ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నెల జీతం రూ. 20 వేలైనా పర్సనల్ లోన్ ఇలా పొందోచ్చు

business |  Suryaa Desk  | Published : Wed, May 07, 2025, 11:26 PM

 జీవితంలో ఎప్పుడైనా ఊహించని ఖర్చులు తలెత్తవచ్చు - వైద్య ఖర్చులు, ఇంటి మరమ్మతులు లేదా అత్యవసర కొనుగోళ్లు. ఇక్కడే ఇలాంటి ఖర్చుల కోసం బ్యాంకుల్లో పర్సనల్ లోన్ తీసుకోవాలని అనుకుంటుంటారు. అయితే జీతం, క్రెడిట్ స్కోరు అన్నీ సరిగా ఉన్నాయా.. లోన్ వస్తుందా రాదా.. అనే సందేహాలు వస్తుంటాయి. మీరు నెలకు రూ. 20,000 సంపాదిస్తూ పర్సనల్ లోన్ కోసం అప్లై చేయాలని ఆలోచిస్తున్నట్లయితే, మీరు అర్హులవుతారా అని సందేహించవచ్చు. అయితే శుభవార్త ఏమిటంటే, చాలా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తక్కువ జీతం ఉన్నవారికి కూడా వ్యక్తిగత రుణాలను అందిస్తున్నాయి. పర్సనల్ లోన్లు ఆకర్షణీయంగా ఉండటానికి కారణం వాటికి ఎలాంటి హామీ అవసరం లేదు. కానీ, మీ అర్హత, మీ ఆదాయ స్థిరత్వం, క్రెడిట్ స్కోర్, మీ యజమాని ప్రొఫైల్ వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది.


రూ. 20,000 జీతంతో పర్సనల్ లోన్ అర్హతను నిర్ణయించే ముఖ్యమైన ప్రమాణాలను ఇప్పుడు చూద్దాం ఇంకా ఏ బ్యాంకులు ఈ జీతం ఉన్నవారికి వ్యక్తిగత రుణాలను అందిస్తున్నాయో తెలుసుకుందాం. మీరు రూ. 20,000 జీతంతో ఎంత రుణం పొందగలరు అనేది బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (NBFCలు) మీ దరఖాస్తును ఆమోదించే ముందు అంచనా వేసే అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది.


కనీస జీతం అవసరం: చాలా బ్యాంకులు వ్యక్తిగత రుణాల కోసం కనీస నెలవారీ ఆదాయ పరిమితిని నిర్ణయిస్తాయి. కొన్ని బ్యాంకులు కనీసం రూ. 25,000 నుంచి రూ. 30,000 వరకు జీతం కోరితే, మరికొన్ని బ్యాంకులు రూ. 20,000 సంపాదించే వారికి కూడా రుణాలను అందిస్తాయి, ప్రత్యేకించి వారు పేరున్న కంపెనీలలో పనిచేస్తుంటే లేదా మంచి క్రెడిట్ స్కోర్‌ను కలిగి ఉంటే.


క్రెడిట్ స్కోర్: మీ రుణ ఆమోదంలో మీ క్రెడిట్ స్కోర్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. 750 లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ ఆమోదం పొందే అవకాశాలను పెంచుతుంది. మీ క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉంటే, రుణదాతలు తక్కువ రుణ మొత్తాన్ని అందించవచ్చు లేదా అధిక వడ్డీ రేట్లను వసూలు చేయవచ్చు. రూ. 20,000 జీతంతో, మీరు రుణానికి పూర్తిగా అనర్హులు కూడా కావచ్చు.


ఉద్యోగ స్థిరత్వం: బ్యాంకులు పేరున్న కంపెనీలు, ప్రభుత్వ సంస్థలు లేదా బాగా స్థిరపడిన ప్రైవేట్ కంపెనీలలో పనిచేసే జీతం పొందే దరఖాస్తుదారులను ఎక్కువగా ఇష్టపడతాయి. మీకు కనీసం ఒక సంవత్సరం పని అనుభవం ఉండాలి, మీ ప్రస్తుత ఉద్యోగంలో కనీసం ఆరు నెలలు పూర్తి చేసి ఉండాలి. రుణ-ఆదాయ నిష్పత్తి: మీకు ఇప్పటికే ఏదైనా రుణం లేదా క్రెడిట్ కార్డ్ బిల్లులు ఉంటే, మీ జీతంలో ఎంత భాగం ఇప్పటికే వాటికి కేటాయించబడిందో రుణదాతలు తనిఖీ చేస్తారు. మీ మొత్తం ఈఎంఐ.. మీ నికర ఆదాయంలో 40 నుంచి 50 శాతం మించకూడదు.


రూ. 20,000 జీతంతో వ్యక్తిగత రుణాలు అందించే బ్యాంకులు..


యాక్సిస్ బ్యాంక్: కనీస జీతం అవసరం రూ. 15,000.


యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: ఢిల్లీ, ముంబై, పుణే, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, అహ్మదాబాద్ వంటి మెట్రోపాలిటన్ నగరాల్లో అవసరమైన కనీస జీతం రూ. 20,000. ఇతర నగరాల్లో, దరఖాస్తుదారులు అర్హత సాధించడానికి కనీసం రూ. 15,000 స్థూల జీతం కలిగి ఉండాలి.


స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI): SBI వివిధ అవసరాలను తీర్చడానికి ఎంపిక చేసిన నగరాల్లో కనీసం రూ. 15,000; ఇతర నగరాల్లో రూ. 20,000 కనీస జీతం ఉన్నవారికి వ్యక్తిగత రుణాలను అందిస్తుంది.


టాటా క్యాపిటల్: కనీస నెలవారీ ఆదాయం రూ. 15,000తో వ్యక్తిగత రుణాలను అందిస్తుంది.


రూ. 20,000 జీతంతో మీరు ఎంత లోన్ పొందగలరు?


మీ వ్యక్తిగత రుణానికి అర్హత ఎక్కువగా మీ నెలవారీ ఆదాయం, ఆర్థిక బాధ్యతలపై ఆధారపడి ఉంటుంది. మీరు నెలకు రూ. 20,000 సంపాదిస్తే, బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు మీ నికర ఆదాయాన్ని అంచనా వేస్తాయి. నెలవారీ ఖర్చులు, ఇప్పటికే ఉన్న రుణాల తర్వాత మీ ఆదాయం - మీరు ఎంత రుణం తీసుకోగలరో నిర్ణయించడానికి అంచనా వేస్తాయి.


రుణ ఆమోదం పొందే అవకాశాలను ఎలా మెరుగుపరచుకోవాలి..


తక్కువ జీతం కారణంగా రుణ ఆమోదం గురించి మీరు ఆందోళన చెందుతుంటే, మీ అవకాశాలను మెరుగుపరచుకోవడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి.


మంచి క్రెడిట్ స్కోర్‌ను నిర్వహించాలి. మీ బిల్లులు, EMIలను సకాలంలో చెల్లించండి. డిఫాల్ట్‌లను నివారించండి. అధిక క్రెడిట్ స్కోర్ రుణ అర్హతను పెంచుతుంది. మీ రుణ-ఆదాయ నిష్పత్తి ఎక్కువగా ఉంటే, కొత్త రుణం కోసం దరఖాస్తు చేసే ముందు చిన్న రుణాలను మూసివేయడానికి ప్రయత్నించండి. మీరు తక్కువ మొత్తానికి అర్హత పొందినట్లయితే, చిన్న రుణం కోసం దరఖాస్తు చేసుకోవడాన్ని పరిగణించండి. మీ ఆదాయం పెరిగిన తర్వాత దానిని పెంచుకోండి.


వీలైతే, స్థిరమైన ఆదాయం, మంచి క్రెడిట్ స్కోర్ ఉన్న కుటుంబ సభ్యునితో కలిసి రుణం కోసం దరఖాస్తు చేయండి. తిరిగి చెల్లించే కాలవ్యవధి ఎక్కువగా ఉండేలా ఎంచుకోండి. ఎక్కువ కాలవ్యవధిని ఎంచుకోవడం వలన నెలవారీ ఈఎంఐ తగ్గుతుంది, ఇది రుణం కోసం అర్హత సాధించడాన్ని సులభతరం చేస్తుంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa