జమ్మూ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా పహల్గామ్‌లో బైసరన్ లోయలో పర్యాటకులపై ఉగ్రదాడితో రగిలిపోతున్న భారత్... దీనికి ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధమవుతోంది. ఈ క్రమంలో జాతీయ భద్రతా అడ్వైజరీ బోర్డు ను కేంద్ర ప్రభుత్వం పునర్‌వ్యవస్థీకరించింది. ఏడుగురు సభ్యులతో బోర్డును ఏర్పాటు ఏర్పాటు చేసింది. ఇందులో మాజీ ఐపీఎస్‌లు, ఐఎఫ్ఎస్ అధికారులను నియమించింది. బోర్డు ఛైర్మన్‌గా రిసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా) మాజీ చీఫ్ అలోక్ జోషిని నియమిస్తున్నట్టు తెలిపింది. సభ్యులుగా మాజీ సైనికాధికారులు వెస్ట్రన్ ఎయిర్ కమాండర్ ఎయిర్ మార్షల్ పీఎం సిన్హా, సదరన్ ఆర్మీ మాజీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఏకీ సింగ్, రేర్ అడ్మిరల్ మోంటే ఖన్నాలు.. మాజీ ఐపీఎస్‌లు రాజీవ్ రంజన్ వర్మ, మన్మోహన్ సింగ్.. మాజీ ఐఎఫ్ఎస్ వెంకటేశ్ వర్మలను నియమిస్తూ ఉత్తర్వులు వెలువరించింది. పహల్గామ్ ఉగ్రదాడితో భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు నెలకున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఎన్ఎస్ఏబీ అనేది ప్రభుత్వం వెలుపల ఉన్న ప్రముఖ వ్యక్తులతో కూడిన బహుళ-క్రమశిక్షణా సంస్థ. జాతీయ భద్రతా మండలికి దీర్ఘకాలిక విశ్లేషణను అందించడం.. అది లేవనెత్తిన సమస్యలకు పరిష్కారాలు, విధాన ఎంపికలను సిఫార్సు చేయడం దీని ప్రధాన విధి.
మరోవైపు, కేంద్ర క్యాబినెట్ సమావేశం ముగిసిన అనంతరం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షాలతో విడివిడిగా సమావేశమయ్యారు. దేశంలోని సున్నిత ప్రాంతాలు, సరిహద్దుల్లో భద్రతపై తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఇప్పటికే భారత సైన్యానికి ప్రధాని మోదీ పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు.
మరోవైపు, భద్రతా క్యాబినెట్ వ్యవహారాల కమిటీ బుధవారం మధ్యాహ్నం సమావేశం కానుంది. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ ధోవల్‌తో భేటీ తర్వాత తీసుకునే నిర్ణయాలను చర్చించనున్నట్లు తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో భద్రతా బలగాల కార్యాచరణ, పాకిస్తాన్‌పై తీసుకోవాల్సిన చర్యలపై కీలక చర్చలు జరపనున్నారు. అయితే గతంలో భేటీ అయిన సీసీఎస్.. ఈ ఉగ్రదాడి చేసిన ఉగ్రవాదులను శిక్షించడంతో పాటు, వారికి సహకరిస్తున్న వారిని కూడా వదిలిపెట్టేది లేదని పాకిస్తాన్‌కు గట్టి హెచ్చరికలు చేసింది.
ఇప్పటికే దౌత్య పరంగా, ఆర్థిక పరంగా పాకిస్తాన్‌ను దెబ్బ కొట్టిన భారత్.. మరిన్ని ఆంక్షలు, నిషేధాలతో ఉక్కిరి బిక్కిరి చేసేందుకు సిద్ధం అవుతోంది. కేవలం యుద్ధం, సర్జికల్ స్ట్రైక్స్ మాత్రమే కాకుండా.. మోదీ సర్కార్ మరింత పెద్ద ప్లాన్ వేస్తోందనే ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa