డిజిటల్ యాక్సెస్ ప్రాథమిక హక్కని, గ్రామీణ ప్రాంతాలు సహా సమాజంలోని ప్రతి ఒక్కరికీ డిజిటల్ యాక్సెసిబిలిటీని నిర్దారించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. డిజిటల్ అంతరాన్ని తగ్గించడం ఇకపై విధానపరమైన విచక్షణకు సంబంధించిన అంశం కాదని, వ్యక్తి గౌరవప్రదమైన జీవితాన్ని పొందేందుకు రాజ్యాంగబద్ధంగా కల్పించిన తప్పనిసరి హక్కు అని కోర్టు పేర్కొంది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పార్డివాలా, జస్టిస్ ఆర్ మహాదేవన్‌ల ధర్మాసనం.. రెండు ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. ఇందులో ఒకటి యాసిడ్ బాధితురాలికి సంబంధించి ఆమె బ్యాంకు ఖాతాలో KYC ప్రక్రియ సమయంలో ఎదుర్కొన్న సమస్యలను ప్రస్తావించింది. అన్ని ప్రభుత్వ పథకాలకు కేవైసీ తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే.
‘‘జీవితం, స్వేచ్ఛకు సంబంధించిన హక్కులో భాగంగా డిజిటల్ యాక్సెస్ హక్కు ప్రత్యేకంగా గుర్తింపబడింది.. గతంలో నిర్లక్ష్యానికి గురైన సమూహాలకూ డిజిటల్ సేవలు అందేలా ప్రభుత్వం ముందడుగు వేసి. అన్ని వర్గాలకూ డిజిటల్ వ్యవస్థను అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఉంది’ అని కోర్టు వ్యాఖ్యానించింది.
ప్రధానంగా ఆరోగ్య సంరక్షణ వంటి సేవలు సైతం డిజిటల్ మాధ్యమాల ద్వారానే అందుతున్న నేపథ్యంలో ఆర్టికల్ 21 కింద ఉన్న జీవించే హక్కును కూడా టెక్నాలజీ ఆధారిత వాస్తవాలతో అన్వయించుకోవాల్సిన అవసరం ఉందని కోర్టు స్పష్టం చేసింది. కేవైసీ ప్రక్రియను మరింత సులభతరంగా మార్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, మార్గదర్శకాలను అత్యవసరంగా సవరించాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ కోర్టు 20 ఆదేశాలు జారీ చేసింది.
ఈ కేసుల్లో ఒకటి 2023 జూలైలో బ్యాంక్ ఖాతా తెరవడానికి ప్రయత్నించిన యాసిడ్ దాడికి గురైన మహిళ సంబంధించింది. దాడితో ఆమె ముఖం పూర్తిగా కాలిపోవడంతో డిజిటల్ కేవైసీ ప్రక్రియను పూర్తిచేయలేకపోయారు. దీనిపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తడంతో చివరికి బ్యాంక్ ఆమెకు మినహాయింపు ఇచ్చింది. కానీ, బాధితురాలు ప్రగ్యా ప్రసూన్ కోర్టును ఆశ్రయించి, కేవైసీప్రక్రియలో దివ్యాంగుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం కొత్త మార్గదర్శకాలు జారీ చేయాలంటూ అభ్యర్థించారు.
ఆమె వాదనలతో ఏకభవించిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. కైవైసీ ప్రక్రియలో మార్పులు అవసరమని ఉద్ఠాటించింది. ‘‘దివ్యాంగుల కోసం కేవైసీ ప్రక్రియల్లో మార్పులు అవసరమని మేము నిర్ణయానికి వచ్చాం.. అంధులు, యాసిడ్ దాడులకు గురైన బాధితుల ముఖం వికారంగా మారడం వల్ల డిజిటల్ కేవైసీ ప్రక్రియను పూర్తిచేయలేకపోతున్నారు. రాజ్యాంగం వారికి ఈ ప్రక్రియలో భాగస్వామ్యం కల్పించాలన్న హక్కు ఇస్తోంది.. అందువల్ల, డిజిటల్ యాక్సెసిబిలిటీ కోడ్‌తో పాటు డిజిటల్ కేవైసీ మార్గదర్శకాలు సవరించాల్సిన అవసరం ఉంది. నేటి కాలంలో ఆర్థిక అవకాశాలు డిజిటల్ ఆధారంగా ఉంటే, ఆర్టికల్ 21ని కూడా టెక్నాలజీ నేపథ్యంలో మళ్లీ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది’" అని కోర్టు పేర్కొంది. జస్టిస్ మహాదేవన్ రాసిన ఈ తీర్పును జస్టిస్ పార్డివాలా ‘అద్భుతమైన తీర్పు’ అంటూ ప్రశంసించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa