హిందువుల ఆధ్యాత్మిక క్షేత్రం, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు కొలువైన తిరుమలకు నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. దేశ దేశాల నుంచి కూడా కోనేటి రాయుడి దర్శనం కోసం కదలి వస్తుంటారు. ఈ నేపథ్యంలో శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు తీసుకుంటోంది. అలాగే భక్తుల విశ్వాసాలకు భంగం వాటిల్లకుండా... ఆగమ శాస్త్ర నియమ నిబంధనల ప్రకారం తిరుమలలో అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తోంది. అయితే అప్పుడప్పుడూ తిరుమలలో అపచారం ఘటనలు చోటు చేసుకోవటం చూస్తూనే ఉన్నాం. తిరుమలలో డ్రోన్ల సంచారం వంటి వార్తలు వింటూ విన్నాం. ఇలాంటి వాటిని కట్టడి చేసేందుకు టీటీడీ చర్యలు తీసుకుంటోంది.
ప్రస్తుతం డ్రోన్ల ద్వారానే దాడులు జరుగుతున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. భారత్, పాకిస్థాన్, ఉక్రెయిన్, రష్యా మధ్యన కూడా ఇలాంటి డ్రోన్ల దాడులు జరిగిన సంగతి తెలిసిందే. దీంతో చిన్న పరికరమే కదా అని తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలోనే శ్రీవారి భక్తుల భద్రతను దృష్టిలో పెట్టుకుని తిరుమలలో యాంటీ డ్రోన్ టెక్నాలజీని తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇటీవల జరిగిన టీటీడీ పాలకమండలి సమావేశంలోనూ దీనిపై చర్చ జరిగింది. తిరుమలలో యాంటీ డ్రోన్ టెక్నాలజీ తెచ్చేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను పాలకమండలి ఆదేశించింది. అలాగే డీఆర్‌డీవో సిఫార్సుతో ఇజ్రాయెల్‌కు చెందిన ప్రముఖ సంస్థ నుంచి యాంటీ డ్రోన్ పరికరం కొనేందుకు ప్రతిపాదనలు కూడా సిద్ధం చేశారు. దీనిపై డెమో కూడా ఇవ్వనున్నట్లు తెలిసింది.
మరోవైపు దేశంలోని పరిస్థితుల దృష్ట్యా తిరుమలలో భద్రతను మరింత పటిష్టం చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తిరుమల భద్రతపై శుక్రవారం సమీక్ష జరిపారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా.. ఆ తర్వాత తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీటీడీ ఈవో శ్యామలరావు, తిరుపతి ఎస్పీ, టీటీడీ ఇంఛార్జి సీవీఎస్‌వో హర్షవర్ధన్ రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిరుమలలో భక్తుల భద్రత కోసం తీసుకుంటున్న చర్యలను టీటీడీ ఇంఛార్జి సీవీఎస్‌వో హర్షవర్ధన్ రాజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఏపీ డీజీపీ.. అంతర్జాతీయంగా తిరుమలకు ఉన్న ప్రత్యేకతను పరిగణనలోకి తీసుకుని తిరుమలలో మెరుగైన భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. టీటీడీ సెక్యూరిటీ, సివిల్ పోలీసులు ఇతరత్రా విభాగాలతో పాటుగా అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనే సామర్థ్యమున్న డిజాస్టర్ మేనేజ్‌మెంట్ టీమ్ ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే అలిపిరి వద్ద మల్టీ లెవల్ వెహికల్ చెకింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని.. కేంద్ర రక్షణ సంస్థలతో కలిసి సెన్సార్ ప్లే సిస్టమ్ సహా ఆధునిక భద్రతా పరికరాలు సమకూర్చుకోవాలని సూచించారు. సైబర్ భద్రతా వ్యవస్థను కూడా మరింత పటిష్ట పరుచుకోవాలని ఏపీ డీజీపీ సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa