భారతదేశంలో వేడి తీవ్రత ప్రమాదకర స్థాయికి చేరుకుంటోందని, దేశంలోని అత్యధిక జనాభా దీని ప్రభావానికి గురవుతోందని ఢిల్లీకి చెందిన ‘శక్తి పర్యావరణం, నీటి మండలి’ మంగళవారం విడుదల చేసిన తాజా అధ్యయనం వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం, దేశంలోని దాదాపు 57 శాతం జిల్లాలు అధికం నుంచి అతి తీవ్రమైన వేడి ముప్పును ఎదుర్కొంటున్నాయి. ఈ ప్రాంతాల్లో దేశం మొత్తం జనాభాలో 76 శాతం మంది నివసిస్తుండటం గమనార్హం.సీఈఈడబ్ల్యూ అధ్యయనం ప్రకారం, అత్యధిక వేడి ప్రమాదం పొంచి ఉన్న పది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. ఈ జాబితాలో ఢిల్లీ, మహారాష్ట్ర, గోవా, కేరళ, గుజరాత్, రాజస్థాన్, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి. గత దశాబ్ద కాలంలో పగటిపూట కంటే అధిక ఉష్ణోగ్రతల రాత్రుల సంఖ్య వేగంగా పెరిగిందని ఈ అధ్యయనం స్పష్టం చేసింది.ఈ అధ్యయనం కోసం సీఈఈడబ్ల్యూ పరిశోధకులు దేశవ్యాప్తంగా 734 జిల్లాల్లో గత 40 ఏళ్ల వాతావరణ సమాచారాన్ని, ఉపగ్రహ చిత్రాలను విశ్లేషించారు. ఉష్ణోగ్రతల తీరు, భూ వినియోగం, నీటి వనరులు, పచ్చదనం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. వేడి ముప్పును సమగ్రంగా అంచనా వేయడానికి రాత్రి ఉష్ణోగ్రతలు, గాలిలో తేమతో పాటు జనాభా, నిర్మాణ సాంద్రత, ఆరోగ్యం, సామాజిక-ఆర్థిక పరిస్థితులను కూడా పరిశీలించారు.మొత్తం 734 జిల్లాల్లో 417 జిల్లాలు అధిక లేదా చాలా అధిక వేడి ప్రమాద కేటగిరీలో ఉన్నాయని ఈ అధ్యయనం తేల్చింది. వీటిలో 151 జిల్లాలు అధిక ప్రమాదంలో, 266 జిల్లాలు చాలా అధిక ప్రమాదంలో ఉన్నట్లు గుర్తించారు. మరో 201 జిల్లాలు ఓ మోస్తరు వర్గంలోకి, 116 జిల్లాలు తక్కువ లేదా చాలా తక్కువ కేటగిరీలో ఉన్నాయని సీఈఈడబ్ల్యూ సీనియర్ ప్రోగ్రాం లీడ్ విశ్వాస్ చితలే తెలిపారు."రాత్రిపూట కూడా వేడి తగ్గకపోవడం వల్ల శరీరం చల్లబడే అవకాశం తగ్గి, అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది" అని ఆయన హెచ్చరించారు. పది లక్షలకు పైగా జనాభా ఉన్న జిల్లాలు, నగరాలు ఈ ముప్పును ఎక్కువగా ఎదుర్కొంటున్నాయని నివేదిక పేర్కొంది.చల్లగా ఉండే హిమాలయ ప్రాంతాల్లో కూడా పగటి వేడి, రాత్రి వెచ్చదనం పెరిగాయని, ఇది బలహీనమైన పర్వత పర్యావరణ వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఈ అధ్యయనం వెల్లడించింది. గత దశాబ్దంలో ఉత్తర భారతదేశంలో వేసవిలో తేమ 30-40 శాతం నుంచి 40-50 శాతానికి పెరిగింది. ముఖ్యంగా వ్యవసాయ కార్మికులు అధికంగా ఉండే ఇండో-గంగా మైదాన ప్రాంతంలో వేడి ఒత్తిడి మరింత తీవ్రంగా మారుతోంది.ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లోని జిల్లాలు అధిక ఉష్ణోగ్రతల కారణంగా అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాయి. అయితే, ఒడిశాలో పచ్చదనం, నీటి వనరులు ఎక్కువగా ఉన్న జిల్లాలు అత్యధిక వేడిని కూడా తట్టుకోగలిగాయని నివేదిక తెలిపింది. భారత్‌లోనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా కూడా 2024 అత్యధిక వేడి సంవత్సరంగా నమోదయింది. తీవ్రమైన వేడి తరంగాలు దేశంలోని తక్కువ ఆదాయ కుటుంబాలపై అధిక ప్రభావం చూపుతున్నాయి. ఈ కారణంగా 2030 నాటికి భారతదేశ జీడీపీలో 4.5 శాతం తగ్గుదల నమోదు కావొచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa