ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బంగారం ధరలు ప్రస్తుతం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి

business |  Suryaa Desk  | Published : Sun, May 18, 2025, 02:51 PM

బంగారం ధరలు ప్రస్తుతం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో నమోదైన గరిష్ఠ స్థాయి నుంచి పసిడి ధర ఏకంగా 7 శాతం మేర క్షీణించింది. అమెరికాలో వడ్డీ రేట్ల కోతపై అంచనాలు తగ్గడం, వాణిజ్య యుద్ధ భయాలు సన్నగిల్లడం వంటి కారణాలతో బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.ఎంసీఎక్స్‌లో ఏప్రిల్ 22న 10 గ్రాముల బంగారం ధర రూ.99,358 వద్ద ఆల్ టైమ్ గరిష్ఠాన్ని తాకింది. అప్పటి నుంచి చూస్తే ఇప్పుడు ధర గణనీయంగా తగ్గింది. గత ఏడాది డిసెంబర్ తర్వాత తొలిసారిగా 50 రోజుల చలన సగటు మూవింగ్ యావరేజ్కంటే దిగువన ముగిసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ బంగారం ధర 10 గ్రాములకు రూ.88,000 స్థాయికి పడిపోతే పెట్టుబడిదారులు ఎలాంటి వ్యూహం అనుసరించాలనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.యాక్సిస్ సెక్యూరిటీస్ నివేదిక ప్రకారం.. బంగారం ధరలు ప్రస్తుతం 50 రోజుల చలన సగటుకు కీలకమైన మద్దతు స్థాయిని పరీక్షిస్తున్నాయి. గత ఏడాది నవంబర్ నుంచి ప్రతి తగ్గుదలలోనూ ఈ స్థాయి మంచి మద్దతును అందించిందని సంస్థ గుర్తుచేసింది. గతంలో మే 16 నుంచి మే 20 మధ్య కాలాన్ని ధరల మార్పులకు కీలకమైనదిగా ఈ సంస్థ గుర్తించింది. అంతర్జాతీయ మార్కెట్లలో 3,136 డాలర్ల స్థాయిని కీలక మద్దతుగా పేర్కొంది. ఒకవేళ ధరలు దీని కంటే దిగువకు పడిపోతే, 2,875-2,950 డాలర్ల శ్రేణికి క్షీణించే అవకాశం ఉందని తెలిపింది.అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల కోతపై అంచనాలు తగ్గడం వల్ల బంగారం వంటి సురక్షిత పెట్టుబడులకు డిమాండ్ తగ్గిందని యాక్సిస్ సెక్యూరిటీస్ అభిప్రాయపడింది. అలాగే, వాణిజ్య యుద్ధాల ప్రభావం వృద్ధిపై అంతగా ఉండదనే అంచనాలు పెరగడంతో బాండ్ ఈల్డులు పెరిగాయని, ఇది బంగారం ఆకర్షణను తగ్గించిందని వివరించింది. బంగారంపై ఎలాంటి రాబడి రాకపోవడం, పెరుగుతున్న వడ్డీ రేట్లు దీనిని ఒక పెట్టుబడిగా ఆకర్షణీయం కాకుండా చేస్తున్నాయని పేర్కొంది.ఆగ్మాంట్ రీసెర్చ్ హెడ్ రేనిషా చైనానీ మాట్లాడుతూ.. కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, మార్కెట్లో డిమాండ్ తగ్గడం వల్ల బంగారం ధరలపై తీవ్ర ఒత్తిడి ఉందని తెలిపారు. ‘రష్యా-ఉక్రెయిన్ మధ్య చర్చల వేగం మందగించడం, అమెరికా డేటా అంచనాల కంటే తక్కువగా ఉండటంతో పెట్టుబడిదారులు సురక్షిత సాధనాల వైపు మళ్లడంతో బంగారం ధరలు ఇంట్రాడే కనిష్టాల నుంచి సుమారు 100 డాలర్లు (దాదాపు రూ.1,500) పెరిగాయి’ అని ఆమె విశ్లేషించారు.‘బంగారం ధరలు 3200 డాలర్ల వద్ద డబుల్-టాప్ నెక్ లైన్ మద్దతును కోల్పోయినందున, స్వల్పకాలంలో 3000-50 (సుమారు రూ.87,000 - రూ.88,000) డాలర్ల వరకు మరింత తగ్గుదల ఉండవచ్చు’ అని రేనిషా చైనానీ అంచనా వేశారు. ప్రస్తుత ధోరణులు ప్రతికూలంగా కనిపించినప్పటికీ, తగ్గిన ధరల వద్ద దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు అవకాశాలు ఉండవచ్చని ఆమె సూచించారు. ఆగ్మాంట్ సాంకేతిక విశ్లేషణ ప్రకారం.. భారతీయ మార్కెట్లో 10 గ్రాముల బంగారానికి రూ.92,000 వద్ద మద్దతు, రూ.94,000 వద్ద ప్రతిఘటన ఉందని, అయినప్పటికీ మార్కెట్ సెంటిమెంట్ ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని సూచిస్తోందని తెలిపింది.రిద్ధిసిద్ధి బులియన్స్ మేనేజింగ్ డైరెక్టర్ పృథ్వీరాజ్ కొఠారీ మాట్లాడుతూ.. ప్రస్తుత మార్కెట్ సర్దుబాట్లు ఉన్నప్పటికీ బంగారం ప్రాథమిక బలాలు స్థిరంగా ఉన్నాయని కాస్త సానుకూల దృక్పథాన్ని వ్యక్తం చేశారు. ‘బంగారం దీర్ఘకాలిక ప్రాథమిక అంశాలు బలంగానే ఉన్నాయి. కానీ స్వల్పకాలిక ధరల గమనం స్థూల ఆర్థిక మార్పులకు లోబడి ఉంటుంది. ధరలు తగ్గే అవకాశం ఉన్నందున పెట్టుబడిదారులు విభిన్న వ్యూహాలతో అప్రమత్తంగా ఉండాలి’ అని ఆయన అన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు ప్రస్తుత అంచనాలను మించి వేగంగా కోలుకుంటే, బంగారం ధరలు 3000-3050 డాలర్ల శ్రేణికి పడిపోయే అవకాశం ఉందని కొఠారీ హెచ్చరించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa