ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగన్ రెడ్డి, అవినాష్ రెడ్డి త్వరలో జైలుకు వెళ్లడం ఖాయమన్న జోస్యం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, May 29, 2025, 08:31 PM

కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటివరకు మహానాడు నిర్వహించలేదని, చరిత్రలో తొలిసారిగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు పార్టీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని పులివెందుల టీడీపీ ఇన్‌ఛార్జ్ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి  అన్నారు. కడపలో మహానాడు చివరి రోజున జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ, వైసీపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు."ఇది జగన్ ఇలాకాలో మహానాడు జరుగుతోందని కొందరు మీడియా మిత్రులు రాస్తున్నారు. 2024 ఎన్నికలకు ముందు వరకు కడప జగన్ అడ్డా కావొచ్చు. కానీ, 2024 ఎన్నికల్లో జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాలకు గాను ఏడు స్థానాల్లో టీడీపీ జయకేతనం ఎగురవేసిన తర్వాత కూడా ఇది ఎలా జగన్ ఇలాకా అవుతుంది? ఇది చంద్రబాబు గారి అడ్డా బిడ్డా" అని బీటెక్ రవి ఉద్ఘాటించారు. వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చినందుకు ఆయన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు."దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు తమిళనాడు ప్రభుత్వంతో చర్చించి, వారి నిధులతో తెలుగుగంగ ప్రాజెక్టును పూర్తి చేశారు. అలాగే, రాయలసీమ ప్రజల దాహార్తిని తీర్చేందుకు గాలేరు-నగరి, హంద్రీ-నీవా సుజల స్రవంతి పథకాలకు ఆయనే శ్రీకారం చుట్టారు," అని గుర్తుచేశారు. 2014 నుంచి 2019 మధ్య కాలంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గాలేరు-నగరి టన్నెల్ పనులతో పాటు ఇతర పెండింగ్ పనులను పూర్తిచేసి, కుప్పం కంటే ముందే పులివెందులకు నీరు అందించారని కొనియాడారు."చంద్రబాబు గారి కృషితోనే నేడు పులివెందుల హార్టికల్చర్ హబ్‌గా మారింది. ఇక్కడ పండిస్తున్న అరటి, బత్తాయి పంటలు ఢిల్లీ, ముంబై వంటి నగరాలకే కాకుండా విదేశాలకు కూడా ఎగుమతి అవుతున్నాయి" అని ఆయన తెలిపారు. పులివెందులకు చెందిన ఇద్దరు ముఖ్యమంత్రులు కనీసం తాగునీరు కూడా ఇవ్వలేకపోయారని, గత ఏడాది కూడా పులివెందుల ప్రజలు నీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు జల్ జీవన్, అమృత్ పథకాల ద్వారా పులివెందుల మున్సిపాలిటీకి తాగునీరు అందించారని ప్రశంసించారు. అయితే, జగన్ రెడ్డి మాత్రం నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణాలను అడ్డుకున్నారని ఆరోపించారు.కడప జిల్లాలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉన్నప్పటికీ, గత ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తన చుట్టూ ఉన్న కేసుల కోసం ఢిల్లీ చుట్టూ తిరగడానికే ప్రాధాన్యత ఇచ్చారని, జిల్లాకు ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేకపోయారని బీటెక్ రవి విమర్శించారు. "జూన్ 10న కడప స్టీల్ ప్లాంట్ పనులను చంద్రబాబు గారు ప్రారంభిస్తారని చెప్పడం సంతోషకరం. గత పాలకుడు కేసుల నుంచి బయటపడటం కోసమే సమయం కేటాయించారు తప్ప, ప్రజల కోసం ఏమీ చేయలేదు" అని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వంలో కొప్పర్తిలో రూ.3,200 కోట్లతో పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేస్తున్నామని, నారా లోకేశ్ నిరుద్యోగ సమస్య నిర్మూలనకు కృషి చేస్తున్నారని తెలిపారు.ప్రతిపక్ష నాయకులు ఎప్పుడు బయట ఉంటారో, ఎప్పుడు జైలుకు వెళ్తారో తెలియని పరిస్థితి నెలకొందని బీటెక్ రవి ఎద్దేవా చేశారు. "గతంలో వైఎస్ఆర్ హయాంలో అనేక మంది ఐపీఎస్ అధికారులు జైలుకు వెళ్లారు. ఇప్పుడు జగన్ రెడ్డి వల్ల ధనుంజయ రెడ్డి, పీఎస్ఆర్ ఆంజనేయులు వంటి అధికారులు కూడా జైలుకు వెళతారు" అని జోస్యం చెప్పారు. పరిటాల రవి హత్య కేసు, మద్దెలచెరువు సూరి హత్య కేసు, గాలి జనార్దన్ రెడ్డి కేసుల్లో నిందితులంతా జైలుకు వెళ్లారని గుర్తుచేస్తూ, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి, లిక్కర్ కేసులో జగన్ రెడ్డి కూడా వచ్చే మహానాడు నాటికి జైలుకు వెళ్లడం ఖాయమని ఆయన వ్యాఖ్యానించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa