ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కనీస మర్యాద, కృతజ్ఞత లేదు: పవన్ కళ్యాణ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 24, 2025, 07:33 PM

టాలీవుడ్ లో గత కొన్ని రోజులుగా థియేటర్ల వివాదంపై చర్చలు జరుగుతున్న నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాలయం నుంచి ఓ సంచలన ప్రకటన వెలువడింది. రాష్ట్రంలో తెలుగు సినిమా రంగానికి పరిశ్రమ హోదా కల్పించి అభివృద్ధి చేయాలని, ఈ రంగంలో ఉన్నవారి గౌరవమర్యాదలకు భంగం వాటిల్లకుండా చూస్తుంటే.. తెలుగు సినీ రంగంలో ఉన్నవారికి ప్రభుత్వం పట్ల కనీస మర్యాద, కృతజ్ఞత కనిపించడం లేదని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడినట్లు ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఏపీలో ఎన్.డి.ఏ. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్నా తెలుగు సినిమా సంఘాల ప్రతినిధులు మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రిని కలిశారా? అని ఆ సందర్భంగా ప్రశ్నించారు.


''ఎన్.డి.ఏ. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని తెలుగు సినిమా సంఘాలు కనీసం ఒకసారి కూడా మర్యాదపూర్వకంగా కలవలేదు. కేవలం తమ చిత్రాల విడుదల సందర్భంలో ప్రభుత్వం ముందుకు రావడం మినహా, చిత్ర రంగం అభివృద్ధి కోసం సంఘటితంగా రాలేదు. అందరూ కలసి రావాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచించినా సానుకూలంగా స్పందించలేదు'' అని ప్రకటనలో పేర్కొన్నారు. గత ప్రభుత్వం సినిమా రంగంవారిని, అగ్ర నటులను ఎలా ఛీత్కరించిందో మరచిపోయినట్లున్నారని.. ఇకపై ప్రభుత్వంతో వ్యక్తిగత చర్చలు ఉండవని.. సినిమా సంఘాల ప్రతినిధులే రావాలని తెలిపారు. కూటమి ప్రభుత్వం వ్యక్తులను కాదు, సినిమా రంగం అభివృద్ధినే చూస్తుందన్నారు.


''తెలుగు సినిమా రంగంలోని అగ్ర నటులను, సాంకేతిక నిపుణులను గత ప్రభుత్వం ఏ విధంగా ఛీత్కరించుకొని ఇక్కట్ల పాలుజేసిందో తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి, నిర్మాతల మండలి, మూవీ ఆరిస్ట్స్ అసోసియేషన్ లాంటి సంఘాలు మరచిపోయినట్లున్నాయి. కోట్ల రూపాయల పెట్టుబడులతో రూపొందే చిత్రాలకు అన్ని విధాలా ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు, సృజనాత్మకత ముడిపడిన ఈ వ్యాపారంలో ఉన్నవారి గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకూడదని కూటమి పార్టీలు ఎన్నికలకు ముందు కూడా స్పష్టంగా చెప్పాయి.


గత ప్రభుత్వం వ్యక్తులను చూసి పనులు చేసేది.. కక్ష సాధింపులకు దిగేది. తమకు నచ్చనివారి సినిమాల విడుదల సమయంలో థియేటర్ల దగ్గర తహసీల్దార్లను నియమించి ఎన్ని ఇబ్బందులుపెట్టిందో నిర్మాతలు మరచిపోతే ఎలా?''


''ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ చెప్పిన విధంగానే కూటమి ప్రభుత్వం వ్యక్తులను చూడలేదు. అక్కినేని నాగార్జున కుటుంబానికి చెందినవారి చిత్రం విడుదలైనప్పుడు సైతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తగిన విధంగా ప్రోత్సహించింది. వ్యవస్థ బాగుండాలి, దానిపై ఆధారపడ్డవారు ఇబ్బందిపడకూడదు అనేదే కూటమి ప్రభుత్వ విధానం. తెలుగు సినిమా రంగంవారు తమ సినిమా విడుదల సమయంలో వ్యక్తిగతంగా వచ్చి అర్జీలు ఇచ్చి, టిక్కెట్ ధర పెంచమని కోరడం ఎందుకు? అందరూ కలసి వచ్చి ప్రభుత్వంతో స్పష్టంగా చర్చించమని పవన్ కల్యాణ్ సూచించారు''


''దిల్ రాజు, అల్లు అరవింద్, డి.సురేశ్ బాబు, వై.సుప్రియ, చినబాబు, సి.అశ్వనీదత్, నవీన్ ఎర్నేని వంటి నిర్మాతలు కలిసినప్పుడు అందరూ సంఘటితంగా ఉంటే పరిశ్రమగా అభివృద్ధి చేయవచ్చు అని కూడా పవన్ కల్యాణ్ తెలిపారు. అయినప్పటికీ ఎవరికి వారు వ్యక్తిగతంగా వచ్చి తమ సినిమా టికెట్ ధరలు పెంచమని సినిమాటోగ్రఫీ శాఖకి అర్జీలు ఇస్తూ వచ్చారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూనే ఉంది. సినిమా రంగానికి పరిశ్రమ హోదా ఇచ్చేందుకు ఆలోచనలు చేస్తున్న పవన్ కల్యాణ్ కి తెలుగు సినిమాకి చెందిన కొందరు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ను కూడా తగిన విధంగానే స్వీకరించాలని ఉప ముఖ్యమంత్రి నిర్ణయించుకున్నారు. ఈ రిటర్న్ గిఫ్ట్ కు కృతజ్ఞతలు తెలియచేశారు'' అని ప్రెస్ నోట్ లో పేర్కొన్నారు.


సినిమా రంగం అభివృద్ధి కోసం ప్రత్యేక పాలసీ తీసుకురావాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆలోచన చేశారని, ముఖ్యమంత్రితో చర్చించిన అనంతరం కాంప్రహెన్సివ్ ఫిల్మ్ డెవలప్మెంట్ పాలసీని ప్రకటిస్తారని తెలిపారు. ఇక నుంచి వ్యక్తిగత విజ్ఞాపనలు, చర్చలకు తావులేదని.. సంబంధిత విభాగం ప్రతినిధులతోనే చర్చిస్తారన్నారు. రాష్ట్రంలో సినిమా రూపకల్పన నుంచి వాణిజ్యం వరకూ 24 విభాగాల్లో నైపుణ్యాలు పెంపుదల... అధునాతన సాంకేతికత వినియోగంపై ప్రత్యేక దృష్టిపెట్టాలని పవన్ కల్యాణ్ యోచిస్తున్నారు. కాంప్రహెన్సివ్ ఫిల్మ్ డెవలప్మెంట్ పాలసీ ద్వారా ఆంధ్ర ప్రదేశ్ లో సినిమా రంగం అభివృద్ధికి బాటలు వేస్తున్నారని తెలియజేసారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa