ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మద్యం స్కాంలో ఇరికించి అప్రదిష్టపాలు చేస్తున్నారని జగన్..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, May 22, 2025, 04:35 PM

మద్యంలో స్కాం ఎక్కడ జరిగిందని జగన్ ప్రశ్నించారు. మద్యం అమ్మకాల్లో ఎవరైనా లంచాలు ఎందుకిస్తారని అడిగారు. అమ్మకాలు ఎక్కువ ఉంటే లంచాలు ఇస్తారా, లేక లాభాలు తగ్గితే ఇస్తారా అని ప్రశ్నించారు. 2018-19 ఏడాదిలో 3.84 కోట్ల మద్యం కేసుల అమ్మకాలు జరిగితే 2.77 కోట్ల కేసుల బీర్లు అమ్మకాలు జరిగాయని, ఐదేళ్ల బాబు పాలనలో మద్యం అమ్మకాలు ఏటికేడాది పెరిగాయని తెలిపారు. వీటి వల్ల మద్యం కంపెనీలకు లాభాలు పెరిగి చంద్రబాబుకు లంచాలు ఇచ్చే పరిస్ధితి ఉండేదన్నారు. కానీ వైసీపీ పాలనలో ఐదేళ్లూ మద్యం అమ్మకాలు తగ్గాయన్నారు. తాము విధించిన పన్నులే ఇందుకు కారణమన్నారు. దీని వల్ల మద్యం కంపెనీలకు లాభం జరగలేదని, ప్రభుత్వానికి ఆదాయం పెరిగిందన్నారు. మద్యం వినియోగం తగ్గించడం వల్ల ప్రజల ఆరోగ్యానికి సైతం తాము మేలు చేశామన్నారు. తమ హయాంలో మద్యం అమ్మకాలు, వాటిపై వచ్చిన ఆదాయమే ఇందుకు నిదర్శనం అన్నారు. టీడీపీ హయాంలో ఓ మద్యం, బీరు కేసులపై వచ్చిన సగటు ఆదాయం రూ.2623 అని, కానీ వైసీపీ హయాంలో ఇది రూ.5649 అన్నారు. 40 వేల బెల్టు షాపులు మూసేసి, మద్యం షాపుల్ని తగ్గిస్తే లంచాలు ఇస్తారా అని జగన్ అడిగారు. తమ ప్రభుత్వ హయంలో లాభాపేక్ష లేకుండా ప్రభుత్వమే మద్యం అమ్మకాలు చేసిందన్నారు. కానీ చంద్రబాబు గతంలో ఎప్పుడూ మద్యం వ్యాపారం ప్రైవేటు మాఫియా చేతుల్లో పెట్టి నడిపించారన్నారు. షాపులకు ఎవరూ దరఖాస్తు చేయకుండా బెదిరించారన్నారు. ప్రైవేటు మద్యం షాపులతో చంద్రబాబు ఎంచుకున్న డిస్టిలరీలకు ఇండెంట్ ఇస్తే లంచాలు ఇస్తారా లేక ప్రతీ బాటిల్ పై క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మరీ డైనమిక్ ఆర్డర్ ఇస్తే లంచాలు ఇస్తారా అని జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో పారదర్శకత లేకపోవడం వల్ల ఆయన ఎవరికి మేలు చేయాలనుకుంటారో వారికే ఆర్డర్ ఇస్తారన్నారు. గతంలో చంద్రబాబు హయాంలో కేవలం 5 డిస్టలరీలకే 69 శాతం మద్యం ఆర్డర్లు వెళ్లాయన్నారు. ప్రస్తుతం ఉన్న 20 డిస్టిలరీల్లో 14 డిస్టిలరీలు చంద్రబాబు సీఎంగా ఉన్న వివిధ సమయాల్లో లైసెన్స్ ఇచ్చినవే అన్నారు. మిగిలిన ఆరు కూడా వైసీపీ కాదని, ఇతర ప్రభుత్వాలు ఇచ్చినవే అన్నారు. తాము ఒక్క డిస్టలరీకి కూడా లైసెన్స్ ఇవ్వలేదన్నారు. ఆ 20 డిస్టిలరీల్ని ఎంప్యానల్ చేసింది చంద్రబాబే అన్నారు. ఎవరి హయాంలో మద్యం అమ్మకాలు పెరిగాయి, తగ్గాయని, ఎవరు ఎవరికి లంచం ఇస్తారని జగన్ ప్రశ్నించారు. చివరకు చంద్రబాబు అండ్ కో 2022లో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో కేసు వేశారని, కొన్ని బ్రాండ్లను తొక్కిపెట్టానని ఆరోపణలు చేశారని, వీటిపై సుదీర్ఘ విచారణ జరిపిన కమిషన్.. 2002 నాటి కాంపిటీషన్ చట్టాన్ని ఎక్కడా ఉల్లంఘించలేదని తీర్పు ఇచ్చిందన్నారు. వైసీపీ ప్రభుత్వం మార్కెట్లోకి రాకుండా ఎవరినీ అడ్డుకోలేదని కమిషన్ స్పష్టం చేసిందన్నారు. వాస్తవాలు ఇలా ఉంటే తప్పు చేసిన చంద్రబాబు.. తమపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. రాజ్యసభ సభ్యుడిగా మూడున్నరేళ్ల పదవీకాలం వద్దనుకుని చంద్రబాబుకు మేలు చేసేందుకు పదవి వదులుకుతున్న వ్యక్తి విజయసాయిరెడ్డి అన్నారు. తన రాజీనామాతో చంద్రబాబు కూటమికి మేలు జరుగుతుందని తెలిసీ తన పదవిని అమ్ముకున్న వ్యక్తి అని జగన్ తెలిపారు. అలాంటి వ్యక్తి లిక్కర్ పై చేసే ఆరోపణలకు ఏం విలువ ఉంటుందని ప్రశ్నించారు. మరో నిందితుడిగా చెప్తున్నరాజ్ కెసిరెడ్డికీ బేవరేజెస్ కార్యకలాపాలకూ ఏం సంబంధం అని ప్రశ్నించారు. ఐటీ రంగంలో అనుభవం ఉన్న వ్యాపారవేత్త, సలహాదారుల్లో ఒకడైన రాజ్.. తమకు లొంగకపోవడం వల్ల నిందితుడిగా మార్చారన్నారు. లోక్ సభలో వైసీపీ ఫ్లోర్ లీడర్ అయిన మిథున్ రెడ్డికీ, ఐఏఎస్ ధనుంజయ్ రెడ్డికీ, ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డికీ, ఓ మల్టీ నేషనల్ కంపెనీ డైరెక్టర్ గా ఉన్న బాలాజీ గోవిందప్పకూ లిక్కర్ స్కాంకూ ఏం సంబంధం అని ప్రశ్నించారు. మిథున్ రెడ్డి ఎంపీ అని, ఆయనకూ మద్యం స్కాంతో సంబంధం ఏంటన్నారు. వీరంతా కలిసి లిక్కర్ స్కాంపై చర్చలు జరిపితే గూగుల్ టేకవుట్ లో దొరుకుతారు కదా అని జగన్ తెలిపారు. ఇలా సంబంధం లేని వాళ్లందరినీ మద్యం స్కాంలో ఇరికించి వారిని అప్రదిష్టపాలు చేస్తున్నారని జగన్ విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యలతో బిర్లా వంటి వారు ఇక్కడికి వచ్చేందుకు భయపడుతున్నారన్నారు. ధనుంజయ్ రెడ్డి ఓ మచ్చలేని అధికారి అని, ఆయన కుమారుడికి పెళ్లి సంబంధాలు చూస్తుంటే అరెస్టు చేసి జైల్లో పెట్టారన్నారు. కృష్ణమోహన్ రెడ్డి కూడా మచ్చలేని ఆధికారి అని, ఆయన కుమార్తెకు పెళ్లి చేసేందుకు సిద్దమవుతుంటే అరెస్టు చేశారన్నారు. పీఎస్సార్ ఆంజనేయులు వంటి డీజీ స్ధాయి అధికారిని జైల్లో పెట్టారని, చరిత్రలో ఎప్పుడూ జరగలేదన్నారు. గతంలో తనకు అనుకూలమైన ప్రైవేటు మద్యం దుకాణాలకు ప్రివిలేజ్ ఫీజు మినహాయిస్తూ స్వయంగా చంద్రబాబు నోట్ ఫైల్ పై సంతకం చేశారని, దీని వల్ల ఏడాదికి ప్రభుత్వ ఖజానాకు 1300 కోట్ల రూపాయల నష్టం జరుగుతూ వచ్చిందన్నారు. అప్పట్లో చంద్రబాబుపై నమోదైన ఈ కేసులో ఆయన బెయిల్ పై ఉన్నారన్నారు. అప్పట్లో తనపై వచ్చిన ఆరోపణల్ని బలహీనం చేసేందుకు అలాంటి ఆరోపణలతోనే ఇప్పుడు కేసులు నమోదు చేసి స్కాం అంటున్నారన్నారు. సుమో, కేరళ మాల్ట్, షాట్ విస్కీ, బెంగళూరు విస్కీ, ఓల్డ్ క్లబ్, గుడ్ ఫ్రెండ్స్ వంటి ఎప్పుడూ చూడని బ్రాండ్లు తెస్తున్నారని, ఏ శాస్త్రీయత ఆధారంగా వీటికి ఆర్డర్లు ఇస్తున్నారని ప్రశ్నించారు. ఇలాంటి ఊరూపేరు లేని బ్రాండ్లు ఎవరైనా అడుగుతారా అని ప్రశ్నించారు. చంద్రబాబు తాను వస్తే మద్యం ధరలు తగ్గిస్తానన్నారని, కానీ షాపులు తన ప్రైవేట్ మాఫియా చేతుల్లో పెట్టాక వారికిచ్చే కమిషన్ పెంచారన్నారు. ఇది స్కాం కాదా అని అడిగారు. అలాగే ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు అమ్ముతున్నారన్నారు. చరిత్రలో తొలిసారి 99కే లిక్కర్ ఇస్తానని చెప్పి మద్యం క్వాలిటీ తగ్గించేశారన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa