ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెద్దనాన్న చంద్రబాబు నుంచి ఓ ముఖ్యమైన విషయం నేర్చుకున్నానన్న నారా రోహిత్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 28, 2025, 06:47 AM

నారా రోహిత్ తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితమైన పేరు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చి, నటనపై ఆసక్తితో చిత్రసీమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. చాలా కాలం తర్వాత 'భైరవం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న రోహిత్, ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కుటుంబ సభ్యులు, ముఖ్యంగా తన పెద్దనాన్న, ముఖ్యమంత్రి చంద్రబాబు, తన అన్నయ్య నారా లోకేశ్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. వ్యక్తిగత జీవితం, కెరీర్‌లో ఎదురైన ఒడిదొడుకులు, కుటుంబ సభ్యుల మద్దతు వంటి అంశాలపై నారా రోహిత్ మనసు విప్పారు.తన జీవితంలో పెద్దనాన్న చంద్రబాబు, పెద్దమ్మ భువనేశ్వరిల పాత్ర చాలా కీలకమని నారా రోహిత్ తెలిపారు. "నా జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తులు పెద్దనాన్న, పెద్దమ్మ. వారి ప్రోత్సాహం, మద్దతు లేకపోతే మేమీ స్థాయిలో ఉండేవాళ్లం కాదు" అని ఆయన అన్నారు. చంద్రబాబు నుంచి తాను నేర్చుకున్న అతి ముఖ్యమైన విషయం, ఎదుటివారు చెప్పేది ఓపిగ్గా వినడమని రోహిత్ పేర్కొన్నారు. "ఎవరైనా సరే, వారి సమస్య లేదా అభిప్రాయం చెప్పడానికి వచ్చినప్పుడు, పెద్దనాన్న దాన్ని పూర్తిగా వింటారు. అది చాలా గొప్ప లక్షణం. ఆ లక్షణాన్ని నేను కూడా అలవర్చుకోవడానికి ప్రయత్నిస్తాను" అని వివరించారు.తన తండ్రి నారా రామ్మూర్తి నాయుడు మరణించినప్పుడు చంద్రబాబు మానసికంగా చాలా కుంగిపోయారని రోహిత్ గుర్తుచేసుకున్నారు. "చెప్పాలంటే, నాన్నగారు పోయినప్పుడు ఒకటి రెండు రోజులు పెద్దనాన్న మనిషి కాలేదు. అంతలా డిప్రెస్ అయిపోయారు. సోదరుడంటే ఆయనకు అంత ఇష్టం" అని రోహిత్ భావోద్వేగంతో చెప్పారు. ఆ సమయంలో పెద్దనాన్న, లోకేశ్ అన్నయ్య తమ కుటుంబానికి అండగా నిలిచారని, తన కెరీర్ ఆరంభం నుంచి కూడా పెద్దనాన్న మార్గదర్శకత్వం చేస్తూనే ఉన్నారని తెలిపారు. తన తండ్రి అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు ప్రతీవారం డాక్టర్లతో వ్యక్తిగతంగా మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేవారని రోహిత్ వెల్లడించారు. చంద్రబాబు జైలులో ఉన్న సమయం తనను తీవ్రంగా కలచివేసిందని, ఆయనను దగ్గర నుంచి చూసిన ఎవరికైనా అది జీర్ణించుకోవడం కష్టమని అన్నారు.తన అన్నయ్య నారా లోకేశ్ గురించి మాట్లాడుతూ, ఆయన కమ్‌బ్యాక్ ఎంతో స్ఫూర్తిదాయకమని రోహిత్ ప్రశంసించారు. "2019 నుంచి 2024 మధ్య లోకేశ్ అన్నయ్యలో వచ్చిన మార్పు, ఆయన పడిన కష్టం చూస్తే ఎవరైనా స్ఫూర్తి పొందుతారు. ఒక వ్యక్తిని తక్కువ అంచనా వేసినప్పుడు, తిరిగి అంతే బలంగా నిలబడి 'నేను ఇక్కడే ఉంటాను, సాధించి చూపిస్తాను' అని నిరూపించడం గొప్ప విషయం. కమ్‌బ్యాక్ అంటే అలా ఉండాలి" అని రోహిత్ అభిప్రాయపడ్డారు. చిన్నప్పటి నుంచి లోకేశ్ తో తనకు మంచి అనుబంధం ఉందని, తిరుపతిలో కలిసి తిరిగిన రోజులను గుర్తుచేసుకున్నారు. "2014 వరకు కూడా ప్రతీవారం మేమంతా లంచ్‌కు కలిసేవాళ్లం, సినిమాలు చూసేవాళ్లం" అని తెలిపారు.టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే తాను ఎక్కువ సినిమాలు చేశానన్న ప్రచారంపై నారా రోహిత్ స్పందించారు. "నేను నా కెరీర్ ప్రారంభించినప్పుడు 2009లో టీడీపీ అధికారంలో లేదు. అప్పుడు కూడా సినిమాలు చేశాను. 2014-19 మధ్య నేను షూట్ చేసిన చాలా సినిమాలు, 2014 ఎన్నికల కంటే ముందే సంతకం చేసి, నిర్మాణ దశలో ఉన్నవే. దాదాపు నాలుగైదు సినిమాలు అలా ఉన్నాయి" అని స్పష్టం చేశారు. కొంతకాలం సినిమాలకు విరామం తీసుకోవడానికి కారణం, చేస్తున్న పనిలో సంతృప్తి లేకపోవడమేనని అన్నారు. "ఒక దశలో సక్సెస్ కోసం, నంబర్ల కోసం పరుగులు తీశాను. నాకు నచ్చిన కథలు చేసినప్పుడు సంతోషంగా ఉండేవాడిని. కానీ కొన్ని సినిమాలు ఆశించిన ఫలితాలనివ్వకపోవడంతో, కమర్షియల్ సినిమాల వైపు వెళ్లాను. అది నాకు నచ్చలేదు. అందుకే ఒక ఏడాది విరామం తీసుకుని, నాకు నచ్చిన కథలతో ముందుకు వెళ్లాలనుకున్నాను. అయితే, కోవిడ్, నాన్నగారి అనారోగ్యం వంటి కారణాలతో మరింత ఆలస్యమైంది" అని రోహిత్ వివరించారు.తన ప్రేమ, పెళ్లి గురించి కూడా రోహిత్ మాట్లాడారు. సిరి అనే అమ్మాయితో తన వివాహం నిశ్చయమైందని, ఇరు కుటుంబాల అంగీకారంతోనే ఇది జరిగిందని తెలిపారు. "నేను పెద్దనాన్నగారికి ఈ విషయం చెప్పగానే, వారు అంగీకరించారు. మా సంతోషమే వారికి ముఖ్యం. నా ఎంగేజ్‌మెంట్ కూడా మా పెద్దమ్మగారే దగ్గరుండి చేశారు. వారు నాకు తల్లిదండ్రులతో సమానం" అని రోహిత్ పేర్కొన్నారు.సినిమా రంగంలో శ్రీ విష్ణు, నాగశౌర్య, మనోజ్ మంచు తనకు మంచి స్నేహితులని రోహిత్ తెలిపారు. 'భైరవం' సినిమా తనతో పాటు మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్, దర్శకుడు విజయ్‌లకు మంచి విజయాన్ని అందించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa