కశ్మీర్లోని పహల్‌గామ్‌లో ఉగ్రదాడి తర్వాత దక్షిణాసియాలో పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. భారత్, పాకిస్థాన్ మధ్య వివాదం ముదురుతోంది. టెర్రరిస్టుల దాడిని తీవ్రంగా పరిగణించిన భారత్.. పాకిస్థాన్‌పై ప్రతీకార చర్యలకు దిగింది. బుధవారం సాయంత్రం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (సీసీఎస్) భేటీలో ఐదు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పాకిస్థానీలకు ఇండియాలోకి నో ఎంట్రీ, సింధు జలాల ఒప్పందాన్ని నిలిపేయడం, అటారీ చెక్ పోస్టు మూసివేత అందులో కీలకమైనవి.
భారత్ తీసుకున్న చర్యలకు ప్రతిగా సెక్యురిటీ కౌన్సిల్ మీటింగ్‌లో పాక్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. భారత విమానాలకు తమ గగనతలాన్ని మూసేయడంతోపాటు.. ఇండియాతో వ్యాపారాలను రద్దు చేసుకుంది. అంతేకాకుండా భారత్‌తో అన్ని దౌత్య ఒప్పందాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. 1972లో భారత్‌తో కుదుర్చుకున్న సిమ్లా ఒప్పందాన్ని కూడా సస్పెండ్ చేస్తు్న్నట్లు ప్రకటించింది.
1972 జూలై 2న భారత్, పాకిస్థాన్ మధ్య సిమ్లాలో కుదిరిన చారిత్రక ఒప్పందమే సిమ్లా ఒప్పందం. 1971లో జరిగిన ఇండో-పాక్ యుద్ధం తర్వాత.. ఇరు దేశాల మధ్య సంబంధాలను సాధారణ స్థితికి తీసుకురావడం కోసం.. భవిష్యత్ సంబంధాలకు ఒక ఫ్రేమ్‌ను ఏర్పర్చడం ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశ్యం. ఈ ఒప్పందంపై భారత ప్రధాని ఇందిరా గాంధీ, పాకిస్థాన్ అధ్యక్షుడు జుల్ఫికర్ అలీ భుట్టో సంతకాలు చేశారు.
సిమ్లా ఒప్పందంలోని ముఖ్య నిబంధనలు:
శాంతియుత పరిష్కారం: తమ మధ్య ఉన్న అన్ని వివాదాలను, సమస్యలను శాంతియుత మార్గాల ద్వారా.. ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి ఇరు దేశాలు అంగీకరించాయి. మూడో పక్షం ప్రమేయం లేకుండా సమస్యలను పరిష్కరించుకోవాలనేది భారతదేశం ముఖ్య ఉద్దేశం. యుద్ధ సమయంలో ఇరు దేశాలు ఆక్రమించుకున్న ప్రాంతాల నుండి తమ సైనిక బలగాలను అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి వారి వారి స్థానాలకు సైనిక బలగాలను ఉపసంహరించుకోవాలనే ఈ ఒప్పందంలో పేర్కొన్నారు.
1971 యుద్ధం తర్వాత జమ్మూ కశ్మీర్‌లో ఏర్పడిన కాల్పుల విరమణ రేఖను ‘నియంత్రణ రేఖ (LoC)’గా గుర్తించారు. ఈ రేఖను ఇరు దేశాలు గౌరవించాలని.. దీన్ని దాటడానికి ప్రయత్నించకూడదని ఒప్పందం చేసుకున్నారు. ఎల్‌వోసీ అనేది తుది అంతర్జాతీయ సరిహద్దు కాదు, కేవలం ఆచరణలో ఉన్న రేఖ మాత్రమే. జమ్మూ కశ్మీర్ విషయంలో LoCని గుర్తించడమనేది సిమ్లా ఒప్పందంలో కీలకమైన అంశం.
పర్యవసానాలు ఎలా?
సిమ్లా ఒప్పందాన్ని నిలిపేయడమనేది భారత్, పాకిస్థాన్ మధ్య సంబంధాలను ప్రతికూలంగా ప్రభావితం చేయనుంది. సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేయడమంటే.. నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ)కు కట్టుబడి ఉండటమనేది ప్రశ్నార్థకమే. దీని వల్ల సైనిక సంఘర్షణ తలెత్తే అవకాశంతోపాటు.. ఇరు దేశాల మధ్య యుద్ధ పరిస్థితులు తలెత్తవచ్చు.
భారత్, పాక్ మధ్య వివాదాలను ద్వైపాక్షికంగా పరిష్కరించుకోవాలనేది సిమ్లా ఒప్పందంలోని ముఖ్య సూత్రం. ఇప్పుడు సిమ్లా ఒప్పందాన్ని పాక్ నిలిపేయడం వల్ల.. కశ్మీర్ లేదా ఇతర సమస్యల పరిష్కారం కోసం పాకిస్థాన్ అంతర్జాతీయ మధ్యవర్తిత్వాన్ని కోరే అవకాశం ఉంటుంది. ఇది భారత్‌కు ఇబ్బందికరమైనప్పటికీ.. ఒకవేళ ఇండియా గనుక ఇతరుల జోక్యా్న్ని ఇష్టపడకపోతే.. ఎవరైనా చేసేదేం ఉండకపోవచ్చు. సిమ్లా ఒప్పందాన్ని నిలిపేయడమంటే.. తాము శాంతియుత పరిష్కారానికి కట్టుబడి లేమని అంతర్జాతీయ సమాజానికి పాకిస్థాన్ సంకేతాలు ఇచ్చినట్టే. పాక్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో కశ్మీర్ సమస్య మరింత సంక్లిష్టం అవుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa