ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సరిహద్దుల్లో పౌరుల మరణాలపై మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ ఆవేదన

national |  Suryaa Desk  | Published : Fri, May 09, 2025, 07:20 PM

భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో పెరుగుతున్న ఉద్రిక్తతలు, పౌరుల మరణాలపై జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నేడు శ్రీనగర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె భావోద్వేగానికి గురై కన్నీటి పర్యంతమయ్యారు. ఇరు దేశాలు తక్షణమే సంయమనం పాటించాలని, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.సరిహద్దుల్లో అమాయక పౌరులు, ముఖ్యంగా చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విచారకరమని మెహబూబా ముఫ్తీ అన్నారు. "సరిహద్దుల్లో జరుగుతున్న మరణాలు విచారకరం. ప్రాణాలు కోల్పోతున్న అమాయక చిన్నారుల తప్పేంటి తక్షణమే సంయమనం పాటించడం, ఉద్రిక్తతలను తగ్గించడం చాలా అవసరం. ప్రస్తుత పరిస్థితిని విజ్ఞతతో అదుపులోకి తీసుకురావడం అత్యంత కీలకం" అని ఆమె పేర్కొన్నారు.ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి, ఆ తర్వాత ఇరు దేశాల సైనిక ప్రతిస్పందనల నేపథ్యంలో సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరిగాయని ఆమె గుర్తుచేశారు. "అమాయకులను ఎందుకు చంపుతున్నారు" అని ఆమె ఆవేదనగా ప్రశ్నించారు. ఈ హింసాత్మక ధోరణి ఇలాగే కొనసాగితే ప్రపంచం మొత్తం అల్లకల్లోలంలోకి జారుకునే ప్రమాదం ఉందని ఆమె హెచ్చరించారు. "పుల్వామా దాడి తర్వాత ఏం జరిగిందో మనమంతా చూశాం. ఇప్పుడు పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాలు యుద్ధం అంచున ప్రమాదకరంగా నిలిచాయి" అని ముఫ్తీ ఆందోళన వ్యక్తం చేశారు.ఇరు దేశాలు తమ సైనిక లక్ష్యాలను ఛేదించామని చెప్పుకుంటున్నాయని, కానీ ఈ ఎదురుకాల్పుల్లో అమాయక చిన్నారులు ఎందుకు బలి కావాల్సి వస్తోందని ఆమె ప్రశ్నించారు. "పాకిస్థాన్ జమ్ములోని ఓ బ్రిగేడ్ హెడ్ క్వార్టర్స్‌ను తాము దెబ్బతీశామని చెబుతోంది. భారత్ ఉగ్రవాద స్థావరాలను నిర్వీర్యం చేశామని అంటోంది. కానీ, ఈ కాల్పుల్లో మరణిస్తున్న చిన్నారుల తప్పేంటి" అని ఆమె నిలదీశారు.ఈ ఉద్రిక్తతల మధ్య జమ్ముకాశ్మీర్ ప్రజలు నలిగిపోతున్నారని మెహబూబా ఆవేదన వ్యక్తం చేశారు. "ఒకవేళ అణు యుద్ధం సంభవిస్తే, విజయం సాధించామని చెప్పుకోవడానికి ఎవరు మిగులుతారు" అని ఆమె ప్రశ్నించారు. "దయచేసి ఇరు దేశాలు ఇప్పుడే ఆపండి. బతకండి, బతకనివ్వండి" అని ఆమె ఉద్వేగంగా విజ్ఞప్తి చేశారు. యుద్ధం, హింస మానవత్వ స్ఫూర్తికి విరుద్ధమని, సైనిక చర్యలు సమస్యకు పరిష్కారం కావని, అవి కేవలం లక్షణాలను మాత్రమే పరిష్కరిస్తాయని, మూల కారణాలను కాదని ముఫ్తీ స్పష్టం చేశారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa