ఏప్రిల్ 22వ తేదీన జమ్ము కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి గురించి అందరికీ తెలిసిందే. సైనిక దుస్తుల్లో వచ్చిన ముష్కరులు 26 మంది అమాయక పర్యటకుల ప్రాణాలు తీయగా.. దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆపై ఆపరేషన్ సిందూర్ చేపట్టి పగ తీర్చుకుంది. అనేక మంది ఉగ్రవాదులను హతమార్చింది. దీంతో పాక్ కాళ్లబేరానికి రాగా.. కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించింది. అయితే తాజాగా పహల్గాం ఉగ్రదాడి జరిగిన చోటే జమ్ము కశ్మీర్ సర్కారు క్యాబినెట్ మీటింగ్ నిర్వహించింది. ఎప్పుడూ లేనిది తొలిసారి శ్రీనగర్, కశ్మీర్ కాకుండా వెలుపల నిర్వహించగా.. అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఎందుకు చేశారో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
కశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడి, దాని తర్వాత ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్థాన్‌కు భారత్ బుద్ధి చెప్పి కాళ్లబేరానికి వచ్చేలా చేయడం తెలిసిందే. ఉగ్రదాడి జరిగిన ఆ ఘటనా స్థలంలోనే తాజాగా ప్రత్యేక కేబినెట్ సమావేశం జరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఉగ్రవాదులు, ఉగ్రవాదులకు ఊతమిచ్చే దేశాలు చేసే పిరికిపంద చర్యలకు తాము ఏమాత్రం భయపడేది లేదనే సందేశాన్ని పంపుతూ జమ్మూకశ్మీర్ ప్రభుత్వం ఈ ప్రత్యేక కేబినెట్ సమావేశాన్ని నిర్వహించింది. ఈమధ్యే ఏర్పడ్డ నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వ హయాంలో వేసవి రాజధాని శ్రీనగర్, శీతాకాల రాజధాని జమ్ము వెలుపల ఇలా మంత్రులు భేటీ కావడం ఇదే తొలిసారి. ఈ విషయాన్ని జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా వెల్లడించారు.
పహల్గాంలోని బైసరన్ లోయ ప్రాంతం ప్రకృతి అందాలకు నెలవు. మినీ స్విట్జర్లాండ్‌గా పిలుచుకునే ఈ ప్రాంతానికి పర్యాటకమే ప్రధాన ఆదాయ వనరు. అలాంటి ప్రాంతంలో ఏప్రిల్ 2న జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. దాంతో అప్పటి నుంచి పర్యాటకుల రాక భారీగా తగ్గిపోయింది. దీంతో అక్కడి ప్రజలకు ఉపాధి లేకుండా పోయింది. అలాగే ఉగ్రదాడి స్థానిక ప్రజలను భయాందోళనకు గురి చేసింది. స్థానిక ప్రజలకు సంఘీభావంగా, స్థానికుల్లో ధైర్యం కల్పించే ఉద్దేశంతో ఈ కేబినెట్ సమావేశాన్ని నిర్వహించినట్లు ఒమర్ అబ్దుల్లా మీడియాకు వెల్లడించారు.
"మేం ప్రజల ధైర్యానికి సెల్యూట్ చేస్తున్నాం. పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు పహల్గాంకు వచ్చాం. ఆ దిశగా చర్యలు కొనసాగుతాయి." అని ఒమర్ అబ్దుల్లా అన్నారు. పహల్గాం క్లబ్‌లో జరిగిన మీటింగ్ దృశ్యాలను ఆయన తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. "ఉగ్రవాదుల పిరికిపంద చర్యలకు ఏ మాత్రం భయపడేదిలేదు అనే సందేశాన్ని ఇచ్చేందుకే ఇక్కడు వచ్చాం. జమ్మూకశ్మీర్ దృఢంగా నిలుస్తుంది." అని ఆ పోస్టులో ఆయన రాసుకొచ్చారు.
అయితే 2009 నుంచి 2014 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా ఒమర్ అబ్దుల్లా ఉత్తర కశ్మీర్‌లోని గురెజ్, మచిల్, తాంగ్‌ధర్, జమ్మూ ప్రాంతంలోని రాజౌరీ, పూంఛ్‌లోనూ ఇలా కేబినెట్ సమావేశాలు నిర్వహించారు. ప్రధాని మోదీ అధ్యక్షత వహించే నీతి ఆయోగ్ సమావేశాన్ని ఇక్కడ నిర్వహించాలని అభ్యర్థించారు. ఈ తరహా చర్యలు స్థానిక ప్రజల్లో భయాలను తొలగిస్తాయని ఒమర్ అబ్దుల్లా విశ్వసిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa