ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాకిస్థాన్ మిలటరీ ఎయిర్‌బేస్‌లో ఎగిరి.. ఢిల్లీలో దిగిన జెట్ విమానం

international |  Suryaa Desk  | Published : Thu, Apr 24, 2025, 10:47 PM

కశ్మీర్లోని పహెల్‌గామ్‌లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో అమాయకులైన పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ దాడిని భారత ప్రజలు ముక్తం కంఠంతో ఖండిస్తున్నారు. సౌదీ పర్యటనను అర్ధంతరంగా ముగించుకున్న ప్రధాని మోదీ స్వదేశానికి తిరిగి వచ్చారు. హోం మంత్రి అమిత్ షా శ్రీనగర్ వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. ఈ దాడికి గట్టిగా బదులిస్తామని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారు. ఈ దాడి ఘటన తర్వాత భద్రతా బలగాలు కశ్మీర్‌ను జల్లెడ పడుతుండగా.. తదుపరి ఏం చర్యలు తీసుకోవాలనే విషయమై ప్రధాని మోదీ అధ్యక్షతన కేబినెట్ భదత్రా వ్యవహారాల కమిటీ బుధవారం సాయంత్రం సమావేశమైంది.


ఈ దాడికి పాకిస్థాన్ కారణమే అభిప్రాయాన్ని సగటు భారతీయుడు వ్యక్తం చేస్తున్నాడు. గతంలో పాకిస్థాన్‌ నియంత్రణలో ఉన్న భూభాగంలోకి చొచ్చుకెళ్లి.. సర్జికల్ స్ట్రైక్ జరిపిన తరహాలోనే ఇప్పుడు కూడా ఉగ్రవాదులు ఏరివేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. పహెల్‌గామ్ ఉగ్రదాడి ఘటనను సీరియస్‌గా తీసుకున్న కేంద్రం.. కఠిన నిర్ణయాలే తీసుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. దౌత్యపరంగా పూర్తిగా తెగదెంపులు చేసుకోవడం, సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం, ఆర్థికంగా పాకిస్థాన్‌ను మరింత ఇరుకునపెట్టడం, సైన్యంతో మెరుపు దాడులు చేయడం లాంటి ఆప్షన్స్ ఇప్పుడు భారత్ ముందు ఉన్నాయి. అయితే మోదీ సర్కారు దూకుడుగా ముందుకెళ్తుందా లేదా ఆచితూచి ముందడుగు వేస్తుందా అనేది చూడాలి.


కశ్మీర్లో టెర్రరిస్టులు రక్తపాతం సృష్టించిన మరుసటి రోజు ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌ నుంచి ఓ జెట్ విమానం ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోవడం ఆసక్తికరంగా మారింది. ఏప్రిల్ 23న ఇస్లామాబాద్‌లోని పాకిస్థాన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన మిలటరీ ఎయిర్ బేస్‌లో పైకి ఎగిరిన గల్ఫ్‌స్ట్రీమ్ వి జెట్.. ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యిందంటూ సుమిత్ బెహాల్ అనే నెటిజన్ ఎక్స్‌లో పోస్టులు చేశారు. విమానాల రాకపోకలను లైవ్‌లో చూపించే ఫ్లైట్ రాడర్ 24కు సంబంధించిన స్క్రీన్ షాట్‌లను ఆయన తన పోస్టులకు జత చేశారు.


ఇస్లామాబాద్ నుంచి ఢిల్లీకి వచ్చిన విమానంలో పాకిస్థాన్‌లోని భారత ఎంబసీ సిబ్బంది ఉండొచ్చని.. ఉగ్రదాడికి నిరసనగా పాకిస్థాన్‌లోని భారత హైకమిషన్ ఆఫీసును మూసేసి ఉంటారని కొందరు అభిప్రాయపడ్డారు. భారత ప్రభుత్వం తమ దౌత్యవేత్తలను పాకిస్థాన్ నుంచి వెనక్కి పిలిపించి ఉంటుందని.. వారంతా ఈ విమానంలో స్వదేశానికి వచ్చి ఉండొచ్చనే అభిప్రాయాన్ని నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు.


అయితే మరో ప్రాంతం నుంచి వచ్చిన విమానం పాకిస్థాన్లో కాసేపు ఆగి ఢిల్లీకి వచ్చి ఉంటుందని కూడా కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇస్లామాబాద్ నుంచి ఢిల్లీ వచ్చిన విమానం అమెరికాదని.. యూఎస్‌లో బయల్దేరిన విమానం అల్బేనియా, ఇస్లామాబాద్‌లో ఆగి చివరకు ఢిల్లీ చేరుకుందని ఓ నెటిజన్ చెప్పారు. ఇది నిజమేనా అని మరో నెటిజన్‌ గ్రోక్‌ను అడగ్గా.. ఏప్రిల్ 23న పాకిస్థాన్ ఎయిర్‌ఫోర్స్ బేస్ నుర్ ఖాన్ మిలటరీ ఎయిర్ బేస్ నుంచి విమానం బయల్దేరిందని.. హైప్రొఫైల్ వ్యక్తులు ఇందులో వచ్చి ఉంటారని తెలిపింది.


ఈ పోస్టు గురించి వివరాలు తెలపాలని ఓ నెటిజన్ పర్‌ప్లెక్సిటీ చాట్ బోట్‌ను అడగ్గా.. ఫ్లైట్ రాడార్24 స్క్రీన్ షాట్.. గల్ఫ్‌స్ట్రీమ్ వి బిజినెస్ జెట్ (జీఎల్ఎఫ్5) ఇస్లామాబాద్ నుంచి న్యూ ఢిల్లీకి ప్రయాణించడాన్ని సూచిస్తోందని.. ఇది పంజాబ్, హర్యానా మీదుగా వచ్చిందని తెలిపింది. అయితే ఆ విమానానికి సంబంధించిన రిజిస్ట్రేషన్, ఆపరేటర్, ప్రయాణికులు గుర్తింపు వివరాలేవీ అందుబాటులో లేవని.. మ్యాప్ మాత్రం ఈ రూట్లో గల్ఫ్‌స్ట్రీమ్ వి జెట్ ప్రయాణించి.. ఢిల్లీలో ల్యాండ్ అయినట్లు ధ్రువీకరిస్తోందని తెలిపింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa