గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్(63) కన్నుమూశారు. గత కొంత కాలంగా క్లోమ గ్రంథి క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి ఆదివారం విషమించింది. దీంతో ఆయనకు చికిత్స అందించేందుకు వైద్యులు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఆదివారం సాయంత్రం పారికర్ పరిస్థితి అత్యంత విషమంగా ఉందని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. వైద్యులు వాళ్ల ప్రయత్నం వాళ్లు చేస్తున్నట్లు తెలిపింది. ఈమేరకు సీఎంవో ట్వీట్ చేసింది. ఈ ప్రకటన తరువాత అయన కనుమూసినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది.
మనోహర్ పారికర్ బీజేపీలో నిబద్ధత కలిగిన నాయకుడు. అత్యంత సౌమ్యుడు. హాస్యప్రియుడు కూడా .గోవాలోని మపూసాలో జన్మించిన మనోహర్ పారికర్ హైస్కూల్‌లో చదివేటప్పుడే ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరారు. ఐఐటీ బాంబేలో ఇంజినీరింగ్ మెటలర్జీ చదివారు. 2014-17 మధ్య రక్షణ శాఖ మంత్రిగా పనిచేశారు. యూపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా మనోహర్ పనిచేశారు. మూడు సార్లు గోవాకు సీఎంగా పనిచేశారు. మనోహర్ పారికర్ తొలిసారి 1994లో గోవా శాసనసభకు ఎన్నికయ్యారు. 1999లో గోవా శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించారు. 2000, అక్టోబరు 24న తొలిసారిగా గోవా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 2002 ఫిబ్రవరి 27 వరకు ఆ పదవిలో ఉన్న పారికర్ మళ్ళీ 2002 జూన్ 5న మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు. 2005 జనవరిలో నలుగురు భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు రాజీనామా చేయడంతో మైనారిటీలో పడ్డ ప్రభుత్వాన్ని కూడా తన చతురతతో నెట్టుకొచ్చారు. ఆ తర్వాత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి, దిగంబర్ కామత్‌కు సీఎం అయ్యారు. అయితే, 2012 శాసనసభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ మెజారిటీ సాధించడంతో మరోసారి పారికర్ గోవా ముఖ్యమంత్రి అయ్యారు.
క్లోమగ్రంథి సమస్యకు ఆయన అమెరికాలో చికిత్స చేయించుకున్నారు. సెప్టెంబర్‌లో భారత్ వచ్చి ఢిల్లీ ఎయిమ్స్‌లో పారికర్ చికిత్స పొందారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన ఆదివారం కన్నుమూశారు. మనోహర్ మృతికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సంతాపం తెలిపారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీతో పాటు, బీజేపీ నేతలు సంతాపం తెలిపారు. పారికర్ మరణంతో బీజేపీ శ్రేణులు శోకసంద్రంలో మునిగిపోయాయి. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, కూడా పారికర్ మృతి పట్ల సంతాపం ప్రకటించారు. దేశం ఒక గొప్ప ప్రజా సేవకుడిని కోల్పోయిందని సీఎం అన్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa