భారతదేశ వ్యాప్తంగా ఇక కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉంది. దేశంలోని ప్రధాన నగరాలు, ప్రాంతాల్లో ఇవాళ(బుధవారం) భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతమై ఉండగా, ముంబై, ఢిల్లీ, బెంగాల్‌లో భారీ వర్షాలు పడుతున్నాయి. ముంబై, బెంగాల్‌లో ఈ ఉదయం నుంచీ భారీ వర్షాలు కురుస్తుండగా, దేశ రాజధాని ఢిల్లీలో కుండపోత వర్షం కురిసే అవకాశం ఉందని IMD చెబుతోంది. మే 21 బుధవారం దేశ రాజధానిలో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేయడంతో సమ్మర్‌లో ఎండ వేడిమితో అల్లాడుతున్న ఢిల్లీకి కొంత ఉపశమనం లభించే అవకాశం ఉంది. రేపు కూడా ఢిల్లీలో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. నిన్న(మంగళవారం) ముంబైలో ఊహించని రీతిన భారీ వర్షాలు కురిశాయి. ఫలితంగా ఆర్థిక రాజధానిలోని రద్దీగా ఉండే రోడ్లపై నీరు నిలిచి, వరదనీరు పెల్లుబికింది. ఫలితంగా ట్రాఫిక్ ఇక్కట్లు ఎదురయ్యాయి. ముంబై తూర్పు, పశ్చిమ శివారు ప్రాంతాల్లో రుతుపవనాలకు ముందు వర్షాల తీవ్రత ఎక్కువగా ఉందని అధికారులు వివరించారు. అటు, మహారాష్ట్రలోని పూణేలో భారీ వర్షం కారణంగా హోర్డింగ్‌లు కూలిపోయాయి. 15 వరకూ చెట్లు నేలకూలాయి. వాతావరణ శాఖ చెబుతున్న వివరాల ప్రకారం, కర్ణాటక తీరం వెంబడి తూర్పు-మధ్య అరేబియా సముద్రంలో ఏర్పడే తుపాను కారణంగా మే 21 - 24 మధ్య మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలలో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. మే 22 నాటికి ఇది అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఆ తర్వాత, అది ఉత్తరం వైపునకు కదిలి మరింత తీవ్రమవుతుంది. ఫలితంగా మహారాష్ట్రలో రాబోయే మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాతావరణ శాఖ అధికారి శుభాంగి భూటే చెప్పినదాని ప్రకారం మహారాష్ట్రలో చాల చోట్ల ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల గంటకు 30-40 కి.మీ. లేదా అంతకంటే ఎక్కువ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఆయన తెలిపారు. తద్వారా దక్షిణ కొంకణ్, ముంబై, దక్షిణ మధ్య మహారాష్ట్ర వంటి ప్రాంతాలు ప్రభావితమయ్యే అవకాశం ఉందన్నారు. పశ్చిమ బెంగాల్‌లో వర్షం భారత వాతావరణ శాఖ చెబుతున్న వివరాల ప్రకారం రేపటి (శుక్రవారం) వరకూ పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర జిల్లాల్లో భారీ వర్షాలు, దక్షిణ ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయి. ఉత్తర బంగ్లాదేశ్ ఎగువన వాయు తుపాను ప్రభావం, బంగాళాఖాతం నుంచి కొన్ని అనుకూలమైన పవనాలు ఉండటం వల్ల పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. జార్‌గ్రామ్, పురులియా, బంకురా, హుగ్లీ, పశ్చిమ బుర్ద్వాన్, తూర్పు బుర్ద్వాన్, పశ్చిమ మిడ్నాపూర్, బిర్భూమ్, ముర్షిదాబాద్‌తో సహా దక్షిణ బెంగాల్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD తన వాతావరణ బులెటిన్‌లో పేర్కొంది. అటు, డార్జిలింగ్, కమ్లింపాంగ్, కూచ్ బెహార్, జల్పైగురి వంటి ఉత్తర బెంగాల్ జిల్లాల్లో శుక్రవారం వరకూ భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది. దక్షిణ భారత వాతావరణం మరోవైపు, దక్షిణ భారతంలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని కోస్తా ప్రాంతాలు భారీ వర్షాలు, ఈదురుగాలులతో అల్లాడిపోగా.. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలను కుండపోత వర్షం ముంచెత్తింది. మరోవైపు వర్షాల కారణంగా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. కర్ణాటకలో ఐదుగురు మరణించగా, వారిలో ముగ్గురు బెంగళూరుకు చెందిన వారు. తమిళనాడులోని మధురైలో గోడ కూలి ముగ్గురు మరణించారు. మే 20 నుంచి 22 వరకూ ఏపీలో భారీ వర్షాలు, బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ 'ఎల్లో అలర్ట్' సైతం జారీ చేసింది. అటు, కేరళలో రాబోయే 7 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మంగళవారం తెల్లవారుజామున, కాసర్గోడ్, కన్నూర్, వయనాడ్, మలప్పురం సహా రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాలు వర్షంతో అతలాకుతలమయ్యాయి. జూన్ 1వ తేదీ కంటే చాలా ముందుగానే, రాబోయే నాలుగు నుంచి ఐదు రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళకు వచ్చే అవకాశం ఉందని IMD తెలిపింది. ఇదే జరిగితే, 2009 తర్వాత అంటే దాదాపు పదహారేళ్లకు నైరుతి రుతుపవనాలు మళ్లీ భారత ప్రధాన భూభాగాన్ని ముందుగా పలుకరించబోతున్నాయన్నమాట.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa