ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 28, 2025, 08:34 PM

తెలుగుదేశం పార్టీ  జాతీయ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత 30 ఏళ్లుగా పార్టీ అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయన, కడపలో జరుగుతున్న టీడీపీ మహానాడు రెండవ రోజున మరోసారి ఈ పదవికి ఎంపికయ్యారు. పార్టీ ఎన్నికల కమిటీ ఛైర్మన్ వర్ల రామయ్య, చంద్రబాబుతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ముఖ్యమంత్రి పార్టీ శ్రేణులను ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు, రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రగతికి సంబంధించిన పలు అంశాలపై స్పష్టతనిచ్చారు.ముందుగా, తనను ఏకగ్రీవంగా ఎన్నుకుని గురుతర బాధ్యతను అప్పగించిన పార్టీ నేతలు, కార్యకర్తలందరికీ చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. "తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే అసలైన బలం, బలగం" అని ఆయన ఉద్ఘాటించారు. కడప మహానాడు విజయవంతం కావడం పట్ల, ఉత్సాహంగా పాల్గొన్న ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలియజేశారు. ఈ మహానాడులో ఆరు తీర్మానాలు, అర్థవంతమైన చర్చల ద్వారా రాబోయే 40 ఏళ్లకు ప్రణాళికలు రచించుకున్నామని, ప్రపంచపటంలో తెలుగుజాతిని అగ్రస్థానంలో నిలబెట్టే సత్తా ఒక్క తెలుగుదేశం పార్టీకే ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మహానాడుకు ప్రకృతి కూడా సహకరించిందని పేర్కొన్నారు.హైదరాబాద్‌ను అభివృద్ధి చేసి, సైబరాబాద్‌ను సృష్టించింది టీడీపీయేనని, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు రెండూ తనకు సమానమేనని చంద్రబాబు అన్నారు. 47 ఏళ్లుగా ఆదరించిన ఆంధ్రప్రదేశ్ రుణం తీర్చుకోవాలనే రాత్రింబవళ్లు శ్రమిస్తున్నానని, రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీరందించి రైతుల రుణం తీర్చుకోవడమే తన లక్ష్యమని పునరుద్ఘాటించారు. అమరావతిని ప్రజారాజధానిగా నిర్మించేందుకు ప్రాజెక్టులను పట్టాలెక్కించామని, తన హైకమాండ్ అయిన కార్యకర్తలు, ప్రజల ఆశీస్సులతో ఒక్కొక్కటిగా అన్నీ సాధిస్తామని చెబుతూ చంద్రబాబు తన ప్రసంగాన్ని ముగించారు.రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్లపాటు ప్రజల ఆస్తులకు రక్షణ కరువైందని, గంజాయి, డ్రగ్స్ వంటివి విచ్చలవిడిగా రాజ్యమేలాయని ఆరోపించారు. "వైసీపీ హయాంలో ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయి సాగు ఒక కుటీర పరిశ్రమగా మారింది. గత ప్రభుత్వ అధినేతే తన బాబాయ్‌ను హత్య చేయించి, ఆ నిందను నాపై మోపే ప్రయత్నం చేశారు," అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నక్సలిజం, ఫ్యాక్షనిజం, రౌడీయిజాన్ని రూపుమాపిన ఘనత టీడీపీదేనని గుర్తుచేశారు."శాంతిభద్రతల విషయంలో ఎవరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దు. తప్పు చేసిన వారు ఎంతటివారైనా సరే, కఠినంగా శిక్షిస్తాం, చండశాసనుడిలా వ్యవహరిస్తా" అని హెచ్చరించారు. రాయలసీమను కరవు సీమగా, ఎడారి సీమగా మారనీయబోమని చంద్రబాబు హామీ ఇచ్చారు. తెలుగుగంగ, హంద్రీనీవా, గాలేరు నగరి వంటి ప్రాజెక్టులకు ఎన్టీఆర్ శ్రీకారం చుట్టారని, తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వాటిని మరింత ముందుకు తీసుకెళ్లానని తెలిపారు. ఉద్యాన పంటలతో అనంతపురం జిల్లా నేడు ఆర్థికంగా ముందంజలో ఉండటానికి టీడీపీ ప్రభుత్వ కృషే కారణమన్నారు. ఈ ఏడాది రాయలసీమ నీటి ప్రాజెక్టుల అభివృద్ధికి రూ.3,800 కోట్లు కేటాయించామని, పోలవరం తర్వాత అత్యధిక నిధులు ఖర్చు చేస్తున్న ప్రాజెక్టు హంద్రీనీవానే అని వివరించారు. వెలిగొండ ప్రాజెక్టును కూడా ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa