పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ పాకిస్థాన్‌ను వణికించింది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌తోపాటు పాకిస్థాన్ ప్రధాన భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా భారత సైన్యం మెరుపు దాడులు చేపట్టింది. పాక్ అప్రమత్తం అయ్యేలోగా మన సైన్యం పని పూర్తి చేసుకొని వెనక్కి వచ్చేసింది. పాక్‌లోని 9 ప్రాంతాల్లో భారత్ చేపట్టిన ఈ దాడిలో పెద్ద ఎత్తున లష్కరే తొయిబా, జైషే మహమ్మద్ ఉగ్రవాదులు, వారి సంబంధీకులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఈ ఆపరేషన్ విషయంలో భారత్ ఎంతో పకడ్బందీగా, వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఆపరేషన్ సిందూర్ అని పేరు పెట్టడం మొదలు.. మీడియాకు బ్రీఫింగ్ ఇవ్వడం వరకూ.. పాకిస్థాన్‌కు, ఉగ్రమూకలకు భారత్ బలమైన సందేశాలను పంపించింది.
పహల్గామ్‌లో 26 మందిని పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదులు వారి భార్యల నుదుటన ఉన్న సిందూరాన్ని తుడిచేశారు. దానికి ప్రతీకారం తీర్చుకుంటున్నామని ‘ఆపరేషన్ సిందూర్’ అనే పేరుతో చెప్పకనే చెప్పారు. ఇక భారత సైన్యం ఎంత కచ్చితత్వంతో టార్గెట్‌లను చేధించిందనేది వీడియోలను చూస్తే అర్థమవుతోంది. ఉగ్రస్థావరాలపై దాడికి సంబంధించిన వివరాలను బుధవారం ఉదయం ఇండియన్ ఆర్మీ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా వెల్లడించింది. ముగ్గురు అధికారులు ఈ మీడియా సమావేశంలో పాల్గొనగా.. అందులో ఇద్దరు మహిళలు ఉండటం గమనార్హం.
అంతే కాదు.. పహల్గామ్‌లో పురుషులను మాత్రమే టార్గెట్ చేసిన ఉగ్రవాదులు.. కర్ణాటకకు చెందిన మంజునాథ్ అనే వ్యక్తిని హతమార్చారు. అతడి భార్య పల్లవి చూస్తుండగానే ఈ దారుణానికి ఒడిగట్టారు. నా భర్తను చంపేశారు.. నన్ను కూడా చంపేయమని ఆమె ఉగ్రవాదిని అడగ్గా.. ‘మిమ్మల్ని చంపబోం.. వెళ్లి మీ ప్రధాని మోదీకి చెప్పుకోండి’ అని ఉగ్రవాదులు బదులిచ్చారు.
భర్తను కోల్పోయి, నిస్సహాయ స్థితిలో ఉన్న మహిళను ఉద్దేశించి టెర్రరిస్టులు చేసిన ఈ వ్యాఖ్యలకు ప్రధాని మోదీ.. భారత వీర నారీమణులతోనే సమాధానం ఇచ్చారు. కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్.. ఆర్మీ తరఫున మీడియాతో మాట్లాడారు. తద్వారా.. ఏ మహిళ ద్వారానైతే ఉగ్రవాదులు తమ పైశాచికత్వం ఎలా ఉంటుందో మోదీకి తెలియజేస్తే.. అదే మహిళల ద్వారా మోదీ తన సత్తా ఏంటో టెర్రరిస్టులకు తెలిసి వచ్చేలా చేశారు. మతం ఆధారంగా భారతీయులను విడగొట్టే కుటిల ప్రయత్నాలు చేస్తున్న శత్రువుకి.. భారతీయుల ఐక్యత ఏంటో చూపించారని నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు.
‘భారత్ తన ప్రతిస్పందనలో గొప్ప సహనాన్ని చూపించింది. అయితే, ఒక విషయం స్పష్టంగా చెప్పాలి.. పాకిస్థాన్ ఏదైనా వివాదాస్పద చర్యకు దిగితే.. తగిన రీతిలో బదులివ్వడానికి భారత సాయుధ దళాలు పూర్తిగా సిద్ధంగా ఉన్నాయి. అటువంటి చర్యలు పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మారుస్తాయి’ అంటూ వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ పాకిస్థాన్‌కు వార్నింగ్ ఇచ్చిన వీడియో సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa