ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్ ,,,తుడిచిపెట్టుకుపోయిన జైషే మహమ్మద్ హెడ్ క్వార్టర్స్

national |  Suryaa Desk  | Published : Wed, May 07, 2025, 08:07 PM

పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకునేందుకు చర్యలు కొనసాగిస్తోంది. ఇన్నాళ్లూ దౌత్యపరంగా పాక్‌ను ఇబ్బంది పెట్టిన ఇండియా.. మంగళవారం రోజు ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా చేసుకుని మెరుపు దాడులు చేసింది. అయితే ఈ ఘటనలో ఇప్పటి వరకు 80 మంది వరకు ఉగ్రవాదులు చనిపోయారని తెలుస్తుండగా.. దాడి తర్వాత అక్కడి పరిస్థితులతు సంబంధించిన వీడియోలు సైతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా జైషే ఉగ్రవాద సంస్థ ప్రధాన కార్యాలయం.. ఆపరేషన్ సిందూర్ దెబ్బకు తుడిచిపెట్టుకుపోయినట్లు వీడియో చూస్తుంటే అర్థం అవుతుంది.


మొత్తంగా 9 ఉగ్రస్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారత్ మెరుపు దాడులు చేసింది. అర్ధరాత్రి ఆపరేషన్ సిందూర్ నిర్వహించగా.. 80 మంది వరకు ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం. అలాగే ఈ దాడుల వల్ల జైషే ఉగ్రవాద సంస్థ ప్రధాన కేంద్రం పూర్తిగా ధ్వంసం అయింది. అంతర్జాతీయ సరిహద్దుకు 100 కిలో మీటర్ల దూరంలో ఉన్న బహవల్‌పూర్‌లోని మర్కజ్ సుబాన్‌పై సైన్యం దాడి చేయగా.. ఈ భవంతి నేలమట్టం అయింది. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయు. ముఖ్యంగా భవంతి పైకప్పుకు అనేక చోట్ల రంధ్రాలు కాగా.. పూర్తిగా శిథిలావస్తకు చేరుకుంది. ఎవరైనా గట్టిగా కదిలిస్తే భవనం పడిపోయే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.


అలాగే లాహోర్ నుంచి 400 కిలో మీటర్ల దూరంలో ఉన్న బహవల్‌పూర్‌.. పాకిస్థాన్‌లోనే 12వ అతిపెద్ద నగరం. ఇక్కడ జైషే ప్రధాన కార్యాలయం మొత్తంగా 18 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ భవంతిని ఉస్మాన్-ఓ-అలీ క్యాంపస్ అని కూడా పిలుస్తుంటారు. నిధుల సేకరణ, బోధన కేంద్రంగా దీన్ని వినియోగిస్తుంటారు. ఈ మసీదుకు జె.ఇ.ఎం ప్రధాన సంస్థ అయిన అల్-రహమత్ ట్రస్ట్ ద్వారా పెద్ద ఎత్తున నిధులు సమకూరాయి. ఈ భవనం 2011 వరకు ప్రాథమిక నిర్మాణంగా ఉండగా.. 2012లో అనేక వసతులు ఏర్పాటు చేసిన శిక్షణా శిబిరంగా మార్చారు.


అయితే 2001లో జరిగిన పార్లమెంట్ దాడి, 2016 పఠాన్ కోట్ దాడి, 2019 పుల్వామా దాడి సహా భారత్‌పై జరిగిన అనేక ఉగ్రదాడులకు.. ఇక్కడి నుంచే పథక రచన చేశారు. ఈ భవనాన్ని మసూద్ తన ఇంటిగా కూడా వాడుతుంటాడు. ప్రస్తుతం జైషే నెంబర్ 2గా ఉన్న ముఫ్తీ అబ్దుల్ రవూఫ్ అస్గర్, మౌలానా అమర్ ఇతర కుటుంబ సభ్యులు కూడా ఇందులోనే ఉంటున్నట్లు సమాచారం. వీరితో పాటే దాదాపు 600 మంది ఉగ్రవాదల ఇళ్లు కూడా ఈ క్యాంపస్‌లోనే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మౌలానా మసూద్ అజార్ మాత్రం ప్రస్తుతం బహవల్‌పూర్‌లోని మరో ఇంట్లో భారీ కాపలా మధ్య నివసిస్తున్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa