అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. పాకిస్తాన్‌పై పొగడ్తలు గుప్పించారు. పాక్‌లో బలమైన నాయకత్వం ఉందన్న ఆయన.. ఈ విషయాన్ని కొందరు అంగీకరించరంటూ భారత్‌ను ఉద్దేశించిన పరోక్ష వ్యాఖ్యలు చేశారు. భారత్- పాకిస్తాన్ ఉద్రిక్తతలను సద్దుమణిగేలా చేసింది తానేనని, ఇరు దేశాల మధ్య కాల్పులు విరమణ ఒప్పందం కుదిర్చింది తానేనని ట్రంప్ గొప్పలు చెప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఒప్పందంలో ఎవరి పాత్ర లేదని భారత్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. అయినా.. ట్రంప్.. యుద్ధం ఆపింది తానేనని చెప్పుకుంటున్నారు. తాజాగా మరో అడుగు ముందుకేసి పాకిస్తాన్‌లో నాయకత్వం బలంగా ఉందన్నారు.. యుద్ధాన్ని ఆపినందుకు తనకు భారత్ గుర్తింపు ఇవ్వడం లేదని ఫ్రస్టేషన్ వ్యక్తం చేశారు.
ట్రంప్ మాట్లాడుతూ "పాకిస్తాన్‌కు చాలా బలమైన నాయకత్వం ఉంది. నేను ఇది చెప్పడం కొంతమందికి నచ్చదు. కానీ ఇది నిజం. వారు(భారత్-పాక్) ఆ యుద్ధాన్ని ఆపేశారు. నేను వారి గురించి చాలా గర్వపడుతున్నాను. అయితే నాకు గుర్తింపు లభించిందా? లేదు. వారు నాకు దేనికీ గుర్తింపు ఇవ్వరు." అన్నారు. అయితే ట్రంప్ భారత్ పేరును నేరుగా ప్రస్తావించకుండా, మే 10న జరిగిన కాల్పుల విరమణ గురించి మాట్లాడారు. ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్ సైనిక చర్య చేపట్టిన క్రమంలో, పాకిస్తాన్ తన శాంతి విజ్ఞప్తికి స్పందించిందని ట్రంప్ పేర్కొన్నారు. కానీ భారత్ మాత్రం తన ప్రయత్నాలను గుర్తించలేదన్నారు.
ఈ విషయంలో విదేశీ మధ్యవర్తిత్వం లేదని భారత్ చెబుతూనే ఉంది. ఏప్రిల్ 22న జమ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టిందని.. ఈ ఉద్రిక్తతలను తగ్గించడానికి ఏకపక్షంగానే కాల్పుల విరమణ జరిగిందని, ఇందులో ఎవరి ప్రమేయం లేదని స్పష్టం చేసింది.
ఆపరేషన్ సిందూర్ విషయంలో పాకిస్థాన్ కుటిల బుద్ధిని ప్రపంచవేదికపై ఎండగట్టేందుకు దౌత్య పర్యటనలో ఉన్న కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్.. ఈ విషయంపై భారత్ వైఖరిని చెబుతూనే ఉన్నారు. "ఉద్రిక్తతలను కొనసాగించడంలో భారత్‍కు ఆసక్తి లేదని మేము మొదటి నుంచి స్పష్టంగా చెబుతూనే ఉన్నాము. ఉగ్రవాదుల రెచ్చగొట్టే చర్యలకు ప్రతిస్పందనగానే ఆపరేషన్ సిందూర్ చేపట్టాం. కాల్పుల విరమణలో ఇందులో ఎవరి ప్రమేయం లేదు" అని స్పష్టం చేశారు.
భారత్- పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన క్రమంలో తాను ఇరు దేశాల మధ్య అణు యుద్ధం ఆపానని ట్రంప్ చెప్పుకున్నారు. "నేను చాలా గర్వపడే ఒప్పందం ఇది. ఇక్కడ మనం భారత్, పాకిస్తాన్‌తో డీల్ చేస్తున్నాము. బుల్లెట్ల ద్వారా కాకుండా వాణిజ్యం ద్వారా అణు యుద్ధాన్ని ఆపగలిగాము" అని ట్రంప్ ఈ నెల ప్రారంభంలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో అన్నారు. ట్రంప్ వ్యాఖ్యలపై భారత రాజకీయ వర్గాల్లో తీవ్ర స్పందన వ్యక్తమవుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మౌనంపై ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వ అధికారులు మాత్రం ట్రంప్ వాదనలను కొట్టిపారేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa