ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అంతరిక్షంలో వింత వస్తువు.. ప్రతి 44 నిమిషాలకు భూమికి సంకేతాలు

international |  Suryaa Desk  | Published : Mon, Jun 02, 2025, 11:45 PM

మనసూ, విశ్వం.. రెండు ఒక్కలాగే.. మనసులో చెలరేగే కోరికలకు అంతుండదు.. విశ్వంలో మనకు తెలియని రహస్యాలకు అంతం ఉండదు. చిన్నప్పుడు మేడపై పడుకుని ఆకాశంలో కనిపించే చుక్కలు, నక్షత్రాలు, చందమామను లెక్కెట్టుకుంటూ అదే విశ్వమనుకుంటాం.. ఇక ఎదిగే కొద్దీ, చదివే కొద్దీ మనకు తెలియని ఖగోళ రహస్యాలు ఒక్కొక్కటిగా బోధపడుతూ వస్తాయి. అలా తెలుసుకునే కొద్దీ.. మనకు తెలియని వింతలెన్నో, మన కళ్లముందు సాక్షాత్కరిస్తాయి. విశ్వాంతరాళానికి సంబంధించిన అలాంటి వింతే మరొకటి బయటపడింది. ఆస్ట్రేలియాకు చెందిన ఖగోళ శాస్త్రవేత్తల పరిశోధనల్లో ఈ కొత్త విషయం బయటపడింది. విశ్వ రహస్యాలకు సంబంధించి.. ఇది గతంలో ఎన్నడూ చూడని సరికొత్త విషయమని ఆస్ట్రేలియా ఖగోళ శాస్త్రవేత్తలు చెప్తున్నారు.


ఏమిటా వింత.. ఎక్కడిదా రహస్యం..?


ఏలియన్స్.. విశ్వం గురించి చర్చకు వస్తే.. మనకు తట్టే మొదటి పదం. భూమి మీద మనం నివశిస్తున్నట్టే.. విశ్వంలో అనేక గ్రహాలు ఉన్నాయని.. ఆ గ్రహాలపైనా జీవం ఉందనేది శాస్త్రవేత్తలు చెప్పేమాట. అలాంటి ఇతర గ్రహాలలోనూ మనకు మాదిరిగానే ప్రాణులు ఉన్నాయని.. వాటిని గ్రహాంతర వాసులు (ఏలియన్స్) అంటారని మనకు తెలిసిందే. ఇలాంటి ఏలియన్స్ గురించి ఎన్నో వార్తలు వింటూనే ఉన్నాం. పళ్లెం రూపంలో ఆకాశంలో వింత వస్తువు కనిపించిందని.. అది ఏలియన్స్ వాహనమని, లేదు అమెరికాలో ఏలియన్స్‌పై ఓ ప్రాంతంలో పరిశోధనలు జరుగుతున్నాయనే కథనాలు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు విశ్వానికి సంబంధించి కొత్త రహస్యం ఆస్ట్రేలియా శాస్త్రవేత్తల పరిశోధనల్లో వెల్లడైంది..


ఆస్ట్రేలియా ఖగోళ శాస్త్రవేత్తలు ఒక కాస్మిక్ వస్తువును కనుగొన్నారు. ఆ వస్తువు అంతరిక్షం నుంచి ప్రతి 44 నిమిషాలకు భూమి మీదకు రేడియో, ఎక్స్‌రే సిగ్నల్స్ పంపుతున్నట్లు గుర్తించారు. ఆ వస్తువుకు ASKAP J1832-0911 అనే పేరు కూడా పెట్టారు. ఇది ఇంతకు ముందెన్నడూ జరగలేదని వారు చెప్తున్నారు. ఆస్ట్రేలియన్ స్క్వేర్ కిలోమీటర్ ఎర్రే పాత్‌ఫైండర్ (ASKAP), నాసాకు చెందిన చంద్ర ఎక్స్ - రే అబ్జర్వేటరీని ఉపయోగించి ఈ విషయాన్ని గుర్తించారు. ప్రతి 44 నిమిషాలకు అంతరిక్షం నుంచి ఆ వస్తువు ద్వారా రేడియో, ఎక్స్‌రే సిగ్నల్స్ వస్తున్నాయని.. కనీసం 2 నిమిషాల పాటు ఆ సిగ్నల్స్ ఉంటున్నాయని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు చెప్తున్నారు.


ఈ విషయం శాస్త్రవేత్తలను ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ఆ కాస్మిక్ వస్తువును లాంగ్ పీరియడ్ ట్రాన్సియంట్‌గా ఆస్ట్రేలియా ఆస్ట్రోనాట్స్ చెప్తున్నారు.


అంతరిక్షం నుంచి ప్రతి 44 నిమిషాలకు సంకేతాలు.. కారణమేంటి?


ASKAP J1832-0911 కాస్మిక్ వస్తువు నక్షత్రాల మాదిరిగా ప్రవర్తించడం లేదు. ఈ వస్తువు చాలా ఎక్కువగా సిగ్నల్స్ పంపుతోంది. అలాగే స్థిరమైన వ్యవధిలో ఆ సంకేతాలను పంపుతోంది. అది కూడా ప్రతి 44 నిమిషాలకు ఆన్ అండ్ ఆఫ్ తరహాలో సంకేతాలను పంపుతూ ఉండటంతో శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోతున్నారు. అయితే ఖగోళ శాస్త్రవేత్తలు ASKAP J1832-0911ను ఒక రకమైన మాగ్నెటార్‌గా పేర్కొంటున్నారు. ఇదో చనిపోయిన నక్షత్రం అవశేషమని.. అయితే దీనికి అత్యంత అయస్కాంత శక్తి ఉన్నట్లుగా భావిస్తున్నారు. అయితే ప్రతీ 44 నిమిషాలకు సంకేతాలు పంపడం వెనుక ఉన్న అసలు కారణాన్ని మాత్రం విశ్లేషించలేకపోతున్నారు.


అయితే ఈ కాస్మిక్ వస్తువును గుర్తించడం.. ఖగోళ శాస్త్ర పరిశోధనల్లో ఉపకరించనుంది. దీనిని గుర్తించడంలో ఆస్ట్రేలియాకు చెందిన ASKAP, నాసాకు చెందిన చంద్ర అబ్జర్వేటరీ కీలకంగా పనిచేశాయి. ఈ నేపథ్యంలో ఇదే అబ్జర్వేటరీలను ఉపయోగించి ఆకాశంలో ఇలాంటి సిగ్నల్స్ కోసం శోధించాలని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ASKAP J1832-0911 వంటి ఇతర వస్తువులను గుర్తించడం ద్వారా.. విశ్వ రహస్యాలను మరిన్ని తెలుసుకోవచ్చని భావిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa