సొంతంగా వ్యాపారం చేసుకునే వారికి, ఫ్రీలాన్సర్‌లకు, లాయర్స్, డాక్టర్లు వంటి స్వయం ఉపాధి నిపుణులకు పర్సనల్ లోన్ తీసుకోవడం అనేది చాలా అవసరం కావొచ్చు. ఉద్యోగం చేసే వారికి లోన్ ఇవ్వడం బ్యాంకులకు కొంత సులువు. కానీ, స్వయం ఉపాధి పొందే వారికి బ్యాంకులు లోన్ ఇచ్చే ముందు కొన్ని విషయాలను చాలా జాగ్రత్తగా చూస్తాయి. ఎందుకంటే, వారికి నెలవారీ స్థిరమైన జీతం ఉండదు కాబట్టి, ఆదాయం హెచ్చుతగ్గులకు లోనవుతుంది.
ఉద్యోగం చేసే వారు vs స్వయం ఉపాధి పొందే వారు..
ఉద్యోగం చేసే వారు: వీరికి యజమాని నుంచి స్థిరమైన జీతం వస్తుంది. గ్రాట్యుటీ, పీఎఫ్, ఆరోగ్య బీమా, ఉద్యోగ భద్రత వంటి ప్రయోజనాలు ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగులు, బ్యాంక్ ఉద్యోగులు, మీడియా సంస్థల్లో పనిచేసే నిపుణులు ఈ కోవలోకి వస్తారు.
స్వయం ఉపాధి పొందే వారు: వీరు ఫ్రీలాన్సర్‌లుగా లేదా వ్యాపార యజమానులుగా ఉంటారు. వారి ఆదాయం పనితీరు లేదా లాభాలపై ఆధారపడి మారుతూ ఉంటుంది. వీరికి స్థిరమైన నెలవారీ జీతం ఉండదు, ఉద్యోగ ప్రయోజనాలు ఉండవు. వారి ఆదాయం గణనీయంగా హెచ్చుతగ్గులకు లోనవుతుంది.
ఈ తేడాల వల్ల, స్వయం ఉపాధి పొందే వారికి పర్సనల్ లోన్ ప్రక్రియ కఠినంగా ఉంటుంది. బ్యాంకులు ఎక్కువగా వారి ఆర్థిక సామర్థ్యం, స్థిరత్వం, క్రెడిట్ స్కోర్, ఆదాయ స్థిరత్వం, గతంలో అప్పులు ఎగవేసిన చరిత్ర మొదలైన వాటిపై దృష్టి పెడతాయి. రిస్కును తగ్గించుకోవడానికి, అప్పు తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని నిర్ధారించుకోవడానికి సరైన డాక్యుమెంట్లు కూడా చాలా ముఖ్యం.
పర్సనల్ లోన్ కోసం స్వయం ఉపాధి నిపుణులు తెలుసుకోవాల్సిన 5 ముఖ్య విషయాలు..
వివిధ బ్యాంకులు స్వయం ఉపాధి పొందే వారి దరఖాస్తులను ఆదాయం, వయస్సు, క్రెడిట్ అర్హత, క్రెడిట్ ప్రొఫైల్, క్రెడిట్ స్కోర్, వ్యాపార స్థిరత్వం వంటి అంశాల్ని పరిశీలిస్తాయి. ఉదాహరణకు, ఐసీఐసీఐ బ్యాంక్ స్వయం ఉపాధి పొందే వ్యక్తులకు 23 నుంచి 65 సంవత్సరాల వయస్సు ఉండాలని, ప్రస్తుత వ్యాపారంలో కనీసం రెండు సంవత్సరాల అనుభవం, మొత్తం మూడు సంవత్సరాల అనుభవం ఉండాలని కోరుతుంది. అంతేకాకుండా, 750 కంటే ఎక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్న వారికి రుణాలు ఇవ్వడానికి ప్రాధాన్యత ఇస్తుంది. కాబట్టి, లోన్ దరఖాస్తు చేసే ముందు మీ బ్యాంక్‌ను సంప్రదించి, మీ అర్హత ప్రమాణాలను చర్చించడం తెలివైన పని.
ఉద్యోగం చేసే వారికి నెలవారీ కనీస ఆదాయం రూ. 25,000 అవసరం కాగా, స్వయం ఉపాధి పొందే వారు మరింత ఎక్కువ ఆదాయాన్ని చూపించాల్సి ఉంటుంది. కొన్ని బ్యాంకులు, ఇండస్ఇండ్ బ్యాంక్ వంటివి, స్వయం ఉపాధి పొందే వారికి పన్ను తర్వాత సంవత్సరానికి కనీసం రూ. 4.8 లక్షల ఆదాయం ఉండాలని నిబంధన విధించాయి.
ఇక స్వయం ఉపాధి పొందే వారికి వడ్డీ రేట్లు వారి క్రెడిట్ ప్రొఫైల్, బ్యాంక్ పాలసీలను బట్టి మారుతుంటాయి. సాధారణంగా, ఉద్యోగుల కంటే వీరికి వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకు, ఐసీఐసీఐ బ్యాంక్ పర్సనల్ లోన్‌లను 10.85 శాతం వార్షిక వడ్డీ రేటుతో అందిస్తుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 10.90 - 24 శాతం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 10.30 - 15.30 శాతం, కోటక్ బ్యాంక్ 10.99 శాతం నుంచి వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. అందుకే లోన్ తీసుకునే ముందు వడ్డీ రేట్లను పోల్చుకోవడం ముఖ్యం.
అవసరమైన డాక్యుమెంట్లు..
స్వయం ఉపాధి పొందే వారు పర్సనల్ లోన్ కోసం కొన్ని నిర్దిష్ట డాక్యుమెంట్లను సమర్పించాలి. గుర్తింపు, పేరు, అడ్రస్ ప్రూఫ్ కోసం ఇక్కడ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ వంటివి ఇవ్వాల్సి ఉంటుంది. వ్యాపార రుజువుగా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లు, బ్యాంక్ స్టేట్‌మెంట్లు మొదలైనవి. ఆదాయ రుజువుగా గత రెండు మూడు సంవత్సరాల ఆదాయపు పన్ను రిటర్న్‌లు, వ్యాపార లావాదేవీలను చూపే ఒరిజినల్ బ్యాంక్ స్టేట్‌మెంట్లు. ఈ పత్రాలు అప్పు తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని అంచనా వేయడానికి బ్యాంకులకు సహాయపడతాయి.
క్రెడిట్ స్కోర్ ప్రాముఖ్యత..
చివరగా, చాలా ముఖ్యమైనది, మంచి క్రెడిట్ స్కోర్.. స్వయం ఉపాధి పొందే వ్యక్తులకు పర్సనల్ లోన్ ఆమోదం పొందే అవకాశాలను బాగా పెంచుతుంది. చాలా బ్యాంకులు 750 లేదా అంతకంటే ఎక్కువ క్రెడిట్ స్కోర్‌ను రుణాలు ఇవ్వడానికి అనుకూలంగా భావిస్తాయి. సకాలంలో అప్పులు తిరిగి చెల్లించడం, రుణాలను బాధ్యతాయుతంగా నిర్వహించడం ద్వారా మంచి క్రెడిట్ హిస్టరీని నిర్వహించడం చాలా ముఖ్యం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa