ఏపీలోని కూటమి ప్రభుత్వం ఇటీవల 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 20 నుంచి మే 15 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ కొనసాగనుంది. ఈ క్రమంలో తాజాగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థుల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా కేటగిరీలకు చెందిన అభ్యర్థులు డిగ్రీలో 40 శాతం మార్కులతో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. బీఈడీకి, టెట్‌కు డిగ్రీలో 40 శాతం మార్కుల అర్హత ఉండగా... డీఎస్సీకి మాత్రం 45 శాతం పెట్టడం పట్ల అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వారి అభ్యర్థన మేరకు డిగ్రీలో 40 శాతం మార్కులతో దరఖాస్తు చేసుకునేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక, జనరల్ అభ్యర్థులకు మాత్రం డిగ్రీలో 50 శాతం మార్కులు ఉండాల్సిందేనని ఈ సందర్భంగా ప్రభుత్వం తేల్చి చెప్పింది. కాగా, ఏపీ డీఎస్సీ-2025కి సంబంధించిన పూర్తి వివరాలు అధికారిక వెబ్‌సైట్ https://apdsc.apcfss.in/లో పొందుపరిచారు. ఏప్రిల్ 20 నుంచి ప్రారంభమైన ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ, ఫీజుల చెల్లింపు మే 15 వరకు కొనసాగనుంది. అలాగే మే 30 నుంచి అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జూన్ 6 నుంచి జులై 6 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యశాఖ ఇప్పటికే డీఎస్సీ పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేసింది.
![]() |
![]() |