ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరోసారి ట్రంప్‌, జెలెన్‌స్కీ మధ్య గొడవ,,,,క్రిమియాపై అమెరికా కీలక ప్రతిపాదన

international |  Suryaa Desk  | Published : Thu, Apr 24, 2025, 10:46 PM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలొడిమిర్ జెలెన్‌స్కీ మధ్య మరోసారి ఘర్షణ చోటుచేసుకుంది. రష్యా- ఉక్రెయిన్‌ మధ్య మూడేళ్లకుపైగా సాగుతోన్న యుద్ధం ముగింపునకు చర్చలు జరుగుతోన్న సమయంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. మార్చిలో కూడా అమెరికా పర్యటనకు వచ్చిన జెలెన్‌స్కీ.. ట్రంప్‌తో వైట్‌హౌస్‌లో భేటీ సమయంలో గొడవపడి అర్థాంతరంగా చర్చల నుంచి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఈ సారి ట్రంప్, జెలెన్‌స్కీ మధ్య క్రిమియా అంశంపై వివాదం తలెత్తింది. క్రిమియాను రష్యా భూభాగంగా ట్రంప్ పరిగణిస్తుంటే.. జెలెన్‌స్కీ దీనికి అంగీకరించలేదు. ఉక్రెయిన్ తన ప్రాథమిక సూత్రాలపై నిలబడుతుందని ఆయన మరోసారి స్పష్టం చేశారు.


లండన్‌ వేదిక రష్యా-ఉక్రెయిన్‌పై జరుగుతోన్న చర్చల్లో అమెరికా ప్రతిపాదించిన రెండు కీలక అంశాలు మాస్కోకు అనుకూలంగా ఉన్నాయని సమాచారం. అందులో ఒకటి క్రిమియాను అధికారికంగా రష్యా ప్రాంతంగా గుర్తించడం, రెండోది ఉక్రెయిన్ ఎప్పటికీ నాటో సభ్యత్వం పొందకూడదు. అయితే, ఈ రెండు ప్రతిపాదనలను ఉక్రెయిన్ తిరస్కరించడంతో ట్రంప్ అసహనంతో స్పందించారు. కీవ్ తలవంచకుంటే చర్చల నుంచి అమెరికా వైదొలగుతుందని ట్రంప్ హెచ్చరించారు. ఈ క్రమంలో జెలెన్‌స్కీపై విమర్శలు గుప్పించారు. ‘క్రిమియాను కీవ్ చాలా సంవత్సరాల క్రితమే కోల్పోయింది, ఇది చర్చకు కూడా లొంగదు’ అని ట్రంప్ అన్నారు.


ఈ ప్రతిపాదనను జెలెన్‌స్కీ ఖరాఖండిగా తిరస్కరిస్తూ.. ‘రష్యా ఆక్రమణను ఉక్రెయిన్ ఎప్పటికీ గుర్తించదు. ఇక్కడ చర్చించేదేమీ లేదు. ఇది మా రాజ్యాంగానికి వ్యతిరేకం’ అని చెప్పారు. కీవ్ అధినేత వ్యాఖ్యలపై ట్రంప్ స్పందిస్తూ.. ‘మీ దేశంలో హత్యలు ఆపడానికి అమెరికా ప్రయత్నిస్తోంది. మేము ఒప్పందానికి చాలా దగ్గరగా ఉన్నాం.. కానీ జెలెన్‌స్కీ దృఢత్వం చర్చలను స్థిరదశలోకి నడిపించేస్తోంది’ అని ఆరోపించారు.


సోషల్ మీడియాలో ట్రంప్ విమర్శలు


ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేస్తూ.. ‘‘ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ 'క్రిమియా ఆక్రమణను ఎట్టి పరిస్థితుల్లోనూ చట్టబద్ధంగా గుర్తించమని వాల్ స్ట్రీట్ జర్నల్‌కి చెప్పారు. ఇది శాంతిచర్చలకి చాలా హానికరం. క్రిమియాను చాలా ఏళ్ల క్రితమే కోల్పోయారు. ఇది చర్చలకు తగదు.. జెలెన్‌స్కీ క్రిమియాను నిజంగా కోరుకుంటే, పదకొండేళ్ల కిందట రష్యా ఆక్రమించినప్పుడు ఎందుకు పోరాడలేదు?’ అని ప్రశ్నించారు.


2014లో ఉక్రెయిన్ నుంచి పెద్ద ప్రతిఘటన లేకుండానే క్రిమియాను రష్యా ఆక్రమించింది. అప్పట్లో మాస్కో తీరును అంతర్జాతీయ సమాజం ఖండించింది. కొద్ది దేశాలే రష్యా హక్కును గుర్తించాయి.


ట్రంప్-జెలెన్‌స్కీ భేటీలో గొడవ.. వెళ్లిపోయిన ఉక్రెయిన్ అధ్యక్షుడు


జేడీ వాన్స్ హెచ్చరిక


అటు, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ట్రంప్‌ను సమర్దిస్తూ.. ‘రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతిచర్చలు జరగపోతే, అమెరికా పూర్తిగా వైదొలగాల్సిన సమయం వచ్చింది’ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఉన్న భూభాగ హద్దుల్లోనే యథాతథ స్థితిని కొనసాగించాలి. దీర్ఘకాలిక రాజనీతిక పరిష్కారం ద్వారా శాంతి సాధించాలి. సైనికులు రెండు వైపులా ఆయుధాలు వదిలి.. యుద్ధం నిలిపివేయడమే అసలైన పరిష్కారం’ అని JD వాన్స్ వ్యాఖ్యానించారు.


వాన్స్ వ్యాఖ్యలకు జెలెన్‌స్కీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ అండ్రీ యెర్మాక్ తీవ్రంగా స్పందించారు. ‘ఉక్రెయిన్ రాజ్యాధికారం, భూభాగ సమగ్రతపై స్థిరంగా నిలుస్తుంది’ అని లండన్‌లో అమెరికా ప్రతినిధికి తేల్చిచెప్పారు.


మాస్కోకు అనుకూలంగా అమెరికా?


జనవరిలో అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఉక్రెయిన్- రష్యా యుద్ధంలో అమెరికా వైఖరి పూర్తిగా మారిపోయింది. మాజీ అధ్యక్షుడు జో బైడెన్ విధానానికి భిన్నంగా.. కీవ్‌కు ఆమోదయోగ్యం లేని ప్రతిపాదనలో శాంతి ఒప్పందం కోసం ఉక్రెయిన్‌పై అమెరికా ఒత్తిడి తెస్తోంది.


రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని కొన్ని రోజుల్లోనే ముగిస్తానని ట్రంప్ వాగ్దానం చేశారు. ఇప్పుడాయన ప్రపంచానికి శాంతి దూతగా కనిపించాలని తాపత్రయపడుతున్నారు. అదే సమయంలో ట్రంప్-పుతిన్ ఫోన్ కాల్ తర్వాత అమెరికా విధానం మాస్కోకు అనుకూలంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో ఐరోపా దేశాలు ఉక్రెయిన్‌కు సాయపడేందుకు కొత్త మార్గాలు వెతుకుతున్నాయి. ఉక్రెయిన్ మాత్రం భవిష్యత్ పట్ల గందరగోళంగా ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa