ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైకోర్టు జడ్జీల తీరుపై సుప్రీం సీరియస్

national |  Suryaa Desk  | Published : Wed, May 14, 2025, 06:29 AM

హైకోర్టు న్యాయమూర్తులు తరచూ అనవసరంగా కాఫీ బ్రేక్‌లు తీసుకోవడం, విధుల పట్ల నిర్లక్ష్యం వహించడం, తీర్పుల వెల్లడిలో తీవ్ర జాప్యం చేయడం వంటి అంశాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది అత్యంత ప్రాముఖ్యత కలిగిన విషయమని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్. కోటేశ్వర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం నాడు వ్యాఖ్యానించింది. న్యాయమూర్తుల పనితీరు, వారిపై వెచ్చిస్తున్న ఖర్చులకు మధ్య పొంతన ఉందో లేదో సమీక్షించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది.ప్రజల సొమ్ముతో న్యాయమూర్తులకు జీతభత్యాలు, సౌకర్యాలు కల్పిస్తున్నామని, దానికి తగినట్లుగా వారు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సుప్రీంకోర్టు హితవు పలికింది. కొందరు న్యాయమూర్తులు అంకితభావంతో పనిచేస్తున్నప్పటికీ, మరికొందరు తరచూ విరామాలు తీసుకోవడం, కేసుల విచారణలో జాప్యం చేయడం ఆందోళనకరమని పేర్కొంది. ఈ నేపథ్యంలో, హైకోర్టు న్యాయమూర్తుల పనితీరుపై సమగ్ర ఆడిట్ నిర్వహించాల్సిన సమయం ఆసన్నమైందని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.జార్ఖండ్ హైకోర్టులో ఓ క్రిమినల్ అప్పీల్‌పై 2022లో తీర్పును రిజర్వ్ చేసినప్పటికీ, సుదీర్ఘకాలం వెలువరించకపోవడంతో నలుగురు నిందితులు  సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీం జోక్యం తర్వాత వెలువడిన తీర్పులో ముగ్గురు నిర్దోషులుగా తేలగా, మరొకరికి బెయిల్ లభించింది. హైకోర్టు తీర్పు ఆలస్యం కారణంగా నిర్దోషులు ఏళ్ల తరబడి జైల్లో మగ్గాల్సి రావడంపై ధర్మాసనం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. సరైన సమయంలో తీర్పులు వెలువడితే, వారు మూడేళ్ల క్రితమే స్వేచ్ఛా వాయువులు పీల్చేవారని వ్యాఖ్యానించింది.విచారణ సందర్భంగా, "కొందరు న్యాయమూర్తులు చాలా కష్టపడి పనిచేస్తున్నారు, కానీ అదే సమయంలో కొందరు అనవసరంగా కాఫీ బ్రేక్‌లు, ఇతర విరామాలు తీసుకుంటున్నారు. మధ్యాహ్న భోజన విరామం ఉన్నది దేనికి హైకోర్టు న్యాయమూర్తుల గురించి మేం చాలా ఫిర్యాదులు వింటున్నాం" అని జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది చాలా పెద్ద సమస్య అని, దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.హైకోర్టు న్యాయమూర్తులపై ఎంత ఖర్చు చేస్తున్నాం, వారి నుంచి ఎంత ఫలితం వస్తోందనేది అంచనా వేయాలని సుప్రీంకోర్టు పేర్కొంది. న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని కాపాడేందుకు, తీర్పుల వెల్లడిలో జాప్యాన్ని నివారించేందుకు తప్పనిసరి మార్గదర్శకాలు అవసరమని నొక్కి చెప్పింది. ఈ కేసును అలహాబాద్ హైకోర్టుకు సంబంధించిన మరో సారూప్య కేసుతో జత చేస్తూ, దేశవ్యాప్తంగా అన్ని హైకోర్టుల నుంచి తీర్పుల రిజర్వేషన్, వెల్లడికి సంబంధించిన డేటాను సేకరించాలని రిజిస్ట్రీని ఆదేశించింది. తదుపరి విచారణను జూలై నెలకు వాయిదా వేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa