తెలుగుదేశం పార్టీ జెండా పీకేస్తామని, పార్టీని లేకుండా చేస్తామని అన్నవారు ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రస్థాయిలో విమర్శించారు. కడపలో జరిగిన మహానాడు వేదికగా ఆయన మాట్లాడుతూ, వై నాట్ 175 అన్నవారికి ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఎదుర్కొన్న సవాళ్లను, కార్యకర్తల త్యాగాలను స్మరించుకుంటూ, రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రగతికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.తిరుమల తొలిగడప దేవుని కడప ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయం, అమీన్ పీర్ దర్గా, మరియాపురం చర్చి నెలకొన్న పుణ్యభూమి కడప. పౌరుషం, ఆత్మీయతలను కలగలిపి మహిళలను గౌరవించి గొప్పనేల కడప. కడప మాస్ జాతర మహానాడు అదిరిపోయింది. పౌరుషాల గడ్డపై పసుపు సైన్యం గర్జించింది, దేవుని గడప కడపలో పసుపు పండగ జరుపుకోవడం మన అదృష్టం. 2024లో మాస్ విక్టరీ సాధించాం, రికార్డులు బద్దలు కొట్టాం చరిత్రను తిరగరాసాం. 94 పర్సెంట్ స్ట్రైక్ రేట్ 164 అవుటాఫ్ 175. ఇది కేవలం రికార్డ్ కాదు ఆల్ టైం రికార్డ్. ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాటుదెబ్బ. జెండా పీకేస్తాం అన్నారు పార్టీ కార్యాలయానికి టు లెట్ బోర్డు పెట్టుకున్నారు. పార్టీ లేకుండా చేస్తామన్నోళ్లు అడ్రెస్స్ లేకుండా పోయారు. వై నాట్ 175 అన్నారు ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. మన బొమ్మలు పెట్టి బాక్సింగ్ చేసారు ఎన్నికల్లో ప్రజలు ఫుట్ బాల్ ఆడుకున్నారు. ఏ తప్పు చేయని మన అధినేతను అరెస్ట్ చేసారు.ప్రజలు వాళ్ళ నాయకుడిని ప్యాలస్ లో పెట్టి తాళం వేసారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి, గౌరవ మంత్రులు, గౌరవ ఎమ్మెల్యేలు, 82 బ్యాచ్ సీనియర్ నాయకుల దగ్గర నుండి 2025 బ్యాచ్ జూనియర్లకు, ప్రజలకు, అందరి కంటే ముఖ్యం, ఎత్తిన జెండా దించకుండా, మడమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కాపలా కాస్తున్నప్రాణసమానమైన కార్యకర్తలకు నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.తెలుగు వారిని ప్రపంచ పటంలో పెట్టింది మన బ్రాండ్ సీబీఎన్. అప్పుడు ఐటీ ఇప్పుడు ఏఐ. అప్పుడు హైటెక్ సిటీ ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ. అప్పుడు సైబరాబాద్ ఇప్పుడు అమరావతి. అప్పుడు రూ.200 పెన్షన్ ను రూ. రెండు వేలు చేసింది మన సీబీఎన్.ఇప్పుడు పెన్షన్ ను రూ.నాలుగు వేలు చేసింది కూడా మన సీబీఎన్. అన్న క్యాంటిన్లు, డ్వాక్రా, దీపం, పేదల చిరునవ్వు మన సీబీఎన్. సీబీఎన్ అంటే డెవెలప్మెంట్, సీబీఎన్ అంటే సంక్షేమం, సీబీఎన్ అంటే మానవత్వం. మన నాయకులు ట్రెండ్ ఫాలో అవ్వరు ట్రెండ్ సెట్ చేస్తారు. సినిమా స్క్రీన్ అయినా పొలిటికల్ స్క్రీన్ అయినా ఆయనే లెజెండ్. ఎన్టీఆర్ అంటే మూడు అక్షరాలు కాదు ఒక ప్రభంజనం. ఆయనే రాముడు, ఆయనే కృష్ణుడు, ఆయనే భీముడు, ఆయనే అర్జునుడు, ఆయనే కర్ణుడు, ఆయనే ప్రజల గుండెల్లో దేవుడు.ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలిసి రాష్ట్రాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేస్తున్నారు. ప్రధాని మోదీ మన రాష్ట్రానికి పూర్తి సహకారం అందిస్తున్నారు. మనం అడిగిన ప్రతి కోరిక తీరుస్తున్నారు. మనకు అహంకారం ఉండకూడదు, అహంకారం విర్రవీగిన గత పాలకుల 151 సీట్లు 11 అయ్యాయి. అందుకే నేల మీద ఉండి ప్రజలకు సేవ చెయ్యాలి. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నట్టు పనిచేయాలి. చిన్న కుటుంబంలోనే సమస్యలు ఉంటాయి. కూటమి అన్న తరువాత చిన్న చిన్న సమస్యలు ఉండటం సహజం. ఇగోలు పక్కన పెట్టి అందరిని కలుపుకొని పనిచేయాలి. రాసి పెట్టుకోండి విడాకులు ఉండవు. రాష్ట్రం బాగుపడాలి, ప్రజలు సంతోషంగా ఉండాలి అంటే మనం కలిసి ఉండాల్సిందే.. అని నారా లోకేశ్ వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa