ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వ చీఫ్ యూనస్, ఆర్మీ చీఫ్ వాకర్ మధ్య తీవ్ర విభేదాలు

international |  Suryaa Desk  | Published : Wed, May 21, 2025, 09:28 PM

బంగ్లాదేశ్‌లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. తాత్కాలిక ప్రభుత్వ అధినేత ముహమ్మద్ యూనస్, ఆర్మీ చీఫ్ జనరల్ వాకర్-ఉజ్-జమాన్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరడంతో దేశం మరో రాజకీయ సంక్షోభం దిశగా పయనిస్తోంది. షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వంలో మొదట్లో మిత్రులుగా ఉన్న వీరిద్దరూ ఇప్పుడు ఎన్నికల నిర్వహణ, సైనిక జోక్యం, యూనస్ తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాలపై భిన్న ధ్రువాలుగా మారిపోయారు.గతేడాది ఆగస్టులో భారీ విద్యార్థి నిరసనల నేపథ్యంలో షేక్ హసీనా పదవీచ్యుతురాలై దేశం విడిచి వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో సంస్కరణలు చేపట్టి, త్వరితగతిన ఎన్నికలు నిర్వహిస్తామన్న హామీతో యూనస్ తాత్కాలిక ప్రభుత్వానికి నేతృత్వం వహించారు. తొలినాళ్లలో ఆర్మీ చీఫ్ జనరల్ వాకర్ ఈ మార్పును సమర్థించినప్పటికీ, ఎన్నికల నిర్వహణలో యూనస్ జాప్యం చేయడం, శిక్షపడిన ఇస్లామిస్ట్ నాయకులను, బంగ్లాదేశ్ రైఫిల్స్  తిరుగుబాటుదారులను విడుదల చేయడం వంటి చర్యలతో ఇరు వర్గాల మధ్య దూరం పెరిగింది. "ఈ ప్రభుత్వం స్వేచ్ఛాయుతమైన, నిష్పక్షపాతమైన ఎన్నికలు నిర్వహించడానికి మాత్రమే ఉంది. గత తొమ్మిది నెలలుగా యూనస్ ఎన్నికల నిర్వహణకు తొందరపడటం లేదని జనరల్ వాకర్ గమనించారు" అని సీనియర్ జర్నలిస్ట్ సుబీర్ భౌమిక్ వ్యాఖ్యానించారు.2009 నాటి బీడీఆర్ తిరుగుబాటులో 57 మంది ఆర్మీ అధికారుల హత్య కేసులో దోషులుగా తేలిన దాదాపు 300 మందిని ఈ ఏడాది విడుదల చేయడం సైన్యంలో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. మరో 400 మంది ఇస్లామిస్ట్ తీవ్రవాదులను విడుదల చేయడం కూడా దేశంలో ఉగ్ర కార్యకలాపాలు పెరగడానికి దోహదపడిందని సైనిక నాయకత్వం భావిస్తోంది.యూనస్‌కు సైనిక సలహాదారుగా నియమితులైన లెఫ్టినెంట్ జనరల్ కమ్రుల్ హసన్, అమెరికా రాయబారితో సమావేశమై తదుపరి ఆర్మీ చీఫ్ పదవికి మద్దతు కోరినట్లు ఆరోపణలు రావడంతో పరిస్థితి మరింత దిగజారింది. ఇది సైనిక నిబంధనల ఉల్లంఘనగా భావించిన జనరల్ వాకర్, హసన్‌ను తొలగించాలని మే 11న ప్రయత్నించగా, యూనస్ ఆ ఆదేశాలను అడ్డుకున్నారు.రాజ్యాంగాన్ని రద్దు చేసి, అధ్యక్షుడి అధికారాలను నిర్వీర్యం చేసేలా యూనస్ జూలైలో ఒక ప్రకటన చేయవచ్చని, తద్వారా జనరల్ వాకర్‌ను తొలగించి హసన్‌ను నియమించే అవకాశం ఉందని కథనాలు వెలువడుతున్నాయి. దీనికి ప్రతిగా జనరల్ వాకర్ నౌకాదళం, వైమానిక దళం, నిఘా వర్గాల మద్దతు కూడగడుతున్నట్లు సమాచారం. మరోవైపు, షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్‌ను రాబోయే ఎన్నికల్లో పోటీ చేయకుండా యూనస్ నిషేధించడం, సమగ్ర ఎన్నికల నిర్వహణ హామీపై నీలినీడలు కమ్ముకునేలా చేసింది. "ప్రధాన రాజకీయ పార్టీని పక్కనపెట్టి సమగ్ర ఎన్నికలు ఎలా నిర్వహిస్తారు" అని భౌమిక్ ప్రశ్నించారు. ఈ పరిణామాలతో బంగ్లాదేశ్‌లో రాజకీయ అనిశ్చితి మరింత తీవ్రరూపం దాల్చుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa