ఈ ఏడాది దేశంలోకి నైరుతి రుతుపవనాలు ముందుగానే ప్రవేశించాయి. మే 24, శనివారం నాడు రుతుపవనాలు కేరళను తాకినట్టు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. సాధారణంగా జూన్ 1 నాటికి కేరళ తీరంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయి. కానీ, ఈసారి ఎనిమిది రోజుల ముందుగానే వచ్చాయి. 2009 తర్వాత భారత ప్రధాన భూభాగాన్ని రుతుపవనాలు ముందుగా తాకడం ఇదే మొదటిసారి. నైరుతిపై ఐఎండీ అంచనాలు నిజమయ్యాయి. మే 27కు నాలుగు రోజులు అటు ఇటుగా రుతుపవనాలను దేశంలోకి ప్రవేశిస్తాయని ఐఎండీ అంచనా వేసింది.
ముందస్తుకు కారణాలు
ఐఎండీ శాస్త్రవేత్త నీథా కె. గోపాల్ మాట్లాడుతూ.. రుతుపవనాల రాక తమ అంచనాలకు అనుగుణంగా జరిగిందని చెప్పారు. “మా అధికారిక అంచనా ప్రకారం మే 27కి నాలుగు రోజులు అటు ఇటుగా రుతుపవనాలు వస్తాయని ముందే చెప్పాం... మేము అంచనా వేసినట్టే మే 24న నైరుతి తాకింది’ అని ఆమె తెలిపారు. రుతుపవనాలు కేరళతో పాటు లక్షద్వీప్, దక్షిణ, మధ్య, తూర్పు మధ్య అరేబియా సముద్రం, కర్ణాటక, మహారాష్ట్ర, మాల్దీవులు, కోమరిన్ ప్రాంతం, తమిళనాడు, తూర్పు మధ్య బంగాళాఖాతం, మిజోరాం, ఉత్తర బంగాళాఖాతం వరకు విస్తరించాయి.
రాబోయే రెండు మూడు రోజుల్లో మహారాష్ట్ర, గోవా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఈశాన్య రాష్ట్రాలు, సబ్‌హిమాలయన్ పశ్చిమ బెంగాల్, సిక్కిం వరకు రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉంది. ఈ ఏడాది మే 13న అండమాన్ నికోబార్ సముద్ర ప్రాంతాన్ని రుతుపవనాలు తాకినప్పటి నుంచే అవి వేగంగా ముందుకు సాగుతున్నాయి. ఈ కదలిక మే 24న కేరళను తాకే దాకా కొనసాగింది. సాధారణ తేదీ అయిన జూన్ 1 కంటే ఎనిమిది రోజుల ముందే ఈసారి ప్రవేవించాయి.
ఎందుకు ముందుగానే వచ్చాయి?
అరేబియా సముద్రంపై అల్పపీడన వ్యవస్థ, విదర్భ వరకు విస్తరించిన ఉపరితల ఆవర్తన, వాతావరణంలో తేమ ప్రవాహం పెరగడం,సరైన వాయు చలనం, ఎల్ నినో లాంటి ప్రభావాలు లేకపోవడంతో పాటు హిమాలయాల్లో మంచు పొరలు తక్కువగా ఉండటం మొదలైన అంశాలు దీనికి కారణాలని ఐఎండీ పేర్కొంది.
ప్రయోజనాలు:
వ్యవసాయం, మత్స్య సంపద, పశుసంవర్ధన రంగాలకు ఇది ఉపయుక్తంగా ఉంటుంది. వాతావరణ అంచనాలపై ప్రభుత్వ పెట్టుబడుల ప్రయోజనం కూడా స్పష్టమవుతోంది. ‘మాన్సూన్ మిషన్’, హైపర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ ద్వారా రూపొందించిన అంచనాల వల్ల పంట దిగుబడులు మెరుగుపడి వాతావరణ సంబంధిత నష్టాలు తగ్గుతాయి.
ఇతర ముఖ్యాంశాలు:
చివరిసారిగా 15 ఏళ్ల కిందట రుతుపవనాలు ఈ విధంగానే దేశంలోకి ప్రవేశించాయి. మే 23, 2009లో కేరళ తీరాన్ని తాకాయి. ఆ తర్వాత ముందుగా రావడం ఇదే. ఇప్పటికి నైరుతి రుతుపవనాల ప్రదర్శన బట్టి ఈశాన్య రుతుపవనాల (నార్త్ ఈస్ట్ మాన్సూన్) ప్రగతిపై ఊహించలేమని చెన్నై ప్రాంతీయ వాతావరణ కేంద్ర అధిపతి బి. అముదా అన్నారు. కోంకణ్ తీరంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడి తూర్పు దిశగా కదిలి త్వరలో బలహీనపడే అవకాశం ఉందని తెలిపారు.
శనివారం కేరళలోని కాసరగోడ్, కన్నూరు జిల్లాలకు రెడ్ అలర్ట్, ఇతర 11 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. తమిళనాడులోని నీలగిరి జిల్లాలో వచ్చే రెండు రోజులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఊటీ, కుందా తదితర తాలూకాలలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
పశ్చిమ మహారాష్ట్ర, దక్షిణ అంతర్గత కర్ణాటక, ఒడిశా, బిహార్, ఉత్తరాఖండ్, విదర్భ, కచ్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ తదితర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదు అయ్యాయి. దేశవ్యాప్తంగా రుతుపవనాల కదలికను అధికారులు నిశితంగా గమనిస్తున్నారు. ఏ ప్రాంతంలోనైనా వర్షాలు ముప్పుగా మారే అవకాశాన్ని పరిగణలోకి తీసుకుని అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa