ఫైటర్‌జెట్లు తయారు చేసేందుకు గతంలో వాటి ఇంజిన్లను విదేశాల నుంచి దిగుమతి చేసుకునేవాళ్లం. అయితే ఆ ఇంజిన్లను మన దేశంలోనే తయారు చేసి స్వదేశీ టెక్నాలజీని మరింత విస్తరింపజేయాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. స్వదేశీ సైనిక విమానయాన టెక్నాలజీలో భారత్ ఆత్మనిర్భరత సాధించాలనే లక్ష్యానికి ప్రతీకగా కావేరి ఇంజిన్‌ను తయారు చేసేందుకు 1980ల్లోనే ఒక ప్రాజెక్టును చేపట్టారు. అయితే పలు కారణాలతో ఇప్పటికీ ఆ కావేరీ ఇంజిన్ తయారీ పూర్తి కావడం లేదు. ఇటీవలి కాలంలో మన పక్కన ఉన్న దేశాలతో భారత్‌కు తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా పాకిస్తాన్‌తో ప్రస్తుతం నెలకొన్న ఘర్షణల నేపథ్యంలో కావేరీ ఇంజిన్ ఇప్పుడు తెరపైకి వచ్చింది. కావేరీ ఇంజిన్ అభివృద్ధిని వేగవంతం చేయాలని నెటిజన్లు, రక్షణ నిపుణులు, సోషల్ మీడియాలో 'ఫండ్ కావేరి ఇంజిన్' (#FundKaveriEngine) అనే హ్యాష్‌ట్యాగ్ టాప్ ట్రెండ్‌గా మారింది.
యుద్ధ విమానాల నిర్మాణానికి విదేశీ ఇంజిన్‌లపై భారత్ ఇతర దేశాలపై ఆధారపడకుండా ఉండాలనే లక్ష్యంతో.. కావేరి ఇంజిన్ నిర్మాణం కోసం మరిన్ని నిధులు, వనరులను కేటాయించాలని ఈ సందర్భంగా నెటిజన్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. దేశ ప్రయోజనాలకు కావేరి ఇంజిన్ ప్రాముఖ్యతను గుర్తు చేశారు. డిఫెన్స్ టెక్నాలజీలో ఆత్మనిర్భరతకు ఉన్న వ్యూహాత్మక ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.
అసలేంటీ కావేరి ఇంజిన్?
కావేరి ఇంజిన్ అనేది డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఓ) ఆధ్వర్యంలోని గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్‌మెంట్ (జీటీఆర్ఈ) ద్వారా అభివృద్ధి చేయబడిన ఒక స్వదేశీ జెట్ ఇంజిన్. ఇది తేలికపాటి యుద్ధ విమానం తేజస్‌కు శక్తిని అందించే ఉద్దేశ్యంతో.. దాదాపు 80 kN థ్రస్ట్‌ను ఉత్పత్తి చేయడానికి రూపొందించబడిన తక్కువ బైపాస్, ట్విన్ స్పూల్ టర్బోఫాన్ ఇంజిన్. అధిక ఉష్ణోగ్రతలు, అధిక-వేగం వంటి పరిస్థితుల్లో థ్రస్ట్ నష్టాన్ని తగ్గించడానికి దీనికి ఫ్లాట్ రేటెడ్ డిజైన్ ఉపయోగపడుతుంది.
కావేరి ఇంజిన్ తయారీ ఆలస్యానికి కారణాలు
1980వ దశకంలో ఈ కావేరి ఇంజిన్ ప్రాజెక్ట్ ప్రారంభమైంది. భారత యుద్ధ విమానాలకు విదేశీ ఇంజిన్‌లపై ఆధారపడటాన్ని తగ్గించడమే ప్రధాన లక్ష్యంగా ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. అయితే థ్రస్ట్ లోపాలు, బరువు సమస్యలు, 1998లో భారతదేశ అణు పరీక్షల తర్వాత ఆంక్షల కారణంగా ఈ కావేరి ఇంజిన్ తయారీలో జాప్యం ఏర్పడింది. ఏరోథర్మల్ డైనమిక్స్, మెటలర్జీ, కంట్రోల్ సిస్టమ్స్ వంటి అడ్వాన్స్‌డ్ టెక్నాలజీలను మొదటి నుంచి అభివృద్ధి చేయడంలో ఏర్పడిన సంక్లిష్టత కూడా వీటి తయారు చేయడంలో ఆలస్యానికి కారణమైంది.
ఇక పశ్చిమ దేశాల ఆంక్షలు సింగిల్ క్రిస్టల్ బ్లేడ్‌ల వంటి కీలక పదార్థాలను నిరాకరించగా.. భారత్‌లో నైపుణ్యం కలిగిన మానవశక్తి, అధిక ఎత్తు పరీక్షా సౌకర్యాలు లేవు. దీంతో రష్యాలోని సీఐఏఎం వంటి విదేశీ సంస్థలపై ఆధారపడాల్సి వచ్చింది. వాలిడేషన్ లేకుండా తేజస్ ఫైటర్‌కు శక్తినిచ్చే వంటి అవాస్తవ అంచనాలు, స్నేక్మాతో అంతర్జాతీయ సహకారం కుప్పకూలడం కూడా కావేరి ఇంజిన్ ప్రాజెక్ట్ ముందుకు సాగడానికి ఇంకొన్ని అడ్డంకులుగా మారాయి. అయినప్పటికీ.. 2008లో తేజస్ కార్యక్రమం నుంచి వేరు చేయబడినప్పటికీ.. ఘటక్ స్టీల్త్ యూసీఏవీ వంటి మానవరహిత వైమానిక వాహనాల కోసం ఒక డెరివేటివ్ వెర్షన్‌ను ప్రస్తుతం అభివృద్ధి చేస్తున్నారు. ఇన్ ఫ్లైట్ టెస్టింగ్, గోద్రెజ్ ఏరోస్పేస్ వంటి ప్రైవేట్ రంగ సంస్థల భాగస్వామ్యంతో ఇటీవలి కాలంలో కావేరి ఇంజిన్ తయారీలో కాస్త కదలిక కనిపిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa