ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైదరాబాద్‌లో భారీ పేలుళ్లకు కుట్ర.. ఇద్దరు అరెస్ట్

Crime |  Suryaa Desk  | Published : Sun, May 18, 2025, 08:50 PM

హైదరాబాద్‌ నగరంలో భారీ పేలుళ్లకు కుట్ర పన్నిన ఇద్దరు వ్యక్తులను తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు అరెస్టు చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు అలర్ట్ అయిన పోలీసులు.. విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహ్మాన్, హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ సమీర్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు నిందితులను రహస్య ప్రదేశంలో ఉంచి లోతుగా విచారిస్తున్నారు. పేలుళ్లకు పథకం వేయడానికి గల కారణాలు, దీని వెనుక ఉన్న సూత్రధారులు ఎవరు, ఉగ్రవాద సంస్థలతో వారికి సంబంధాలు ఉన్నాయా అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.


గతంలో హైదరాబాద్‌లో ఉగ్రవాద దాడులు జరిగిన నేపథ్యంలో, ఈ కుట్రను పోలీసులు అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈ అరెస్టుతో నగర ప్రజలు కొంత ఆందోళన చెందుతున్నప్పటికీ, తెలంగాణ ఇంటెలిజెన్స్ విభాగం అప్రమత్తంగా ఉందని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని ఉన్నతాధికారులు భరోసా ఇచ్చారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. ఎలాంటి దుష్ప్రచారాలను నమ్మవద్దని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడేందుకు పోలీసులు అన్ని చర్యలు తీసుకుంటున్నారని అధికారులు స్పష్టం చేశారు. కాగా, పహల్గాం దాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగిన పరిణామాలతో ఉగ్రవాదుల పేర్లు వింటేనే జనం హడలిపోతున్నారు. ఇలాంటి సమయంలో హైదరాబాద్ నగరంలో పేలుళ్లకు కుట్ర జరగటం ఆందోళనలకు గురి చేస్తోంది.


ఇక భారత సైన్యం పాకిస్థాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందంపై స్పష్టమైన ప్రకటన చేసింది. మే 10న ఇరు దేశాల మధ్య కుదిరిన ఈ ఒప్పందానికి నిర్దిష్టమైన గడువు ఏదీ లేదని, ఇది నిరంతరంగా కొనసాగుతుందని తేల్చి చెప్పింది. మే 18 సాయంత్రం 5 గంటలకు కాల్పుల విరమణ ముగుస్తుందంటూ వస్తున్న వార్తలను సైన్యం ఖండించింది. కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ అనంతరం ఇరు దేశాల మధ్య నాలుగు రోజుల పాటు తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. భారత, పాకిస్థాన్ సైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరల్స్ మధ్య మే 12న జరిగిన హాట్‌లైన్ సంభాషణల ప్రకారం, ఈ కాల్పుల విరమణ కొనసాగుతుందని భారత సైన్యాధికారి ఆదివారం స్పష్టం చేశారు. ఇది తాత్కాలిక ఏర్పాటు మాత్రమేననే ఊహాగానాలను ఆయన కొట్టిపారేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com