ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాక్ సంచలన నిర్ణయం.. ఐఎస్ఐ చీఫ్‌కి కీలక బాధ్యత!

international |  Suryaa Desk  | Published : Thu, May 01, 2025, 10:15 PM

పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటలిజెన్స్ (ISI) చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ మహ్మద్ ఆసిం మాలిక్‌ను దేశ కొత్త జాతీయ భద్రతా సలహాదారుగా (NSA) నియమించినట్టు పాక్ పత్రిక ఎక్స్‌ప్రెస్ ట్రైబ్యూన్ నివేదించింది. గతేడాది సెప్టెంబరులో ఐఎస్ఐ డీజీగా నియమితులైన మాలిక‌్‌కు జాతీయ భద్రతా సలహాదారుగా అదనపు బాధ్యతలు అప్పగించినట్టు పేర్కొంది. పహల్గామ్ ఉగ్రదాడితో భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు నెలకున్న విషయం తెలిసిందే. ఈ దాడి వెనుక పాకిస్థాన్ సైన్యం పాత్ర ఉందని భారత్ భావిస్తోంది. ఇందుకు తగిన ఆధారాలు ఉన్నాయని చెబుతోంది. ISI చీఫ్‌గా నియమితులు కావడానికి ముందు పాకిస్థాన్ ఆర్మీ ప్రధాన కార్యాలయంలో అడ్జుడెంట్ జనరల్‌గా సేవలందించారు. ఈ పదవిలో సైనిక పరిపాలన సంబంధిత విషయాలను, ముఖ్యంగా చట్టపరమైన, క్రమశిక్షణాపరమైన వ్యవహారాలను పర్యవేక్షించారు.


ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్, ఆ తర్వాత ఆయన మద్దతుదారులు, పార్టీ కార్యకర్తల నిరసనలు మాలిక్ అడ్జుటెంట్ జనరల్‌గా ఉన్న సమయంలోనే చోటుచేసుకున్నట్లు ఎక్స్‌ప్రెస్ ట్రైబ్యూన్ తెలిపింది. తన సైనిక వృత్తి జీవితంలో తీవ్ర సమస్యాత్మక ప్రాంతాలైన బలూచిస్థాన్, దక్షిణ వజిరీస్థాన్‌ డివిజన్‌లకు కమాండ్‌రగా పనిచేశారు. పహల్గామ్‌ ఉగ్రదాడి తరువాత భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా పెరిగిన నేపథ్యంలో మాలిక్‌ను భద్రతా సలహదారుగా నియమించడం ప్రాధాన్యత సంతరించుకుంది.


పాకిస్థాన్‌పై దౌత్యపరమైన ఆంక్షలు విధించిన భారత్.. తాజాగా ఆదేశానికి చెందదిన విమానాలకు భారత గగనతలాన్ని మూసివేసింది. పాకిస్థాన్ నటుల హానియా ఆమీర్, మహీరా ఖాన్, అలీ జాఫర్ వంటి వారి సోషల్ మీడియా ఖాతాలను నిలిపివేసింది.


నియంత్రణ రేఖ వద్ద వరుసగా ఏడో రోజూ కాల్పుల విరమణ ఉల్లంఘనలు కొనసాగుతున్నాయి, అలాగే జమ్మూ కశ్మీర్‌లోని అఖ్నూర్ సెక్టార్‌లో అంతర్జాతీయ సరిహద్దు వద్ద పాక్ వైపు నుంచి కాల్పులు జరిగినట్లు గురువారం నివేదించబడింది.


పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడిన ఉగ్రవాదుల్ని, వారికి సహకరించేవారిని తప్పకుండా గుర్తించి వెంటాడి కఠినంగా శిక్షిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.


ఇప్పటికే సైన్యానికి మోదీ పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నట్టు ప్రకటించారు. అయితే, పాక్ మాత్రం తనకు ఈ దాడితో సంబంధం లేదని అంటూనే.. తమపై దాడి చేస్తే బలమైన ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరిస్తోంది. ఇటీవల జరిగిన మీడియా సమావేశంలో కూడా దాడిపై నిష్పక్షపాత దర్యాప్తు జరపాలని పాక్ పునరుద్ఘాటించింది.


మరోవైపు, రెండు దేశాల మధ్య ఏ క్షణం ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయోననే ఉత్కంఠ నెలకొంది. ఇలాంటి సమయంలో పాకిస్తాన్ సైన్యాధిపతి జనరల్ సయ్యద్ అసిమ్ మునీర్ కనిపించడం లేదు అనే వార్తలు వైరల్ కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిం మునీర్.. కశ్మీర్‌పై నోరు పారేసుకున్న నాలుగు రోజుల్లోనే పహల్గామ్ ఉగ్రదాడి చోటుచేసుకుంది. దీనికి ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు కారణమే వాదన కూడా ఉంది.. కశ్మీర్ పాకిస్థాన్‌కు జీవనాడని, భవిష్యత్తులోనూ అది అలాగే ఉంటుందని, దానిని మేము వదిలిపెట్టబోమని అతడు వ్యాఖ్యానించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa