ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మేనల్లుడితో కుమార్తె పెళ్లి కోసం ,,,,6 నెలల చిన్నారిని చంపిన అమ్మమ్మ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 13, 2025, 07:34 PM

కాకినాడ జిల్లా పిఠాపురంలో ఆరు నెలల చిన్నారి అనుమానాస్పద మృతి కేసులో మిస్టరీ వీడింది. రోజుకో మలుపు తిరుగుతూ వచ్చిన ఈ కేసులో నమ్మశక్యం కాని నిజాలు వెలుగులోకి వచ్చాయి. సభ్యసమాజమే విస్తుపోయేలా.. కఠోర వాస్తవాలు కళ్లముందుకు వచ్చాయి. మానవత్వానికే మచ్చ తెచ్చేలా కన్నబిడ్డను తన చేతులతో చంపేసిందో తల్లి. బోసినవ్వుల మనవరాలిని ఆడించాల్సిన అమ్మమ్మే.. ఆ నవ్వులను చిదిమేసింది. అప్పటి వరకూ తనను ఆడిస్తూ పాడిస్తూ వచ్చిన చేతులే.. తన ప్రాణాలు తీస్తుంటే.. పాపం ఆ పసిప్రాణం విలవిల్లాడిపోయింది. అనురాగం పంచాల్సిన అమ్మ, ఆప్యాయంగా చూడాల్సిన అమ్మమ్మ కలిసి చంపేస్తుంటే.. ఈ పాడు సమాజంలోకి ఎందుకు పంపించావ్ దేవుడా అనుకుంటూ తనువు చాలించింది.


ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పిఠాపురంలోని జగ్గయ్య చెరువు ప్రాంతంలో మే నెల ఆరో తేదీన ఓ ఇంటి వెనుక ఉన్న నూతిలో ఆరు నెలల చిన్నారి మృతదేహం కలకలం రేపింది. అలాగే ఆ ఇంటి ముందు పసుపు, కుంకుమతో ముగ్గు వేసి ఉండటం మరింత కంగారు పెట్టింది. దీంతో స్థానికులు భయపడిపోయారు. క్షుద్రపూజలు చేసి చిన్నారిని చంపేశారంటూ భయాందోళనలు మొదలయ్యాయి. అయితే పోలీసుల విచారణలో నమ్మలేని నిజాలు వెలుగుచూశాయి. అమ్మ, అమ్మమ్మ కలిసి ఆరు నెలల చిన్నారిని ఘోరంగా హత్య చేసిన వైనం బయటపడింది.


పోలీసులు చెప్తున్న వివరాల ప్రకారం.. పిఠాపురానికి చెందిన సతీష్ 2024లో శైలజ అనే యవతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే ఇద్దరివీ వేర్వేరు కులాలు కావటంతో సతీష్ తల్లిదండ్రులు అతన్ని దూరం పెట్టారు. దీంతో సతీష్ భార్య శైలజతో కలిసి జగ్గయ్య చెరువులోని అత్తమామ వద్ద ఉంటున్నాడు. సతీష్, శైలజ దంపతులకు ఆరు నెలల కిందట యశ్విత పుట్టింది. అయితే మే 6వ తేదీన యశ్విత ఇంటి వెనుక ఉన్న నూతిలో శవమై కనిపించింది. మే ఐదో తేదీ రాత్రి యశ్వితను అమ్మమ్మ అన్నవరం నిద్రపుచ్చింది. భార్య శైలజ, అత్త అన్నవరం ఒక గదిలో పడుకోవటంతో.. సతీష్ తన మామతో కలిసి మరోచోట పడుకున్నారు. అయితే ఉదయమే చూస్తే యశ్విత కనిపించలేదు.


దీంతో కుటుంబసభ్యులు అందరూ చుట్టుపక్కల గాలించారు. చివరకు ఇంటి వెనుక ఉన్న నూతిలో చిన్నారి యశ్విత విగతజీవిగా పడి ఉండటం గుర్తించారు. అయితే అదే సమయంలో ఇంటి ముందు పనుపు, కుంకుమతో ముగ్గు వేసి ఉండటం చూసి క్షుద్రపూజలు చేసి చిన్నారిని చంపేశారని భయపడ్డారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై చిన్నారి తండ్రి సతీష్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. డాగ్ స్వ్కాడ్‌ను రంగంలోకి దించారు. అయితే డాగ్ స్క్వాడ్ యశ్విత తల్లి శైలజ, అమ్మమ్మ అన్నవరం వద్దే తిరగటంపై పోలీసులకు వారిపై అనుమానం కలిగింది. దీనికి తోడు యశ్విత మృతదేహం లభించిన నూతి వద్ద అమ్మమ్మ అన్నవరం సెల్ ఫోన్‌ను పోలీసులు గుర్తించారు. అలాగే సెల్‌ఫోన్‍కు పసుపు కుంకుమలు అంటుకుని ఉండటంతో పోలీసుల అనుమానం మరింత బలపడింది. దీనికి తోడు యశ్విత కోసం గాలిస్తున్న సమయంలో సతీష్‌ను పదే పదే నూతి వద్ద చూడాలని శైలజా, ఆమె తల్లి అన్నవరం సూచించారట. ఈ విషయాన్ని పోలీసులకు సతీష్ తెలియజేశారు.


దీంతో యశ్విత తల్లి శైలజ, అమ్మమ్మ అన్నవరాన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని తమ స్టైల్లో విచారిస్తే అసలు నిజం వెలుగులోకి వచ్చింది. యశ్విత పుట్టిన తర్వాత సతీష్‌కు, శైలజకు గొడవలు ప్రారంభమయ్యాయి. దీంతో తన కూతురు శైలజను మేనల్లుడికి ఇచ్చి పెళ్లి చేయాలని శైలజ తల్లి అన్నవరం భావించింది. ఇదే విషయాన్ని కూతురు శైలజకు కూడా చెప్పింది. భర్తతో విభేదాలు రావటంతో శైలజ కూడా ఇందుకు అంగీకరించింది. అయితే ఇందుకు యశ్విత అడ్డుగా ఉందనే కారణంతో.. అభం శుభం తెలియని ఆరు నెలల చిన్నారిని శైలజ, ఆమె తల్లి కలిసి హత్య చేశారు. మే ఐదో తేదీ రాత్రి యశ్వితను గొంతు నులిమి హత్య చేసిన తల్లి, అమ్మమ్మ.. చిన్నారి మృతదేహన్ని ఇంటి వెనుక నూతిలో పడేశారు.


తమపై ఎవరికీ అనుమానం రాకుండా ఉండాలనే ఉద్దేశంతో ఇంటి ముందు పనుపు, కుంకుమతో ముగ్గు వేసి క్షుద్రపూజలు జరిగినట్లు చిత్రీకరించారు. అయితే నిజాలను ఎక్కువ కాలం దాచలేరు, ముగ్గు వేసేందుకు ఉపయోగించిన పసుపు, కుంకుమ అన్నవరం ఫోన్‌కు అంటుకుని ఉండటం, ఆ ఫోన్ నూతి వద్ద పోలీసులకు లభించడం.. డాగ్ స్వ్వాడ్ పదే పదే వారి చుట్టూ తిరగటం.. ఇక చిన్నారిని వెతికే క్రమంలో శైలజ, అన్నవరం చెప్పిన మాటలు... ఇలా అన్నీ కలిపి వారి డ్రామాను పోలీసులకు పట్టించాయి. అలా పసిపాప ఉసురు తీసిన వారి పాపం.. పండింది..






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa