పహల్గాం ఉగ్రదాడికి భారత్ గట్టిగా బదులు ఇచ్చింది. ఓవైపు దౌత్యపరంగా దాయాది దేశానికి చుక్కలు చూపిస్తూనే.. మరోవైపు పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా మెరుపు దాడులు చేసింది. మంగళవారం రోజు అర్ధరాత్రి ఆపరేషన్ సిందూర్ పేరుతో ఈ దాడులు చేయగా.. 80 మంది వరకు ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఈక్రమంలోనే కేంద్ర ప్రభుత్వం గగనతలంలో కొన్ని ఆంక్షలు విధించింది. ఫలితంగా 200లకు పైగా విమానాలు రద్దు అయ్యాయి. మొత్తంగా 18 విమానాశ్రయాలు తాత్కాలికంగా మూసివేశారు. ఇలాంటి సమయంలోనే ప్రముఖ విమానయాన సంస్థలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. తమ సర్వీసులను మే 10వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి.
మంగళవారం రోజు అర్ధరాత్రి.. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై ఆపరేషన్ సిందూర్ పేరిట భారత్ మెరుపు దాడులు చేసింది. ఈక్రమంలోనే బుధవారం రోజు గగనతలంపై పలు ఆంక్షలు విధించింది. దీంతో విమాన రాకపోకలపై వెంటనే ప్రభావం పడింది. భద్రతా ఆంక్షలు పెరిగిన నేపథ్యంలో జమ్మూ, పఠాన్‌కోట్, జోధ్‌పుర్, జైసల్మేర్, సిమ్లా, ధర్మశాల, జామ్ నగర్‌తో సహా కీలకమైన ఉత్తర మరియు పశ్చిమ విమానాశ్రయాల్లో విమాన కార్యకలాపాలు నిలిపివేశారు. ఎరియ్ ఇండియా, ఇండిగో, స్పైస్‌జెట్, ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్, ఆకాసా ఎయిర్ మరియు అనేక విదేశీ విమానయాన సంస్థలు సైతం తమ సర్వీసులను రద్దు చేసుకున్నాయి.
ముఖ్యంగా ఇండిగో సంస్థ.. మే 10వ ఉదయం 5.30 తేదీ వరకు 165 విమానయాన సర్వీసులను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా అమృత్‌సర్, బికనేర్, చండీగఢ్. ధర్మశాల, గ్వాలియర్, జమ్మూ, జోధ్‌పుర్, కిషన్‌గఢ్, లేహ్, రాజ్‌కోట్, శ్రీనగర్ సహా పలు ఎయిర్ పోర్టుల నుంచి విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ప్రయాణికులు ఎప్పటికప్పుడు అప్‌డేట్లను చూసుకోవాలని తెలిపింది. అలాగే ఆయా విమాన ప్రయాణికులకు రీషెడ్యూల్, లేదా టికెట్ క్యాన్సిల్ చేసుకునే సదుపాయం కూడా కల్పిస్తున్నట్లు వెల్లడించింది. ఇందుకోసం ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయమని, క్యాన్సిల్ చేసుకుంటే పూర్తి రీఫండ్ లభిస్తుందని పేర్కొంది.
మరోవైపు ఎయిర్ ఇండియా సైతం ఇలాంటి ప్రకటనే చేసింది. మే 10వ తేదీ ఉదయం వరకు శ్రీనగర్, జమ్మూ, లేహ్, జోధ్‌పుర్, అమృత్‌సర్, భుజ్, జామ్‌నగర్, రాజ్‌కోట్, చండీగఢ్ విమానాశ్రయాలకు తన విమానాల రాకపోకలను నిలిపి వేస్తున్నట్లు స్పష్టం చేసింది. ప్రయాణికులకు వన్ టైమ్ రీషెడ్యూల్ ఛార్జీల మినహాయింపును కూడా కల్పించింది. అసలు సర్వీసే వద్దనుకుంటే పూర్తి రీఫండ్ ఇస్తామని కూడా ప్రకటించింది. ఇదిలా ఉండగా.. దేశ వ్యాప్తంగా బుధవారం ఉదయం నుంచి 18 విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa