పహల్గామ్ ఉగ్రదాడి ఘటనను తీవ్రంగా పరిగణించిన భారత్.. పాకిస్తాన్ పట్ల కఠిన వైఖరిని కనబరుస్తోన్న సంగతి తెలిసిందే. ఉగ్రదాడి పట్ల సీరియస్‌గా ఉన్న భారత్, పాకిస్తాన్‌కు షాకిచ్చేలా కీలక నిర్ణయాలు తీసుకుంది. ‘‘వాణిజ్యం-ఉగ్రవాదం, నీరు- రక్తం, బుల్లెట్లు-చర్చలు కలిసి సాగలేవు’’ అన్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటనను నిజం చేస్తూ, ఇండియా వ్యూహాత్మక నిర్ణయాలను ప్రకటించింది. సింధు జలాల ఒప్పందం నిలిపేయడం ఇందులో చాలా కీలకమైన నిర్ణయం.
భారత్ నిర్ణయంతో ఆందోళనలో పాకిస్థాన్..
భారత్ ఈ నిర్ణయాన్ని ప్రకటించినప్పటి నుంచి, పాకిస్తాన్ తీవ్ర ఆందోళన చెందుతోంది. ఇప్పటి వరకూ భారత జలశక్తి మంత్రిత్వ శాఖకు పాకిస్థాన్ నాలుగు లేఖలు పంపింది. మే నెలలో మొదటి లేఖ పంపగా, ఆ తర్వాత పాకిస్తాన్ జలవనరుల శాఖ కార్యదర్శి సయ్యద్ అలీ ముర్తజా మరో మూడు విజ్ఞప్తులను పంపారు. అయితే జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి దేబాశ్రీ ముఖర్జీ.. ముర్తజాకు స్పష్టమైన లేఖ రాశారు. సరిహద్దు ఉగ్రవాదానికి భారత్ నిరంతరం బాధిత దేశంగా ఉందని ఆయన లేఖలో పేర్కొన్నారు. ‘‘1960 నాటి ఒప్పందానికి ఆధారమైన పరస్పర విశ్వాసం, సహకారం స్ఫూర్తిని పాకిస్తాన్ దెబ్బతీసింది’’ అని భారత్ స్పష్టం చేసింది. కేవలం ఉగ్రవాదానికి తోడు కొన్ని సాంకేతిక కారణాలు ఈ ఒప్పందాన్ని నిలిపివేయడానికి దారితీశాయని భారత్ పేర్కొంది.
ఇప్పటికే ప్రాజెక్టుల గేట్లు మూయడం ద్వారా సింధు జలాలను ఆపడం, ఆ తర్వాత ముందస్తు సమాచారం ఇవ్వకుండా దిగువకు వదలడం ద్వారా పాకిస్తాన్‌కు చుక్కలు చూపిస్తోంది.
జల వనరులపై భారత్ వ్యూహాత్మక దృష్టి
సింధు జలాల ఒప్పందాన్ని నిలిపేసిన తర్వాత.. భారతదేశం సింధు నదీ వ్యవస్థకు సంబంధించిన వ్యూహాత్మక ప్రాజెక్టులపై దృష్టి సారించింది. బియాస్ నదిని గంగా కాలువకు అనుసంధానించే 130 కిలోమీటర్ల కాలువ నిర్మాణం ఇందులో కీలకమైంది. దీన్ని యమునా నది వరకు పొడిగించే ప్రతిపాదన కూడా ఉంది. ఈ ప్రాజెక్ట్ దాదాపు 200 కిలోమీటర్లు ఉండగా.. 12 కిలోమీటర్ల సొరంగం యమునా జలాలను గంగాసాగర్‌కు చేర్చడానికి వీలు కల్పిస్తుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఢిల్లీ, హర్యానా, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాలకు గణనీయంగా ప్రయోజనం చేకూరనుంది. ఈ పనులు వేగంగా జరుగుతున్నాయని, రాబోయే రెండు మూడేళ్లలో పూర్తవుతాయని ప్రభుత్వం తెలిపింది. వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదిక కూడా సిద్ధం చేస్తున్నారు.
జోక్యం చేసుకోలేమన్న ప్రపంచ బ్యాంక్
భారత్ సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం వల్ల.. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థపై, ముఖ్యంగా రబీ పంటల సాగుపై గణనీయమైన ప్రభావం పడుతుంది. ఖరీఫ్ సీజన్‌పై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చని అంచనా. వ్యవసాయంతోపాటు పాకిస్తాన్‌లో సాధారణ జన జీవితం సైతం భారత్ నిర్ణయం వల్ల ప్రభావితం అవుతుంది. సింధు జలాల లభ్యత తగ్గడం అనేది పాకిస్తాన్‌లో సంక్షోభానికి దారితీసే అవకాశం ఉంది. దీంతో ఈ సమస్య పరిష్కారం కోసం పాకిస్తాన్ ప్రపంచ బ్యాంక్‌ను ఆశ్రయించింది. అయితే, భారతదేశ అంతర్గత నిర్ణయంలో జోక్యం చేసుకోవడానికి ప్రపంచ బ్యాంక్ నిరాకరించింది.
ఒప్పందం పునఃసమీక్షకు భారత్ పట్టు
ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా సింధు జలాల ఒప్పందాన్ని పునఃసమీక్షించాలని, పునః చర్చించాలని భారత్ నొక్కి చెబుతోంది. 1950, 1960లలో రూపొందించిన ఈ ఒప్పందం.. మారుతున్న జల నమూనాలు, హిమానీనదాలు కరగడం, జనాభా పెరుగుదల, నీటి నిర్వహణ అవసరం లాంటి ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా లేదని భారత్ భావిస్తోంది. దీంతో ఒప్పందాన్ని ఆధునీకరించడం కోసం భారత్ ఒత్తిడి తెస్తున్నప్పటికీ, పాకిస్తాన్ మాత్రం పునః చర్చలకు ఒప్పుకోవడం లేదు. పాక్ వైఖరి ఒప్పందం నిబంధనలను ఉల్లంఘిస్తుందని భారత అధికారులు చెబుతున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత.. దేశ భద్రతను, సార్వభౌమత్వాన్ని కాపాడుకునే విషయంలో ఏమాత్రం రాజీ పడబోమని భారత్ స్పష్టం చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa