏప్రిల్ 30వ తేదీ సాయంత్రం 6 నుండి రాత్రి 8.30 గంటల వరకు గణపతి ఉత్సవం, అంకురార్పణం నిర్వహిస్తారు.


మే 1వ తేదీ ఉదయం 7.30 నుండి 9 గంటల మధ్య వృష‌భ‌ లగ్నంలో ధ్వజారోహణం నిర్వహించనున్నారు. అదేరోజు రాత్రి 7.30 గంటలకు చంద్రప్రభ వాహనంపై అగస్తీశ్వరస్వామి భక్తులకు దర్శనమివ్వనున్నారు. ప్రతిరోజూ ఉదయం 10 నుండి 11 గంటల మధ్య స్వామివారి ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం నిర్వహించనున్నారు. ప్రతి రోజు రాత్రి 7.30 గంటలకు స్వామివారి వాహన సేవలు ఉంటాయి.


మే 2వ తేదీ సింహ వాహనం, మే 3న హంస వాహనం, మే 4న శేషవాహనం, మే 5న నంది వాహనం, మే 6న గజవాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. మే 7న రథోత్సవం కన్నులపండువగా జరుగనుంది. మే 8న రాత్రి 7 గంటలకు కల్యాణోత్సవం, అనంతరం అశ్వవాహన సేవ జరుగనున్నాయి. రూ.500/- చెల్లించి కల్యాణోత్సవంలో పాల్గొనే గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ, ఒక అప్పం, అన్నప్రసాదాలను బహుమానంగా అందజేస్తారు.


మే 9న ఉదయం 9 గంటలకు శ్రీ నటరాజస్వామివారికి అభిషేకం, వీధి ఉత్సవం జరుగనుంది. రాత్రి 7 గంట‌ల‌కు రావణేశ్వర వాహనంపై అగస్తీశ్వరస్వామి దర్శనమిస్తారు. మే 10న ఉద‌యం 11 నుండి మ‌ధ్యాహ్నం 12.30 గంట‌ల వ‌ర‌కు కైలాసకోనలో త్రిశూలస్నానం ఘనంగా నిర్వహించనున్నారు. అదేరోజు రాత్రి 7 గంట‌ల‌కు ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ కోలాటం, ఆధ్యాత్మిక, భక్తిసంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.


ఆలయ చరిత్రను పరిశీలిస్తే నారాయణవనం ప్రాంతాన్ని పరిపాలించిన శ్రీ పద్మావతీదేవి తండ్రి అయిన శ్రీ ఆకాశ మహారాజు ఈ ఆలయాన్ని నిర్మించినట్టు పురాణాల ద్వారా తెలుస్తోంది. ఇక్కడ శ్రీ అగస్తీశ్వరస్వామివారు స్వయంభువుగా వెలిశారు. స్వామివారి లింగాకారానికి పీఠభాగం అనగా బాణపట్టమును అమర్చి వేద ఆగమశాస్త్ర ప్రకారం శ్రీ అగస్త్య మహర్షులవారు ప్రతిష్ఠ చేసి పూజించినందువల్ల స్వామివారికి అగస్తీశ్వరస్వామి అని పేరు వచ్చింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa