పుల్వామా ఉగ్రదాడి తర్వాత నుంచి ఇప్పటివరకు అంతంత మాత్రంగా ఉన్న భారత్, పాక్ సంబంధాలు.. ఇటీవల జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పూర్తిగా క్షీణించాయి. ఈ ఉగ్రదాడిని తీవ్రంగా పరిగణించిన భారత్.. ఆ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన పాక్‌పై అన్ని రకాలుగా ఒత్తిడి తీసుకువస్తోంది. ఇప్పటికే సింధూ నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసిన భారత్.. పాక్‌ను ఎడారి చేసేందుకు సిద్ధమైంది. అదే సమయంలో పాక్‌తో అన్ని వాణిజ్య సంబంధాలు తెగదెంపులు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. దీంతో భారత్ నుంచి ఆ దేశానికి ఎగుమతి అయ్యే వస్తువుల సరఫరా నిలిచిపోనుంది. అయితే భారత్ నుంచి పాక్‌కు ఎగుమతి అయ్యే వస్తువుల్లో అతి ముఖ్యమైనవి ఔషధాలు. ఇప్పుడు ఆ ఔషధాల సరఫరా నిలిచిపోతే పాకిస్తాన్‌కు చావు దెబ్బ తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
భారత్ పాక్ వాణిజ్య సంబంధాలు నిలిచిపోవడంతో.. ఆ దేశంలో ఔషధాల కొరత ఏర్పడే ప్రమాదం పొంచి ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే దీనిపై పాక్ సర్కార్ అత్యవసర చర్యలు చేపట్టింది. ఔషధాల సరఫరాలను నిర్ధారించడానికి ఆరోగ్య అధికారులు తక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు ఆ దేశ అధికారిక ఛానల్ జియో న్యూస్ వెల్లడించింది. ప్రస్తుతం పాకిస్తాన్ ఔషధ పరిశ్రమలో ఉపయోగించే ముడి పదార్థాల్లో 30 శాతం నుంచి 40 శాతం వరకు భారత్ నుంచి వచ్చే దిగుమతులపై ఆధారపడి పనిచేస్తోంది. ఇందులో ముఖ్యంగా క్రియాశీల ఔషధ పదార్థాలు, క్యాన్సర్ చికిత్సలు, జీవ ఉత్పత్తులు, టీకాలు, రాబిస్ నిరోధక వ్యాక్సిన్, పాము కాటుకు వాడే ఔషదాలు ఉన్నాయి.
అయితే భారత్ నుంచి దిగుమతి అయ్యే ఔషధాలపై నిషేధం విధిస్తే ఎదురయ్యే పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని పాక్ తెలిపింది. అందుకు ప్రత్యామ్నాయ ప్రణాళికలు రెడీగా ఉన్నాయని.. పాకిస్తాన్ డ్రగ్ రెగ్యులేటరీ అథారిటీ(డీఆర్ఏపీ) వెల్లడించింది. 2019 పుల్వామా ఉగ్రదాడి సమయంలో తలెత్తిన సంక్షోభం తర్వాత ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు ముందుగానే ప్రణాళికలు రూపొందించినట్లు డీఆర్ఏపీ సీనియర్ అధికారి తెలిపారు. ఈ నేపథ్యంలోనే తన ఔషధ అవసరాల కోసం పాకిస్తాన్.. చైనా, రష్యా సహా యూరోపియన్ దేశాల వంటి ప్రత్యామ్నాయ వనరుల కోసం ప్రయత్నాలు చేస్తోంది.
భారత్‌తో ప్రస్తుతం వాణిజ్య సంబంధాలు పూర్తిగా నిలిచిపోవడం వల్ల తలెత్తే సమస్యలను ఎదుర్కొనేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని.. లేకపోతే తీవ్రమైన ఔషధాల కొరత ఏర్పడే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తీవ్ర హెచ్చరికలు చేస్తున్నారు. భారత్‌తో అన్ని రకాల వాణిజ్యాన్ని నిలిపివేస్తూ పాక్ ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసినప్పటికీ.. ఔషధ దిగుమతులపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుంచి ఇంకా అధికారిక సూచనలు అందలేదని పాకిస్తాన్ ఆరోగ్య శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇదే కొనసాగితే దేశంలో మందుల కొరత ఏర్పడే అవకాశం ఉందని ఔషధ పరిశ్రమ వర్గాలు తీవ్రంగా భయపడుతున్నాయి. ఫలితంగా దేశంలో జబ్బుల బారిన పడే వారి సంఖ్య పెరుగుతుందనే ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa